AI Walking Shoes: షూ వేసుకో – నడక వేగం పెంచుకో..!

మనకు ఎక్కువ శ్రమను కలుగనివ్వకుండా నడిపించే షూ స్ మార్కెట్లోకి వచ్చేశాయి. పూర్తి ఆటోమేటిక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో పనిచేస్తాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 21, 2023 | 04:34 PMLast Updated on: Feb 21, 2023 | 4:55 PM

Ai Walking Shoes

AI ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఈ పేరు ఇటీవలె కాలంలో తెగ మారుమ్రోగిపోతుంది. దీంతో చేయని పనిలేదు. ఇదొక ప్రోగ్రామింగ్. దీనిని ఉపయోగించుకొని అనేక రకాలా కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఈ సాంకేతికతలను ఉపయోగించుకొని గతంలో కార్లు రావడం చూశాం. రాబోయే కాలంలో కాళ్లు క్రిందపెట్టకుండానే రోడ్డుపై బ్యాలెన్స్ చేసి నిలబడే బైకులు కూడా వస్తాయంటున్నారు. గూగుల్ కి ప్రత్యమ్నాయంగా చాట్ బాట్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీటన్నింటికీ తలదన్నేలా షూస్ వచ్చేశాయి.

సాధారణంగా మనం ఎక్కవ దూరం నడవాలంటే కాస్త ఖరీదైన షూ ధరిస్తాం. పరుగులు తీయడానికి కూడా రన్నింగ్ షూ లాంటివి ధరిస్తాం. అయితే పరిగెత్తే అవసరం లేకుండా ఎంత దూరమైనా మనకు కావల్సినంత వేగంగా నడుచుకుంటూ వెళ్లవచ్చు. ఇలా నడవడానికి ఉపయోగించిన సాంకేతికతే కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్). ఇలా చెప్పుకోవడానికి బాగానే ఉంది. అసలు విషయం తెలియాలి కదా. దీని ధర ఎంత? ఇది ఎలా పనిచేస్తుంది? అనేది ఇక్కడ అందరికీ వచ్చే సందేహం.

AI shoes

AI shoes

పనితీరు:
ఈ కృత్రిమ మేథ సాంకేతికతను ఉపయోగించి షిప్ట్ రోబోటిక్స్ (Shift Robotics) అనే కంపెనీ ఈ షూలను తయారు చేసింది. సాధారణంగా మనం గంటకు నాలుగు కిలోమీటర్లు నడవగలిగితే ఇది 11 కిలోమీటర్ల వరకూ తీసుకెళ్తుంది. దీంతో కష్టపడి నడవనవసరం లేకుండానే మనం కోరుకున్న ప్రదేశాలకు వెళ్లవచ్చు. తద్వారా మన శారీరక శ్రమ తగ్గుతుంది. ఎంత దూరం కావాలన్నా దీనిని ఉపయోగించి వెళ్లవచ్చు. ఈ షూస్ కి క్రింద చక్రాలు అమర్చి ఉంటారు. దీనితోపాటూ వీటికి సెన్సార్లు ఉంటాయి. మనం నాలుగు అడుగులు వేసి చలనం కదిలించగానే అందులో నిర్మించిన సెన్సార్లు తన పనితీరును కనబరుస్తాయి. అప్పుడు నడక వేగం సాధారణం కంటే 250 శాతం ఎక్కువ అవుతుంది. మనం అడుగు తీసి అడుగు వేసే లోపు దీనికి అమర్చిన చక్రాలు ముందుకు నడిపిస్తాయి. ఉదాహరణకు మనం 10 అడుగులు వేసేలోపు దాదాపు 25 అడుగుల ముందుకు తీసుకెళ్తుంది. మనం నడిచే సమయంలో ఉన్నపళంగా ఆగిపోవాలంటే కూడా ఆగిపోవచ్చు. వీటి సెన్సార్లు పనిచేయకుండా మామూలుగా నడవాలన్నా నడిచే వీలుగా వీటిని తయారు చేశారు. దీని బరువు 4 కేజీలు ఉంటుంది. 100 కేజీల వరకూ మనిషి బరువును తట్టుకోగలదు. దీనికి వాటర్ రెసిస్టెంట్ సౌకర్యాన్ని కల్పించారు. దీని బ్యాటరీ కెపాసిటీ విషయానికొస్తే 3.0 ఆంఫియర్ హవర్ గా ఉంది. 65 వాట్స్ వరకూ పవర్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. యూఎస్బీ పోర్ట్ ద్వారా ఛార్జింగ్ చేసుకోవాలి. దీని బ్యాటరీ పూర్తిగా ఛార్జింగ్ అవ్వడానికి గంటన్నర సమయం పడుతుందని చెబుతున్నారు.

AI shoes.

AI shoes

షూ ధర:
వీటిని ఎలా ఉపయోగించాలి అనే సందేహం కలుగవచ్చు. సాధారణంగా షూ ధరించిన విధంగానే వీటిని కూడా ధరిస్తారు. కాళ్లుకు ఏవైనా బూట్లు ధరించినప్పటికీ వాటిపైనే వీటిని ధరించవచ్చు. అలా వీటిని రూపొందించారు. దీనిని పెద్దలు, పిల్లలు ఎవరైనా ధరించవచ్చు. వీటిని ఉపయోగించి ఎలాంటి ప్రదేశాల్లోనైనా వెళ్లవచ్చని అంటున్నారు నిపుణులు. నడిచేందుకు, మెట్లు ఎక్కేందుకు, దిగేందుకు, పరిగెత్తేందుకు ఎలా కావాలంటే అలా వీటిని వాడవచ్చు. వీటి ధర 1399 అమెరికన్ డాలర్లుగా తెలిపారు. మన ఇండియా కరెన్సీతో పోలిస్తే దాదాపు రూ. లక్షా 25వేలు ఉంటుంది. ప్రస్తుతం వీటిని మార్కెట్లోకి తీసుకొచ్చారు కాబట్టి చాలా ఎక్కువ ధరలా అనిపిస్తుంది. ఈ సాంకేతికతను అన్ని ప్రముఖ కంపెనీలు ఫార్ములాను ఉపయోగించి తయారు చేస్తే ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా సప్లై పెరిగితే డిమాండ్ తగ్గుతుంది తద్వారా ధర కూడా తగ్గుతుంది. ఏ వస్తువైనా రూపొందించిన కొత్తలో ఎక్కువగా అనిపించవచ్చు. కాలం గడిచే కొద్దీ వీటి ధరలు తగ్గుతూ పోతాయి. మనం ఒకప్పుడు కార్లు కొనాలి అంటే 10లక్షలు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు 1లక్ష రూపాయలకు కూడా సామాన్యునికి అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇది కూడా క్రమక్రమంగా తగ్గుతుంది అని చెప్పవచ్చు.

కృత్రిమ మేధ పెరిగిన నాటినుంచి ఆధునిక యుగంలో చాలా వరకూ పని తగ్గి సమయం ఆదా అవుతుంది. ఇంకా భవి‎ష‌్యత్తులో ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో మరిన్ని వింత వస్తువులు ఏవేవి వస్తాయో వేచిచూడాలి.

 

 

 

T.V.SRIKAR