ఇక బౌలర్లకు చుక్కలే, సఫారీ బ్యాటింగ్ కోచ్ గా ఏబీడీ ?
ప్రపంచ క్రికెట్ లో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివీలియర్స్ కు ప్రత్యేకతే వేరు... గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్లు కొట్టే మొనగాడిగా పేరుతెచ్చుకున్నాడు. అందుకే అతన్ని మిస్టర్ 360గా పిలుస్తుంటారు. బౌలర్ ఎలాంటి బాల్ వేసి భారీ సిక్సర్లను అలవోకగా కొట్టేవాడు. ఒక్కోసారి అతనికి బౌలింగ్ చేసేందుకు స్టార్ పేసర్లు సైతం భయపడేవారు.
ప్రపంచ క్రికెట్ లో సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఏబీ డివీలియర్స్ కు ప్రత్యేకతే వేరు… గ్రౌండ్ లో అన్ని వైపులా షాట్లు కొట్టే మొనగాడిగా పేరుతెచ్చుకున్నాడు. అందుకే అతన్ని మిస్టర్ 360గా పిలుస్తుంటారు. బౌలర్ ఎలాంటి బాల్ వేసి భారీ సిక్సర్లను అలవోకగా కొట్టేవాడు. ఒక్కోసారి అతనికి బౌలింగ్ చేసేందుకు స్టార్ పేసర్లు సైతం భయపడేవారు. మ్యాచ్ ఫలితాన్ని ఒంటిచేత్తో మార్చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాంటి స్టార్ బ్యాటర్ ఇప్పుడు కొత్త రోల్ లో కనిపించబోతున్నాడు. అన్ని కుదిరితే డివీలియర్స్ ను సౌతాఫ్రికా బ్యాటింగ్ కోచ్ గా చూడొచ్చు. ప్రస్తుతం దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ గా ఉన్న డుమిని తన బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డుమిని బోర్డుకు తెలిపాడు. ఈ విషయాన్ని క్రికెట్ దక్షిణాఫ్రికా ధ్రువీకరించింది. వైట్‌బాల్ బ్యాటింగ్ కోచ్ పదవికి డుమిని రాజీనామా చేసినట్లు ప్రకటించింది.
సౌతాఫ్రికా జట్టుకు 15 ఏళ్ళ పాటు కీలక ఆటగాడిగా ఉన్న డుమినీ 46 టెస్టులు, 199 వన్డేలు, 81 టీ20లు ఆడాడు. గతేడాది మార్చిలో పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లకు బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యాడు. అతని బ్యాటింగ్ కోచ్ గా ఉండగానే దక్షిణాఫ్రికా జట్టు 2023 వన్డే ప్రపంచ కప్‌లో సెమీఫైనల్, 2024 టీ20 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. డుమినీ తప్పుకోవడంతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు కొత్త బ్యాటింగ్ కోచ్ వేటలో పడింది. ఈ స్థానాన్ని భర్తీ చేసే క్రమంలో పలువురి పేర్లను పరిశీలిస్తోంది. తర్వాతి బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్ బాధ్యతలు చేపట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
దీని కోసం సఫారీ బోర్డు ఇప్పటికే అతన్ని సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఏబీడీ ఈ బాధ్యతలు తీసుకునేందుకు అంగీకరించాడా లేదా అనేది మాత్రం తెలియలేదు. ప్రస్తుతానికి ఏబీ ఎలాంటి క్రికెట్ ఆడటం లేదు. ఐపీఎల్ సహా అన్ని ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలకు గుడ్ బై చెప్పాడు. సౌతాఫ్రికా తరపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ ట్వంటీలు ఆడాడు. ఐపీఎల్ లోనూ ఢిల్లీ క్యాపిటల్స్ , బెంగళూరు జట్లకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ 184 మ్యాచ్ లు ఆడాడు. గతంలో ఐపీఎల్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మెంటార్ గా వ్యవహరిస్తాడని వార్తలు వచ్చినా ఏబీడీ అలాంటి బాధ్యతలు ఏమీ తీసుకోలేదు. మరి తన జాతీయ జట్టుకు సేవలందిస్తాడో లేదో చూడాలి.