TS Warangal : అడ్డగోలు అనుమతులు …గ్రేటర్ వరంగల్ లో కూల్చివేతలు షురూ !

గ్రేటర్ వరంగల్ (Greater Warangal) మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) అధికారులు 15 రోజులుగా.. అక్రమ నిర్మాణాల మీద కొరడా ఝుళిపిస్తున్నారు. బిల్డింగులు, షాపింగ్ మాల్స్‌కు తీసుకున్న పర్మిషన్లు, నిర్మాణాలను సరి చూసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి నోటీసులిచ్చి కొట్టేస్తున్నారు. హనుమకొండలో కాళోజీ జంక్షన్ (Kaloji Junction) నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 11, 2024 | 12:31 PMLast Updated on: Feb 11, 2024 | 12:31 PM

Addagolu Permits Demolitions Started In Greater Warangal

గ్రేటర్ వరంగల్ (Greater Warangal) మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation) అధికారులు 15 రోజులుగా.. అక్రమ నిర్మాణాల మీద కొరడా ఝుళిపిస్తున్నారు. బిల్డింగులు, షాపింగ్ మాల్స్‌కు తీసుకున్న పర్మిషన్లు, నిర్మాణాలను సరి చూసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి నోటీసులిచ్చి కొట్టేస్తున్నారు. హనుమకొండలో కాళోజీ జంక్షన్ (Kaloji Junction) నుంచి అంబేద్కర్ జంక్షన్ వరకు ఉన్న ఆక్రమణలను కూల్చివేశారు. బడా షాపింగ్ మాల్స్ (Building Shopping Malls) , షోరూమ్స్‌, ఫుట్‌పాత్‌ల మీద ఇష్టారీతిన ఉన్న నిర్మాణాలను తుక్కుతుక్కు చేసేశారు. బీఆర్ఎస్ (BRS) ఆఫీసుకు కేటాయించిన స్థలంలో చెరువును కబ్జా చేసి నిర్మించిన అక్రమ కట్టడాలను కూల్చివేశారు అధికారులు. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రైసిటీస్ పరిధిలోని ఫుట్‌పాత్‌ ఆక్రమణలను సైతం పూర్తిగా తొలిగిస్తున్నారు. అపార్టుమెంట్స్ లో అనుమతిలేని నిర్మాణాలను సైతం కూల్చివేశారు. ట్రై సిటీస్‌ పరిధిలో ఈ సమస్య ఎప్పటి నుంచో ఉన్నా… ఇన్నాళ్ళు చర్యలు తీసుకోకుండా అధికారులు ఇప్పుడే ఎందుకు బుల్డోజర్స్ కు పని చెబుతున్నారన్న చర్చ స్థానికంగా విస్తృతంగా జరుగుతోంది.

గ్రేటర్ పరిధిలోని బడా షాపింగ్ మాల్స్‌ (Shopping Malls) నిర్వాహకులంతా ఉమ్మడి జిల్లాలోని నాటి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర లీడర్లకు ఆర్థిక సన్నిహితులు కాబట్టే అధికారులు ఇన్నాళ్ళు కామ్‌గా ఉన్నారా అన్న అనుమానాలు వస్తున్నాయట స్థానికులకు. వరంగల్ చౌరస్తా, రంగశాయిపేట, పుల్లాయికుంట, ఎనుమాముల, పోచమ్మమైదాన్, హనుమకొండ కాపువాడ ప్రాంతాల్లో ఇటీవల భవనాలు కూల్చివేశారు. అయితే వీటిని ప్రాథమిక దశలోనే ఎందుకు ఆపలేకపోయారన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయింది.

ఇది టౌన్ ప్లానింగ్ అధికారులు అవినీతి కాదా అని ప్రశ్నిస్తున్నారు ట్రై సిటీస్‌ ప్రజలు. అనుమతించిన ప్లాన్‌ ప్రకారం కాకుండా నిబంధనలు ఉల్లంఘించే వారికి నోటీసులు ఇచ్చి మొదట్లోనే ఆపకుండా అవినీతి, రాజకీయ వత్తిళ్లకు లొంగడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అంటున్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలో ఇప్పుడు జరుగుతున్న కూల్చివేతల పాపమంతా మామూళ్ళు, రాజకీయ వత్తిళ్ళకు అలవాటు పడ్డ అధికారులదేనన్నది లోకల్‌ టాక్‌. కొందరు టౌన్ ప్లానింగ్‌ ఉద్యోగులు అదనపు అంతస్తులు వేసుకునే వారి నుంచి ఒక్కో అంతస్తుకు 50 వేల నుంచి లక్ష వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. నాడు ఉదాసీనంగా వ్యవహరించిన, మామూళ్ళు దండుకున్న అధికారులను కఠినంగా శిక్షించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది.