Congress Party: పక్క పార్టీ వాళ్లకే తొలి ప్రాధాన్యం.. పార్టీని నమ్ముకున్న వారికి దక్కని చోటు

తెలంగాణ కాంగ్రెస్లో తొలిజాబితా మొత్తం పక్క పార్టీ నుంచి వచ్చిన నేతలే కావడం గమనాార్హం. దీని వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏంటి.. అసమ్మతి నాయకులు పరిస్థితి ఏంటి.. సీనియర్లకు స్థానం కల్పించకపోవడం పై కాంగ్రెస్ ఏం చేయబోతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 15, 2023 | 01:28 PMLast Updated on: Oct 15, 2023 | 1:28 PM

All The Candidates In The First List Of Telangana Congress Are From Brs And Bjp

కాంగ్రెస్ ఎట్టకేలకు తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఇందులో సుమారు 55 మంది నాయకులు ఉన్నారు. వీరిలో కొందరు బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారైతే మరి కొందరు బీజేపీలో క్రియాశీలక పాత్ర పోశించి కాంగ్రెస్ కండువా కప్పుకున్నవారు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ కు పెద్ద సవాలుగా మారింది. పార్టీలో ఎంతో కాలంగా పనిచేస్తున్న వారిని పక్కన పెట్టి పక్క పార్టీలో నుంచి నిన్నకాక మొన్న వచ్చిన వారిని చేర్చుకోవడం పై లోలోపల తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది. 

తొలి జాబితా మొత్తం బీఆర్ఎస్ – బీజేపీదే..

నిర్మల్ నుంచి శ్రీ హరి రావుకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసింది. అయితే ఈయన బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్లో చేరారు. అదే కోవలోకి ఆర్మూర్ నుంచి బీజేపీలో కొనసాగిన వినయ్ రెడ్డి కూడా చేరారు. ఈయన బీజేపీలో క్షేత్ర స్థాయిలో పనిచేసి ఆశించినంత ఫలితం రాకపోవడంతో కాంగ్రెస్లో చేరారు. ఈయనకు కూడా కాంగ్రెస్ అధిష్టానం చోటు కల్పించింది. ఇక బాల్కొండ సునీల్ విషయానికొస్తే.. ఈయనకు ఆరెంజ్ ట్రావెల్స్ అనే ట్రాన్స్ పోర్ట్ వ్యాపారాలు ఉన్నాయి. బీఎస్పీలో కొంత కాలం పనిచేసి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కి గట్టిపోటీ ఇచ్చారు. 2018 ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచారు. బీఎస్పీ తరువాత బీజేపీలో చేరి అక్కడ కూడా కొన్నాళ్లు ప్రయాణం సాగించారు. తగిన గుర్తింపులేకపోవడంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయనకు కూడా తొలి జాబితాలో అవకాశం లభించింది.  మైనంపల్లి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటించిన రోజే హరీష్ రావు పై సంచలన వ్యాఖ్యలు చేసి పార్టీకి వ్యతిరేకంగా మారారు. దీనికి కారణం తన కుమారుడు రోహిత్ కు మెదక్ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. కాంగ్రెస్ నుంచి సరైన హామీ లభించడంతో అందులో చేరి తొలిజాబితాలోనే మల్కాజ్ గిరి, మెదక్ నుంచి మైనంపల్లి తండ్రీ, కొడుకులు టికెట్ ను దక్కించుకున్నారు.

పదవులు వదులుకున్న వారికి అవకాశం..

ఇలా తొలిజాబితాలో అధికారంలో ఉన్నవారు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో టికెట్ కన్ఫాం చేసింది అధిష్టానం. అందులో గద్వాల్ నియోజకవర్గం నుంచి సరిత ముందు వరుసలో ఉన్నారు. ఈమె బీఆర్ఎస్ నుంచి జడ్పీటీసీ ఛైర్మన్ గా కొనసాగుతూ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో టికెట్ దక్కింది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్సీ రాజేష్ కూడా తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. ఈయనకు ఎమ్మెల్యే టికెట్ ఖరారు చేసింది. ఇక జహీరాబాద్ బీజేపీ నుంచి కాంగ్రెలో చేరిన  చంద్రశేఖర్  తొలిజాబితాలో స్థానం సంపాధించుకున్నారు. అదే పార్టీకి చెందిన కొలను హన్మంత రెడ్డి కి కూడా టికెట్ కేటాయించింది కాంగ్రెస్. బీఆర్ఎస్ నుంచి వచ్చిన కసిరెడ్డి, జూపల్లి, వేముల వీరేశంకు సముచిత స్థానాన్ని కల్పించడంలో సఫలమయింది కాంగ్రెస్.

సీనియర్లను పక్కన పెట్టిన కాంగ్రెస్..

ఇలా పక్క పార్టీలో నుంచి వచ్చిన వారికి తొలిజాబితాలోనే అవకాశం కల్పించడం వెనుక కాంగ్రెస్ వ్యూహం కనిపిస్తోంది. ఎందుకంటే వీరు బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చిన వారు కావడంతో వారిని  బయటకు వెళ్లనివ్వకుండా టికెట్లు కేటాయించింది. దీంతో బీఆర్ఎస్, బీజేపీలో ఉన్న అసమ్మతిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే ఈక్రమంలో కాంగ్రెస్ కు మొదటి నుంచి సేవలందిస్తున్న కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ మధు యాష్కీ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్, మాజీ పార్లమెంట్ సభ్యుడు బీసీ నేత పొన్నం ప్రభాకర్ పేర్లు తొలిజాబితాలో కనపడక పోవడం కాసింత నిరాశను కలిగిస్తోంది. వీరు రెండవ జాబితా వచ్చే వరకూ పార్టీలో కొనసాగుతారా.. గతంలో లాగే క్రియాశీలకంగా పని చేస్తారా అన్నది వేచి చూడాలి. వీరు పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి. వీరిని బుజ్జగించే పని కాంగ్రెస్ చేస్తుందా అంటే ఇప్పట్లో అయితే కనిపించడం లేదు.

సీపీఐ పరిస్థితి ఏంటి..?

ఖమ్మం జిల్లాలో చెన్నూరు..కొత్తగూడం రెండు స్థానాలను ఆశించిన సీపీఐకి మొండి చెయ్యి చూపించింది కాంగ్రెస్. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని పొత్తు కుదుర్చుకున్నప్పటికీ తొలి జాబితాలో ఆశించిన సీట్లు రాకపోవడంతో సీపీఐ లో లొల్లి మొదలైంది. అలాగే మునుగోడులోనూ సొంతంగా పోటీ చేస్తామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాలన్నింటినీ కాంగ్రెస్ ఏవిధంగా సర్థి చెబుతుందో తెలియాలంటే మరి కొంత కాలం వేచి చూడక తప్పదు.

T.V.SRIKAR