Billionaire MPs: రాజ్యసభలో 12 శాతం మంది బిలినియర్లే.. తెలంగాణ, ఏపీ నుంచే ఎక్కువ మంది !!
రాజ్యసభలో అధికశాతం మంది బిలినియర్లే ఉన్నట్లు తెలుస్తుంది. అందులో మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వారే అధికం వావడం విశేషం.

According to the reports of Association for Democratic Reforms and National Election Watch, Billionaire MPs in Rajya Sabha are from our Telugu states.
రాజ్యసభ ఎంపీలలో 12 శాతం మంది బిలినియర్లేనట!! ఇలా వందల కోట్ల ఆస్తులు కలిగిన రాజ్యసభ ఎంపీల లిస్టులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వారే ఎక్కువమంది ఉన్నారట! అసోసియేషన్ ఫర్ డెమొక్రట్రిక్ రిఫార్మ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (న్యూ) అనే సంస్థలు కలిసి 225 మంది (మొత్తం 233 మంది) రాజ్యసభ సభ్యుల ఆస్తులు, వారిపై ఉన్న నేరాల వివరాలతో విడుదల చేసిన నివేదికలో ఈవివరాలను ప్రస్తావించారు. బిలినియర్ రాజ్యసభ ఎంపీల లిస్టులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 18 మంది ఉండగా.. వీరి మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ. 9,419 కోట్లు ఉంటుందని వెల్లడించారు. రాజ్యసభ ఎంపీల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఐదుగురు (మొత్తం 11 మంది), తెలంగాణ నుంచి ముగ్గురు (మొత్తం ఏడుగురు), మహారాష్ట్ర నుంచి ముగ్గురు (మొత్తం 19 మంది), ఢిల్లీ నుంచి ఒకరు (మొత్తం ముగ్గురు), పంజాబ్ నుంచి ఇద్దరు (మొత్తం ఏడుగురు), హర్యానా నుంచి ఒకరు (మొత్తం ఐదుగురు), మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరు (మొత్తం 11 మంది) ఎంపీలు తమ ఆస్తుల విలువ రూ.100 కోట్లుగా ప్రకటించారని నివేదిక పేర్కొంది. తెలంగాణకు చెందిన ఏడుగురు రాజ్యసభ ఎంపీల మొత్తం ఆస్తుల విలువ రూ.5,596 కోట్లు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన 11 మంది ఎంపీల ఆస్తుల మొత్తం విలువ రూ.3,823 కోట్లు, ఉత్తరప్రదేశ్‌కు చెందిన 30 మంది ఎంపీల ఆస్తుల మొత్తం విలువ రూ.1,941 కోట్లు ఉందని నివేదిక వెల్లడించింది.
41 మందిపై తీవ్ర క్రిమినల్ కేసులు
ఏడీఆర్, న్యూ సంస్థలు 225 మంది రాజ్యసభ సభ్యుల వివరాలను విశ్లేషించగా.. వీరిలో 75 మంది (33 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని వెల్లడైంది. 41 మంది (18 శాతం) రాజ్యసభ సభ్యులపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులను ఎదుర్కొంటున్న నలుగురు ఎంపీల్లో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేసీ వేణుగోపాల్ పేరు కూడా ఉంది. ఆయనపై రేప్ కేసు (ఐపీసీ సెక్షన్ 376) ఉందని నివేదిక తెలిపింది. మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులపై హత్యకు సంబంధించిన కేసులు (ఐపీసీ సెక్షన్ 302) ఉన్నాయని నివేదికలో ప్రకటించారు.
23 మంది బీజేపీ ఎంపీలపై క్రిమినల్ కేసులు
85 మంది బీజేపీ ఎంపీల చిట్టాను విశ్లేషించగా, వారిలో 23 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది ఎంపీల డీటైల్స్ ను వడపోయగా 12 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు బహిర్గతమైంది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ 13 మంది రాజ్యసభ ఎంపీల్లో నలుగురు, లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ నుంచి ఆరుగురు ఎంపీల్లో ఐదుగురు, సీపీఎంకు చెందిన ఐదుగురు ఎంపీల్లో నలుగురు, ఆప్ కు చెందిన 10 మంది ఎంపీల్లో ముగ్గురు, వైఎస్ఆర్‌సీపీకి చెందిన 9 మంది ఎంపీల్లో ముగ్గురు, శరద్ పవార్ కు చెందిన ముగ్గురు ఎంపీల్లో ఇద్దరు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో ప్రస్తావించారు.
వార్షిక ఆదాయంలో టాప్-3.. ఇద్దరు మనోళ్లే
దేశంలోనే అత్యధిక ఆదాయం కలిగిన రాజ్యసభ ఎంపీల్లో వైఎస్సార్ సీపీ సభ్యుడు, వ్యాపారవేత్త ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు. 2018-19 నాటికి ఆయన వార్షిక ఆదాయం రూ.279 కోట్లు. రెండో ప్లేస్ లో ఉన్న బీఆర్ఎస్ ఎంపీ, ఫార్మా దిగ్గజం డాక్టర్ బండి పార్థ సారథి వార్షిక ఆదాయం (2020-21) రూ.140 కోట్లు. మూడో ప్లేస్ లో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, సుప్రీంకోర్టు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వార్షిక ఆదాయం (2016-17) రూ.131 కోట్లు.
అత్యల్ప ఆస్తులున్నఎంపీలు వీరే..
తక్కువ ఆస్తులున్న రాజ్యసభ ఎంపీల్లో పంజాబ్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంత్ బల్బీర్ సింగ్ మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తి మొత్తం విలువ రూ.3.79 లక్షలే. మణిపూర్ కు చెందిన బీజేపీ ఎంపీ మహరాజా సంజౌబా లీషెమ్బా ఆస్తి విలువ 5 లక్షలు మాత్రమే. ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆస్తి విలువ 6 లక్షలే. పశ్చిమ బెంగాల్ కు చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ప్రకాశ్ చిక్ బారైక్ ఆస్తి విలువ 9 లక్షలు మాత్రమే.
అత్యధిక అప్పులున్న ఎంపీలు వీరే..
అత్యధిక అప్పులున్న రాజ్యసభ ఎంపీల్లో వైఎస్సార్ సీపీ ఎంపీ పరిమళ్ నత్వానీ ఉన్నారు. ఆయనకు దాదాపు రూ.209 కోట్ల అప్పులు ఉన్నాయి. మరో వైఎస్సార్ సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామి రెడ్డికి రూ. 154 కోట్ల అప్పులు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ కు చెందిన సమాజ్ వాదీ పార్టీ ఎంపీ, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ కు రూ.105 కోట్ల అప్పులు ఉన్నాయి.