Sri Ram Sager: నిండుకుండలా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్.. చూసేందుకు రెండు కళ్లు చాలవు..
నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ జలకళను సంతరించుకుంది. భారీగా నీరు వచ్చి చేరుతుండడంతో.. నిండుకుండను తలపిస్తోంది. శ్రీ రామసాగర్ ప్రాజెక్టు ఎగువన గోదావరి నదిపై.. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను తెరిచారు.
బాబ్లీ నిర్మాణ సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం 14 గేట్లను ఎత్తివేశారు. వాటిని అక్టోబర్ 28వ తేదీ వరకు తెరిచి ఉంచి ఆ తర్వాత మూసివేస్తారు. శ్రీరామసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1065 అడుగులకు చేరింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 90టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 20 టీఎంసీల నీళ్లు ఉన్నాయ్. ఎగువ నుంచి మరో 55 క్యూసెక్కుల వరద చేరుతుంది. ఎస్కేప్ గేట్ల ద్వారా 50, మిషన్ భగీరథ ద్వారా 152 క్యూసెక్కుల చొప్పున కిందకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.
ఇక అటు బాబ్లీ గేట్లు ఎత్తివేయడంతో.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి త్రివేణి సంగమం దగ్గర గోదావరి జలకళను సంతరించుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర నుండి బాసర వైపు గోదావరి నది పరవళ్లు తొక్కుతూ ఉరకలు వేస్తుంది. ఇక గేట్లను ఎత్తేయడంతో నది పరివాహక ప్రాంత రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ వానాకాలంలో సరైన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న నిజామాబాద్ రైతులకు ఈ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో కాస్త వరకు నీటి సమస్య తీరినట్టే కనిపిస్తోంది.