World Resources Institute: ప్రపంచంలో పాతికదేశాలు జలకళలేక విలవిల..
నీరు జనజీవనానికి ఉపయోగపడే ప్రకృతి అందించిన వనరు. దీని కొరత ప్రపంచదేశాల్లో తీవ్రంగా ఉంది. అందులో మన భారతదేశం ఉండటం గమనార్హం. తాజాగా ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి గల కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం.
గుండ్రంగా తిరిగే భూమిపై ఒక్కోదేశంలో ఒక్కోరకమైన సమస్య ఉన్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఒకే రకమైన సమస్యతో ఇబ్బంది పడుతున్న దేశాలు 25 ఉన్నాయి. అదే నీటి సంక్షోభం. మన్నటి వరకూ మన దేశంతో పాటూ ఇతర దేశాల్లో భారీ వర్షాల కారణంగా రోడ్లు, జనావాసాలన్నీ జలదిగ్భంధంలో చిక్కుకొని పోయాయి. తీవ్రమైన వరదలతో కొట్టుమిట్టాడాయి. అలాంటి పరిస్థితుల్లో గుటిక నీళ్లతో దాహం తీర్చుకునేందుకు వెసులు బాటు లేదంటే ఆశ్చర్యంగా ఉంటుంది. వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజాగా జరిపిన సర్వేలో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నివేదికలో పొందుపరిచిన సమాచారం ప్రకారం ప్రపంచ జనాభాలో 25శాతం మంది నీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంటున్నారు.
నివేదికలోని మరిన్ని అంశాలు..
- ప్రపంచంలో అత్యధికంగా నీటి సంక్షోభాన్ని కలిగి ఉన్న ప్రాంతాల్లో పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఇక్కడ నివసించే ప్రజల్లో దాదాపు 83శాతం మంది నీటి ఎద్దడితో సతమతమవుతున్నారు.
- ఇక అరబిక్ దేశాలైన బహ్రెయిన్, సైప్రస్, కువైట్, ఒమన్, లెబనాన్ ప్రతి సంవత్సరం నీళ్ల కరువుతో విలవిలలాడుతున్నాయి.
- ప్రపంచ జనాభాలో 50శాతం అంటే 400 కోట్ల వరకూ ప్రజలు ప్రతి ఏడాదిలో ఒక నెలరోజులు నీరు లభించక తమ దాహార్థిని తీర్చుకోలేక ఇబ్బంది పడుతున్నారు.
- రానున్న రోజుల్లో అంటే 2050 నాటికి ఈ పరిస్థితి మరింత పెరిగి 60శాతానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు.
- ప్రపంచవ్యాప్తంగా నీటి సమస్య కలిగిన దేశాల జాబితాలో భారత్, సౌదీ అరేబియా, చిలీ, శాన్ మెరినో, బెల్జియం, గ్రీస్ వంటి అగ్ర దేశాలు ఉన్నాయి.
- దక్షిణాసియా విషయానికొస్తే.. నీళ్ల కరువు అత్యధికంగా ఉన్న ప్రాంతాల్లోనే 74శాతం మంది జనాభా నివసిస్తున్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ దేశపు భూగర్భంలో నీటి నిలువలు ఏస్థాయిలో ఉన్నాయో.
- ఈ జల సంక్షోభం కారణంగా చాలా దేశాలు ఆర్థికంగా చాలా నష్టపోతున్నాయి. అందులో మనదేశంతోపాటూ మెక్సికో, ఈజిప్ట్, టర్కీ దేశాలు ఉన్నాయి.
- 2010 సంవత్సరంలో ఈ కరువు కారణంగా ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 15 లక్షల కోట్ల డాలర్లు నష్టపోయినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అంటే ప్రపంచ జీడీపీలో 24శాతం అనమాట. ఈ నీటి
- కొరత ఇలాగే కొనసాగితే 2050 నాటికి ప్రపంచ జీడీపీలో 31శాతం నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. దీని ప్రభావంతో ప్రపంచ దేశాలన్నీ కలిపి 70లక్షల కోట్ల డాలర్ల ఆదాయాన్ని కోల్పోవల్సి వస్తుంది.
- యూరప్, అమెరికాలో నీటి డిమాండ్ సాధారణంగా ఉంది. అయితే ఆఫ్రికా దేశాల్లో డిమాండ్ అధికంగా ఉంది. 2050 నాటికి మరో 25శాతం డిమాండు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
- ఇక ఆసియా దేశాలతో పాటూ మన దేశం విషయానికొస్తే.. 2050 నాటికి 80శాతం మందికి సురక్షిత మంచి నీరు అందే పరిస్థితి ఉండదు అని ఈ నివేదికలో పేర్కొంది.
- దీని ప్రభావం వ్యవసాయంపై పడి.. వరి, గోధుమలు, మొక్కజొన్న, చెరకు పై తీవ్రంగా ప్రభావం చూపుతుంది.
జల సంక్షోభానికి కారణాలు
- ప్రపంచదేశాల్లో విరివిగా జనాభా పెరుగుదల కారణంగా నీటి అవసరం అధికమవడం.
- పట్టణీకరణ పేరుతో చెరువులు, సరస్సులు, నదులపై నిర్మాణాలు చేపట్టడం.
- పారిశ్రామికీకరణలో భాగంగా పరిశ్రమలు ఏర్పాటు చేసి వాటి వ్యర్థాలను నీటిలో కలిపేస్తున్నారు. తద్వారా ఆ నీరు తాగేందుకు నిరుపయోగంగా మారుతున్నాయి.
- ప్రపంచ వ్యాప్తంగా చుట్టూ నీరు అందుబాటులో ఉన్నా వాటిని సమర్థవంతంగా వాడుకోలేక పోవడం.
- ప్రకృతి విరుద్దమైన పనులకు పాల్పడి తీవ్రమైన వాతావరణ మార్పులకు గురిచేయడం.
- భూమిపై ఉన్న 70శాతం నీటిలో కేవలం మూడు శాతం మాత్రమే వినియోగంలో ఉండటం.
- 2/3 వంతు నీరు మంచు రూపంలో ఉండటం
నీటి కొరతను ఎదుర్కొంటున్న దేశాలు
భారత్, సిరియా, ఇరాక్, నమీబియా, దక్షిణాఫ్రికా, టునిషియా, గ్రీస్, శాన్ మారినో, బెల్జియం, ఇరాన్, చిలీ, జోర్డాన్, బహ్రెయిన్, సైప్రస్, కువైట్, సౌదీ అరేబియ, ఇజ్రాయిల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, లెబనాన్, ఖతర్, యోమన్, బోత్సావనా, ఈజిప్ట్, లిబియా,
ఏం చేస్తే అధిగమించవచ్చు
- వర్షపు నీటిని ఒడిసిపట్టి వాటిని సంరక్షించేందుకు కృషి చేయాలి.
- తక్కువ నీటితో పంటలు పండించే సరికొత్త పద్దతులను అవలంభించాలి.
- వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు నీటిని తక్కువగా ఉపయోగించేలా ప్రణాళికలు రచించాలి.
- భూగర్భజలాలను అభివృద్ది చేసేలా కొన్ని చర్యలు చేపట్టాలి
- ప్రకృతి నష్టం కలిగించకుండా పరిరక్షించాలి.
- చిత్తడి నేలలు పెంచేందుకు దోహదపడాలి.
ఇలా ప్రత్యేకమైన శ్రధ్ద చూపడం వల్ల ప్రపంచదేశాలు రానున్న భవిష్యత్ తరాలకు నీరు అనే వనరును అందించిన వాళ్లవుతారు. లేకుంటే మరింత తీవ్ర సంక్షోభంతో ఉన్న జనాభా కూడా తరిగిపోయే అవకాశం ఉంటుంది.
T.V.SRIKAR