Ukraine War: రష్యా – యుక్రెయిన్ యుద్ధానికి ఏడాది… గెలిచిందెవరు… ఓడిందెవరు…?

జనం చస్తున్నా ఇప్పుడే యుద్ధం ముగియడం ఎవరికీ ఇష్టం లేదు. ఉక్రెయిన్ ను ఆక్రమించకుండా రష్యా తగ్గలేదు. మొదలుపెట్టిన పోరాటాన్ని ఉక్రెయిన్ ఆపలేదు. ఆయుధసాయం పేరుతో యుద్ధం ముగియకుండా తమ కుయుక్తిని మిగిలిన దేశాలు ఆపలేవు... మొత్తంగా ఇప్పట్లో యుద్ధవిరమణ మాత్రం ఉండదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 23, 2023 | 01:00 PMLast Updated on: Feb 23, 2023 | 1:00 PM

A Year Since Russia Ukraine War

ఏడాదిలో ఏం సాధించావు పుతిన్… వేలమంది వీర సైనికుల్ని బలిచ్చావు… లక్షల కోట్ల ఆయుధాలను కుమ్మరించావు…. ఉక్రెయిన్్ను శిధిల సమాధిగా మార్చావు… కానీ దాన్ని నెగ్గలేకపోయావు… ఎందరికో కడుపుకోత మిగిల్చావు కానీ నీ కడుపుమంట మాత్రం తీర్చుకోలేకపోయావు… దేశాన్ని ఆంక్షల చట్రంలో బిగించావు…

ఏ సాధించావు జెలెన్ స్కీ… మాతృభూమి రక్షణ పేరిట మారణహోమానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచావు… పోరాట యోధుడిగా ప్రపంచం కీర్తిస్తుందేమో కానీ దాని వెనక నలిగిపోయిన వేలాది మంది ఉక్రెయినియన్లకు మాత్రం సమాధానం చెప్పలేవు… కళ్లెదుటే దేశం శిధిలమవుతుంటే నీ పోరాటానికి విలువుందా…? రాజీకీ వచ్చి ఉంటే ఎంతో కొంతమందిని కనీసం కాపాడుకునేవాడివి కాదా…? శత్రువుకు శత్రువు మిత్రుడంటూ అగ్రరాజ్యాలు నీతో ఆడుతున్న చదరంగాన్ని గుర్తించలేకపోయావు… అగ్రరాజ్యాల ఆయుధ సంపత్తి పరిశీలనకు నీ దేశాన్ని ప్రయోగశాలగా మార్చావు జెలెన్ స్కీ….

2022 ఫిబ్రవరి 24… రష్యా యుద్ధ ట్యాంకులు ఉక్రెయిన్ లోకి చొరబడ్డాయి.. యుద్ధవిమానాలు బాంబుల వర్షం మొదలుపెట్టాయి. మిస్సైళ్లు గర్జించాయి… నాటి నుంచి నేటి వరకు ఉక్రెయిన్ బాంబుల మోతతో దద్దరిల్లిపోతోంది. ఇంతకీ ఈ ఏడాది యుద్ధం సాధించిందేంటి…?

  • 50వేల మందిని బలితీసుకుంది
  • 60వేల మందిని అవిటి వాళ్లను చేసింది
  • 15వేల మంది ఆచూకీ తెలియకుండా చేసింది
  • లక్షన్నర భవనాలు కుప్పకూల్చింది
  • కోటీ 40లక్షల మందిని నిరాశ్రయులను చేసింది
  • 29 కోట్ల కోట్ల రూపాయల ఆస్తినష్టం

ఈ లెక్కలు చాలవా… యుద్ధం సృష్టించిన విధ్వంసమెంతో చెప్పడానికి…!

యుద్ధంలో మరణించిన వారిలో ఎక్కువ మంది సైనికులే… ఈ సంఖ్య అధికారికంగా 50వేలే… కానీ అనధికారికంగా ఇంకెంతో.. ఎందరు తల్లులకు ఈ యుద్ధం గుండెకోత మిగిల్చిందో… ఎందరి పసుపు కుంకుమలు తుడిచేసిందో… ఎంతమంది బిడ్డలకు కన్న తండ్రిని దూరం చేసిందో… మొత్తంగా ఎన్ని కుటుంబాలను నడివీధికి లాగిందో… వాహనాలెక్కి యుద్ధక్షేత్రానికి వెళుతూ కుటుంబంవైపు మసకబారిన కన్నులతో చూస్తున్న సైనికుల ఫోటోలు రష్యన్ల కళ్లలో కదలాడుతూనే ఉన్నాయి. కేరింతలు కొట్టాల్సిన ఉక్రెయిన్ బాల్యం బేస్్మెంట్లలో మగ్గిపోతోంది… రష్యా యవ్వనం తుపాకీ పట్టుకుని రణక్షేత్రంలో సమిధైపోతోంది.

ఆధిపత్యం కోసం, రష్యా చుట్టూ నాటో ముళ్లు మొలవకుండా పుతిన్ మొదలుపెట్టిన రక్తపాతం. అస్థిత్వం కోసం ఉక్రెయిన్ సాగించిన పోరాటం. ఒకరిది ఆధిపత్య అహం… మరొకరిది మాతృభూమి రక్షణ లక్ష్యం.. ఈ ఇద్దరి పోరాటంలో చలికాచుకుంటున్న మరికొన్ని అగ్రరాజ్యాలు.. పుతిన్ గెలవలేదు… జెలెన్ స్కీ గెలవనివ్వలేదు… కానీ రెండు దేశాల ప్రజలు మాత్రం ఓడిపోయారు…
అహం, అస్థిత్వానికి జరుగుతున్న పోరాటంలో దగాపడ్డారు.

ఏడాది పాటు సాగిన, ఇంకా సాగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్ సర్వనాశనమైంది… కోలుకోవడానికి కొన్ని దశాబ్దాలు పట్టేంత మరుభూమిగా మారిపోయింది. కూలింది భవనాలు కాదు.. ఉక్రెయిన్ పౌరుల అందమైన కలలు…

యుద్ధంలో రష్యాను ఓడించే శక్తి ఉక్రెయిన్్కు లేదు. కానీ పశ్చిమ దేశాల అండతో పంటి బిగువున పోరాడుతోంది. ఏడాదిగా ప్రయత్నిస్తున్నా ఉక్రెయిన్ కొరకరాని కొయ్యగానే రష్యాకు మిగిలిపోయింది. కీవ్ కు కావాల్సిన ఆయుధాలు అందిస్తూ అగ్రరాజ్యాలు యుద్ద జ్వాలలు చల్లారకుండా చితిని రగులుస్తూనే ఉన్నాయి. వాటికి కావాల్సింది ఉక్రెయిన్ గెలవడం కాదు.. రష్యా ఓడటం… యుద్ధం పేరుతో ఉక్రెయిన్ కు ఆయుధాలు అందిస్తూ వాటి ఆయుధ సంపత్తిని పరీక్షించుకుంటున్నాయి.

ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందంటే మాత్రం సమీప కాలంలో అని మాత్రం చెప్పలేం. జనం చస్తున్నా ఇప్పుడే యుద్ధం ముగియడం ఎవరికీ ఇష్టం లేదు. ఉక్రెయిన్ ను ఆక్రమించకుండా రష్యా తగ్గలేదు. మొదలుపెట్టిన పోరాటాన్ని ఉక్రెయిన్ ఆపలేదు. ఆయుధసాయం పేరుతో యుద్ధం ముగియకుండా తమ కుయుక్తిని మిగిలిన దేశాలు ఆపలేవు… మొత్తంగా ఇప్పట్లో యుద్ధవిరమణ మాత్రం ఉండదు. రెండు దేశాలు యుద్ధక్షేత్రంలో అలసిపోయాయి. అయినా ఆపలేని యుద్ధం ఇది.

(KK)