Abhishek Bachchan: అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ…! ఫ్యాక్ట్‌చెక్‌

బిగ్‌బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న వార్త బాలీవుడ్ సర్కిల్స్‌లో తెగ షికారు చేసింది. తండ్రి బాటలోనే ప్రయాగ్‌రాజ్‌ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని ప్రచారం కూడా జోరుగానే సాగింది. అయితే ఇది నిజమేనా..? అభిషేక్ నిజంగానే పాలిటిక్స్‌లోకి వస్తాడా..?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 16, 2023 | 12:47 PMLast Updated on: Jul 16, 2023 | 12:47 PM

Abhishek Bachchans Friends Deny The News That He Will Enter Politics

అమితాబ్‌ వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన అభిషేక్ బచ్చన్‌.. బిగ్‌బీ స్థాయిలో మాత్రం పేరు తెచ్చుకోలేకపోయాడు. స్టార్‌ హీరోగా మారకపోయినా అడపదడపా సినిమాల్లో మెరుస్తూనే ఉన్నారు. స్పోర్ట్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నారు. ఆయన తల్లి జయాబచ్చన్ సమాజ్‌వాదీ పార్టీ తరపున రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. తాజాగా అభిషేక్ రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం సాగింది. గతంలో తన తండ్రి పోటీ చేసిన ప్రయాగ్‌రాజ్‌ నుంచే అభిషేక్ బరిలోకి దిగుతారని ఇందుకు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ కూడా ఓకే అన్నారని వార్తలు వచ్చాయి. అమితాబ్‌ తన మిత్రుడు రాజీవ్‌గాంధీ సూచనలతో 1984లో ప్రయాగ్‌రాజ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి లోక్‌దళ్ అభ్యర్థి బహుగుణపై లక్షకు పైగా మెజారిటీతో గెలిచారు. దీంతో సెంటిమెంట్‌గా అభిషేక్ అక్కడి నుంచే పోటీ చేస్తారని చెప్పుకున్నారు. అయితే అభిషేక్ పొలిటికల్ ఎంట్రీ వార్తలు ఫేక్ అంటున్నారు ఆయన సన్నిహితులు. ఈ ప్రచారం ఎలా మొదలైందో తమకు తెలియదని.. ప్రస్తుతానికి అభిషేక్‌కు అలాంటి ఆలోచన ఏమీ లేదని చెబుతున్నారు. అభిషేక్ చేతినిండా ప్రాజెక్టులున్నాయని వేరే ఆలోచనలేమీ లేవని వారు చెప్పుకొస్తున్నారు.

అమితాబ్‌ బచ్చన్‌, రాజీవ్‌గాంధీ మంచి ఫ్రెండ్స్‌.. 1984లో ఇందిర మరణాంతరం జరిగిన ఎన్నికల్లో రాజీవ్‌ సూచనలతో అమితాబ్‌ నేటి ప్రయాగ్‌రాజ్‌.. నాటి అలహాబాద్‌లో ఎంపీగా పోటీ చేశారు. లక్షా90వేల ఓట్లకు పైగా మెజారిటీతో గెలిచారు. అప్పటివరకూ దేశంలో అదే రికార్డు. అయితే రాజకీయాల్లో అమితాబ్‌ అంతగా సక్సెస్‌ కాలేకపోయారు. మూడేళ్ల తర్వాత ఎంపీగా రాజీనామా చేసి సినిమాలపై ఫోకస్ చేశారు. అప్పట్నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కాంగ్రెస్‌కు కూడా దూరమయ్యారు. కష్టసమయంలో తమను ఆదుకున్న అమర్‌సింగ్‌ సలహాతో సమాజ్‌వాదీపార్టీకి దగ్గరయ్యారు. జయాబచ్చన్‌ మాత్రం పాలిటిక్స్‌లో కాస్త యాక్టివ్‌గా ఉన్నారు. తండ్రి రాజకీయ అనుభవం నుంచి అభిషేక్ ఎంతో కొంత నేర్చుకున్నట్లే కనిపిస్తోంది. ఆ రొంపిలోకి దిగకూడదని భావిస్తున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కూడా రాజకీయాలపై తన వైఖరేంటో స్పష్టంగా చెప్పేశారు. రాజకీయాలకు తను సూట్‌ కానని.. సినిమాల్లో రాజకీయ నాయకుడి పాత్ర పోషిస్తాను కానీ నిజజీవితంలో కాదని తేల్చేశారు. ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదన్నారు. అయితే కాలంతో పాటు మనిషి అభిప్రాయాలు మారతాయి. అలాగే అభిషేక్ కూడా రాజకీయాల్లోకి వస్తాడేమో అనుకున్నారు. కానీ ఆయన వైఖరి ఏ మాత్రం మారలేదని.. రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సో అభిషేక్ పొలిటికల్ ఎంట్రీ వార్తలు ఫేక్ అన్నమాట. కథలు అల్లిన వారెవరో కానీ కాస్త నమ్మేలానే ప్రచారం చేశారు. కానీ వాటిని అభిషేక్ సన్నిహితులు ఖండించడంతో ప్రచారానికి చెక్ పడింది.