Indian Tourism: యూట్యూబ్, ఇన్ స్టా వీడియోలే స్పూర్తి.. టూరిజంపై పెరుగుతున్న భారతీయుల ఆసక్తి
విహారం ఒక వరం అంటారు కొందరు. ఎందుకంటే మానసిక ప్రశాంతతో పాటూ శారీరక ఉత్తేజాన్ని అందించడంలో దివ్యౌషధంలా పనిచేస్తుంది ప్రకృతి. వాటి అందాలను చూడాలంటే ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకోవాల్సిందే. అందుకే మన భారతదేశంలో విహార యాత్రలకు వెళ్లే వారి శాతం ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగింది. అది కూడా యూట్యూబ్, ఇన్ స్టా లో వీడియోలు చూసి స్పూర్తి పొందినట్లు తాజాగా ఒక నివేదికలో వెలువడింది.

According to a Bookings.com report, Indians are mostly interested in tourism by watching YouTube and Instagram videos.
ప్రస్తుతం సమాజంలో ప్రతి ఒక్కరూ యూట్యూబ్, ఇన్ స్టా, ట్విట్టర్ లాంటి సామాజిక మాధ్యమాలను తెగ ఫాలో అయిపోతూ ఉంటారు. అందులో కొందరైతే కేవలం టూరిజంకి సంబంధించినవాటికి ఎక్కువ ప్రధాన్యం ఇస్తూ ఉంటారు. ఇలా సోషల్ మీడియా వేదికలపై చూసే లోకేషన్లలోకి తాము వెళ్లి వాలిపోతే ఎలా ఉంటుందో కదా అని ఆలోచిస్తారు. ఆలోచన వచ్చిందే తడవుగా ఆచరణలోకి పెట్టేస్తున్నారు మన భారతీయులు. 2019 అది కోవిడ్ మహమ్మారితో ప్రపంచ దేశాలన్నీ కకావికలం అయిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఇంటి గడప దాటి బయటకు అడుగు పెట్టే వారు కాదు. దీని కారణంగా టూరిజం వ్యవస్థ బాగా దెబ్బతింది. చాలా మంది గైడ్స్, టూరిస్ట్ స్పాట్ మెయింటెన్ చేసే వాళ్లు ఆర్థికంగా సమస్యలతో కూరుకుపోయారు. అయితే గడిచిన రెండేళ్ల నుంచి పరిస్థితి మారిపోయింది. స్వదేశాల మొదలు విదేశాల వరకూ ప్రకృతి ప్రేమికులు టూరిజాన్ని ఆస్వాధించేందుకు క్యూలు కడుతున్నారు.
టూరిజంలో భారతీయులదే పై చేయి..
ఈ మధ్య కాలంలో మన ఇండియన్స్ టూరిజంపై ఎక్కువ ఆసక్తిని చూపుతున్నారు. అందులో ప్రధాన భూమిక పోషిస్తున్నారు యువత. వీళ్లు ఒకే ప్రాంతంలో స్థిరంగా ఉండేందుకు సుముఖంగా లేరు. సమయం దొరికినప్పుడల్లా ఏదో ఒక ప్రాంతానికి ట్రావెల్ అయ్యేందుకు కాళ్లకు పనిచెబుతున్నారు. అందులోనూ అడ్వెంచర్ వైపుకు ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. అందుకే ట్రక్కింగ్, మౌంట్ క్లైంబింగ్, ఫారిన్ టూర్స్, వాటర్ ఫౌంటేన్స్ వైపుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో అటు దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ టూరిజం ఇండస్ట్రీ చిగురించి వాటి ఫలాలను నిర్వాహకులకు అందిస్తోంది. దీని కారణంగా కోవిడ్ సమయంలో కంటే కూడా ప్రస్తుతం టూరిజంపై చేస్తున్న ఖర్చు 173 శాతం అధికంగా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ప్రపంచంలో ఆరవ స్థానంలో..
2030 నాటికి పరిస్థితి చూసుకుంటే కేవలం ఇండియన్ ట్రావెల్స్ దాదాపు 410 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్లు అంచనాలు కనిపిస్తున్నాయి. అంటే మన దేశ కరెన్సీ ప్రకారం రూ. 32 లక్షల కోట్లు అనమాట. దీనిని బట్టి మన దేశం పర్యాటకం కోసం ఖర్చు పెట్టడంలో నాలుగో స్థానంలో నిలిచిందని చెబుతున్నారు నిపుణులు. ప్రస్తుత లెక్కల ప్రకారం చూసుకుంటే 150 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తూ ప్రపంచంలోనే ఆరో స్థానంలో మన దేశం నిలిచినట్లు తెలుస్తోంది. ఈ గణాంకాలను హౌ ఇండియా ట్రావెల్స్ పేరిట బుకింగ్స్ డాట్ కామ్, మేకిన్సే అండ్ కంపెనీ సంయుక్తంగా చేసిన సర్వేలో వెల్లడయింది.
ఎక్కువ మంది స్వదేశంపైనే..
ఇక సంవత్సరానికి ఏఏ దేశాల వాళ్లు ఎన్నెన్ని రోజులు పర్యాటకంలో గడుపుతున్నారో ఈ నివేదికలో వెలుగులోకి వచ్చింది. వీనిని సగటున గణించారు. అమెరికన్లు 63, జపానీయులు 57, ఇండియన్స్ 29 రోజులు టూర్స్ కోసం సమయాన్ని కేటాయిస్తున్నట్లు తెలిసింది. పైగా మన ఇండియన్స్ విషయానికొస్తే 80 శాతం మంది పర్యాటక ప్రదేశాల్లో బస చేసేందుకు ఆసక్తికనబరుస్తున్నారు. స్వదేశీయంగా ఉన్న మనాలీ, సిమ్లా వంటి ప్రాంతాలతో పాటూ ఆధ్యాత్మిక క్షేత్రాలైన వారణాసి, గురుగ్రాం, కోయంబత్తూర్ వంటి నగరాలకు వెళ్లేందుకు మక్కువ చూపుతున్నారు. ఇలా టూరిస్టుల సంఖ్య గణనీయంగా పెరగడానికి కారణం సామాజిక మాధ్యమాలేనని చెప్పారు. యూట్యూబ్ చూసి 91 శాతం మంది ట్రావెలింగ్ చేస్తుంటే.. 85 శాతం ఇన్ స్టా ద్వారా ప్రభావానికి లోనవుతున్నట్లు బుకింగ్స్ డాట్ కామ్ నివేదిక పేర్కొంది.
T.V.SRIKAR