సెంచరీల మీద సెంచరీలు అభిమన్యుకు ఛాన్స్ దక్కేనా ?

గత కొంతకాలంగా టీమిండియాలో ప్లేస్ కోసం ఫార్మాట్ తో సంబంధం లేకుండా విపరీతమైన పోటీ పెరిగింది. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్న పలువురు యువ క్రికెటర్లు సెలక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఈ జాబితాలోకే వస్తాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2024 | 01:19 PMLast Updated on: Oct 15, 2024 | 1:19 PM

Abhimanyu Eshwaran Good Performance In Domestic Cricket

గత కొంతకాలంగా టీమిండియాలో ప్లేస్ కోసం ఫార్మాట్ తో సంబంధం లేకుండా విపరీతమైన పోటీ పెరిగింది. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్ లో దుమ్మురేపుతున్న పలువురు యువ క్రికెటర్లు సెలక్టర్ల పిలుపు కోసం ఎదురుచూస్తున్నారు. బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ ఈ జాబితాలోకే వస్తాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో సూపర్‌ ఫామ్‌ కొనసాగిస్తూ టీమిండియా సెలక్టర్లకు గట్టి సవాల్‌ విరుసుతున్నాడు. వరుసగా నాలుగు సెంచరీలు బాది అరంగేట్రానికి తాను రెడీగా ఉన్నాననే సంకేతాలు ఇచ్చాడు. కివీస్ తో సిరీస్ కే ఎంపికవుతాడని భావించినా సెలక్టర్లు బంగ్లాపై ఆడిన జట్టునే కొనసాగించారు.అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఇప్పుడు తనను పరిగణలోకి తీసుకునే పరిస్థితిని ఈ బెంగాల్ క్రికెటర్ కల్పించాడు. ఉత్తరాఖండ్‌లో జన్మించిన అభిమన్యు ఈశ్వరన్‌ దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌ జట్టుకు ఆడుతున్నాడు. తాజా రంజీ ట్రోఫీ ఎడిషన్‌లో ఉత్తరప్రదేశ్‌ పై తొలి ఇన్నింగ్స్ లో 5 రన్స్ కే ఔటైనా… సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం దుమ్మురేపాడు.

కీలక ఇన్నింగ్స్ ఆడి 127 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఇటీవలి కాలంలో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అభిమన్యుకు ఇది వరుసగా నాలుగో సెంచరీ. ఓవరాల్ గా అతని కెరీర్ లో ఇది 27వ శతకం. దులిప్‌ ట్రోఫీలో రెండు శతకాలు బాదిన అభిమన్యు.. ఇరానీ కప్‌లోనూ సెంచరీతో మెరిశాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నప్పటకీ అభిమన్యు ఈశ్వరన్ కు జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కడం లేదు. కివీస్ తో సిరీస్ కోసం బ్యాకప్ ఓపెనర్ ఆప్షన్ ఉన్నా స్వదేశంలోనే ఆడుతుండడంతో బీసీసీఐ ఎవ్వరినీ ఎంపిక చేయలేదు. అయితే ఆస్ట్రేలియాతో పర్యటనలో మాత్రం టీమిండియా ఈ రిస్క్‌ తీసుకునే పరిస్థితి లేకపోవడంతో బ్యాకప్‌ ఓపెనర్‌ను ఎంపిక చేయాల్సింది.

ప్రస్తుత ఫామ్‌ దృష్ట్యా ఈసారి అభిమన్యు ఈశ్వరన్‌ కు చోటు దక్కే అవకాశముంది. ఒకవేళ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులకు దూరమయ్యే ఛాన్స్ ఉందన్న వార్తల నేపథ్యంలో తుది జట్టులోనూ అతను ఆడే అవకాశాలున్నాయి. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఈ బెంగాల్ క్రికెటర్ కు అద్భుతమైన రికార్డుంది. పదేళ్ళ కెరీర్ లో ఇప్పటి వరకూ 98 మ్యాచ్ లు ఆడి 7500 పైగా రన్స్ చేశాడు. 50 యావరేజ్ తో 26 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు చేసిన అభిమన్యు ఈశ్వరన్ ఓపెనర్ గా భారీ ఇన్నింగ్స్ లు ఆడిన రికార్డుంది.