Bangalore Traffic: బెంగళూరు ట్రాఫిక్ కి.. బెదురుతున్న నగరవాసులు
బెంగళూరు దేశంలో అత్యంత అందమైన నగరం. అలాగే దేశ ఐటీ రాజధానిగా కూడా పేరు గాంచింది. నిత్యం వేల మంది ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ప్రతి రోజూ కోటిన్నర పైగా వాహనాలు రోడ్డుపైకి వస్తాయి. దీంతో భయంకరమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. బండి బయటకు తీయాలంటే వాహనదారుడు బెదురుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిక గల కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.

According to a recent report, Bangalore city is losing thousands of crores annually due to severe traffic problems
మన దేశ మెట్రోపాలిటన్ నగరాల్లో వన్ ఆఫ్ ది టాప్ ప్లేస్ లో బెంగళూరు ఉంటుంది. ఇది గొప్పగా చెప్పుకోవడానికి మాత్రమే కానీ.. కనీస ట్రాఫిక్ నియంత్రించే మౌళిక సదుపాయాల విషయంలో అట్టడుగున నిలిచిందని తెలుస్తుంది. దీనికి కారణం ప్రతి రోజూ రోడ్లపై వాహనాల రద్దీకి ట్రాఫిక్ లో చిక్కుకున్న వాహన చోదకులు తమ సోషల్ మీడియా వేదికల ద్వారా అనుభవాలను షేర్ చేస్తూ ఉంటారు. ట్రాఫిక్ సిగ్నలింగ్ తో పాటూ అంతరాయాల కారణంగా సమయం, ఇంధనం రెండూ వృధాగా మారుతుంది. దీని విలువ ఏడాదికి అక్షరాలా రూ.19,725 కోట్లు. ఏంటి షాక్ అయ్యారా. అవును ఇది బెంగళూరు ట్రాఫిక్ సాక్షిగా నమ్మదగ్గ నిజం. ట్రాఫిక్ నిపుణులు ఎంఎన్ శ్రీహరితో పాటూ ఆయన బృందం తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇంత స్థాయిలో ట్రాఫిక్ ఏర్పడటానికి.. కర్ణాటక రోడ్ ప్లానింగ్, ఫ్లైఓవర్ మేనేజ్మెంట్, మౌళిక సదుపాయాల లోటు ప్రదాన కారణాలుగా తన నివేదికలో పేర్కొంది.
బెంగళూరు సిటీ మొత్తం మీద వినియోగంలో 60 ఫ్లైఓవర్లు ఉన్నట్లు గుర్తించింది. ఇవి ప్రస్తుతం ఉన్న జనాభాకు సరిపోవడంలేదని తెలిపింది. బెంగళూరు ఐటీ పరంగా దినదినాభివృద్ది చెందుతున్న తరుణంలో ఉపాధి అవకాశాల కోసం దేశవిదేశాల నుంచి పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు ఇక్కడికి తరలివస్తున్నారు. వీరికి తగ్గట్లు అన్ని మౌళిక సదుపాయాలను అందించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడంలో మాత్రం కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు తీవ్రంగా విఫలం అవుతున్నాయి. కేవలం సిటీ పరిధిలోనే రోజూ 1.5 కోట్ల వాహనాలు రోడ్లపై ప్రయాణాలు జరుపుతాయి. దీనికి తగ్గట్లుగా రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల పెంపుదల, అండర్ పాసింగ్ రోడ్ల ఏర్పాట్లు చేయడంలో రోడ్ ప్లానింగ్ మేనేజ్మెంట్ విఫలం అయింది. దీంతో అనునిత్యం వాహనాల రద్దీతో ప్రజలు సరైన సమయానికి ఆఫీసులకు వెళ్ళలేక, తిరిగి ఇంటికి త్వరగా చేరుకోలేక అవస్థలకు గురవుతున్నారు.
దీనిపై తాజాగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందించారు. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి బెంగళూరు ట్రాఫిక్ సమస్యపై వివరణ ఇచ్చారు. దీనికి సంబంధించిన నివేదికను కూడా సంబంధిత మంత్రిత్వ శాఖకు అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గడ్కరీ ప్రణాళికలతో కూడిన కార్యాచరణను ఎప్పుడు చేపడతారో తెలియాల్సి ఉంది. బెంగళూరును ట్రాఫిక్ ఫ్రీ నగరంగా చేసి నగరవాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఎంత త్వరగా విముక్తి కలిగిస్తారో వేచిచూడాలి.
T.V.SRIKAR