నలుగురిని కాపాడి.. తను చనిపోయాడు.. నెలలో భార్య డెలివరీ..
విజయవాడ వరదలు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. వరద తగ్గుతున్నా కొద్దీ.. శవాలు బయటపడుతున్నాయ్. వరదలకు బలయిన వారి సంఖ్య ఇప్పటికే 40దాటింది. సహాయచర్యలు పూర్తయ్యే వరకు ఆ నంబర్ ఎంతకు పెరుగుతుందో అనే ఆలోచనే.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది.
విజయవాడ వరదలు మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. వరద తగ్గుతున్నా కొద్దీ.. శవాలు బయటపడుతున్నాయ్. వరదలకు బలయిన వారి సంఖ్య ఇప్పటికే 40దాటింది. సహాయచర్యలు పూర్తయ్యే వరకు ఆ నంబర్ ఎంతకు పెరుగుతుందో అనే ఆలోచనే.. ఇప్పుడు ప్రతీ ఒక్కరి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఈ వరదల్లో ఒక్కొక్కరిది ఒక్కో కథ.. కదిలిస్తే ఒక్కొక్కరిది ఒక్కో వ్యథ. ఆలస్యంగా వెలుగుచూసిన ఓ ఘటన.. ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. వరదల్లో నలుగురిని కాపాడిన ఓ వ్యక్తి.. అదే వరదల్లో కొట్టుకుపోయి చనిపోయాడు. ఇప్పుడా కుటుంబం రోడ్డున పడింది.
విజయవాడకు చెందిన చంద్రశేఖర్… సింగ్ నగర్‌లోని డెయిరీ ఫాంలో పని చేస్తుంటాడు. వరద ఒక్కసారిగా పోటెత్తడంతో.. తనతో పనిచేస్తున్న తన ఇద్దరు తమ్ముళ్లు, మరో ఇద్దరిని కాపాడి షెడ్డు పైకప్పు మీదకు ఎక్కించారు. తాళ్లతో కట్టేసిన ఆవులనూ వదిలేశాడు. తాను పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా.. కాలు జారి పడిపోయాడు. వరదలో కొట్టుకుపోయాడు. ప్రాణం లేకుండా కనిపించాడు. చంద్రశేఖర్ భార్య 8నెలల గర్భవతి. ఈ విషయం ఇప్పుడు ప్రతీ ఒక్కరితో కన్నీళ్లు పెట్టిస్తోంది. చంద్రశేఖర్ మరణంతో.. అతని కుటంబం విషాదంలో మునిగిపోయింది. తమకు దిక్కెవరు వారు రోధిస్తున్న తీరు ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది.
తమను కాపాడిన చంద్రశేఖర్ గల్లంతు కావండంతో.. అతని సోదరులు, ఇద్దరు వ్యక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కళ్ల ముందే చంద్రశేఖర్ వరదల్లో కొట్టుకుపోయాడని రోదిస్తున్నారు. ఇక అటు వరదల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయ్. వరదల తర్వాత జనాలకు ఎలాంటి రోగాలు రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు.. బుడమేరు గండ్లు పూడ్చే పనిలో అధికారులు బిజీగా ఉన్నారు. ఇక అటు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. బల్లకట్టుపై బుడమేరు దాటి ముంపు ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు.. బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతాల్లో పనులపై అధికారులతో చర్చించారు. దెబ్బతిన్న పంటలు వివరాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.