Mynampally Hanumanth Rao : నిన్న పొంగులేటి, తుమ్మల.. ఇవాళ మైనంపల్లి.. దీనంగా గులాబీ పార్టీ.. జోష్‌లో కాంగ్రెస్‌..

తెలంగాణలో ఎన్నికల వేళ కాంగ్రెస్ లో బీఆర్ఎస్ నుంచి చేరికలు ఎక్కువగా జరుగుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 23, 2023 | 02:26 PMLast Updated on: Sep 23, 2023 | 2:26 PM

All Senior Brs Leaders Are Going To Congress

ఎన్నికల టైమ్ అనగానే.. జంపింగ్‌ జపాంగ్‌లు చాలా కామన్. ఐతే తెలంగాణలో ఈసారి మాత్రం.. భిన్నంగా కనిపిస్తోంది పరిస్థితి. కీలక నేతలంతా కాంగ్రెస్‌లోకి చేరుతుంటే.. దారి తెలియని నాయకులంతా బీఆర్ఎస్‌ భవన్ వైపు చూస్తున్నారు. దీంతో రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. అధికార బీఆర్ఎస్‌ నుంచి వలసలు భారీగా పెరుగుతున్నాయ్. ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని.. గెలుపే లక్ష్యంగా మొదటి జాబితా అభ్యర్థులను ప్రకటించనప్పటి నుంచి.. కారు పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం జరిగిందని.. చాలా మంది నేతలు ఆరోపిస్తున్నారు. దీంతో అధికార పార్టీలో ముసలం మొదలైంది.

ఐతే జాబితాలో మార్పులు ఉంటాయని కే‌సీఆర్ క్లియర్‌గా చెప్పినా.. అసంతృప్తులు మాత్రం ఆగడం లేదు. ఒకరి తర్వాత ఒకరు పార్టీని వీడుతున్నారు. దీంతో కారు పార్టీలో కలవరం మొదలైంది. ఈసారి వందకు పైగా సీట్లు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో.. కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సీనియర్ నేతలంతా ఒక్కొక్కరుగా దూరం కావడం.. కారు పార్టీకి పెద్ద దెబ్బే. మొన్న పొంగులేటి.. కారు పార్టీకి గుడ్‌ బై చెప్పి.. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పాలేరు టికెట్ ఆశించిన తుమ్మల నాగేశ్వరరావు.. నిన్న కారు దిగి హస్తం గూటికి చేరారు. ఇప్పుడు మరో కీలక నేత మైనమపల్లి హనుమంతరావు కూడా బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. త్వరలో మైనంపల్లి కూడా తన కుమారుడితో పాటు కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది.

ఇక అటు బీఆర్ఎస్‌ మాజీ ఎమ్మెల్యే వేమూరి వీరేశం కూడా అధికార పార్టీ వీడి హస్తం గూటికి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయ్. బీఆర్ఎస్‌లోని కీలక నేతలంతా కాంగ్రెస్‌లో చేరుతుండడంతో.. హస్తం నేతలు ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఎన్నికలు మరింత దగ్గర పడే కొద్ది ఈ వలసలు మరింత పెరిగే అవకాశం ఉంది. మరి ఈసారి అధికారం కోసం గట్టిగా పోటీ పడుతున్న కాంగ్రెస్ పార్టీ..) బి‌ఆర్‌ఎస్ పై ఎలా పైచేయి సాధిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. పైకి కనిపించేదేదీ నిజం కాదు.. కనిపించనిది ఏదీ అబద్దం కాదు. మనకు కనిపించేది ఒకటి.. వెనకాల జరిగేది ఒకటి.. రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలే ఉంటాయ్. ఇప్పుడు సీనియర్లు అంతా దూరం అయినంత మాత్రాన కారు పార్టీని చిన్నగా చేయడానికి లేదు.. అర్థం కాకుండా ఉండేవే కేసీఆర్ వ్యూహాలు అనే చర్చ కూడా సాగుతోంది. దీంతో రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయం మరింత ఆసక్తికరంగా మారడం ఖాయం అనిపిస్తోంది.