America Immigration Officials: ఇండియా స్టూడెంట్స్ ను తిప్పి పంపుతున్న అమెరికా.. ఎందుకు ?
అమెరికాలో ఏం జరుగుతోంది. బారతీయ విద్యార్థులను ఎందుకు వెనక్కి పంపుతున్నారు. దీనికి కారణాలేంటి..?
ఉన్నత చదువుల కోసం వెళ్లిన 21 మంది భారత విద్యార్థులను అమెరికా వెనక్కి తిప్పి పంపించింది. విమానాశ్రయంలో దిగిన వెంటనే చేసిన ఇమ్మిగ్రేషన్ తనిఖీలలో 21 మంది విద్యార్థుల వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించి, ఆ తర్వాతి విమానంలోనే వారిని ఇండియాకు పంపించేశారు. వీరిలో విజయవాడకు చెందిన ఒక యువతితో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు స్టూడెంట్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భారతీయ విద్యార్థులందరికీ అమెరికాలోని గుర్తింపు పొందిన మంచి యూనివర్సిటీలలో అంతకుముందే అడ్మిషన్స్ దొరికాయి. అమెరికా వీసా కూడా లభించింది. అయినా ఇమిగ్రేషన్ అధికారులు కన్నెర్ర చేశారు. ఇరుకు గదుల్లో దాదాపు 16 గంటలకుపైగా కూర్చోబెట్టి, ఆ తర్వాత ఢిల్లీకి పంపించారు. అట్లాంటా, షికాగో, శాన్‌ఫ్రాన్‌సిస్కోతోపాటు మరికొన్ని విమానాశ్రయాల్లో దిగిన భారతీయ విద్యార్థులకు ఈ దారుణ అనుభవం ఎదురైంది. తాజా పరిణామంతో అమెరికాకు వెళ్తున్న భారత విద్యార్థులను అక్కడి అధికారులు ఎందుకు వెనక్కి పంపుతున్నారు ? వీసాలు ఉన్నా చదువుకునేందుకు ఎందుకు అనుమతించడం లేదు ? ఒక్కసారి తిరస్కరణకు గురై వెనక్కి వస్తే మళ్లీ వెళ్లడం సాధ్యం కాదా ? అనే ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాటిపై ఓసారి పరిశీలన చేద్దాం..
తనిఖీలలో అడిగే ప్రశ్నలేంటి ?
ఎయిర్ పోర్ట్ లలో ఇమిగ్రేషన్ అధికారులు విద్యార్థులను ర్యాండమ్‌గా ఎంచుకుని తనిఖీ చేస్తుంటారు. ఈ సమయంలో వారి ఆర్థిక పరిస్థితి, యూనివర్సిటీ ఫీజులు, బ్యాంకు అకౌంట్ల వివరాలు తదితర అంశాలను పరిశీలిస్తారు. వారు సొంతంగా ఫీజులు కట్టగలుగుతారా, లేదా అనేది చూస్తారు. విద్యార్థి, తండ్రికి సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు తెలుసుకుని బ్యాంకు బ్యాలెన్సు ఎంత ఉందో చూస్తారు. అంతకుముందు ఇచ్చిన డాక్యుమెంట్లతో ఆ వివరాలను పోల్చి చూసుకుంటారు. కొందరు కన్సల్టెన్సీల నిర్వాహకులు ఫేక్ డాక్యుమెంట్లు పెడతారు. అప్పుడు స్టూడెంట్స్ కు ఇబ్బంది అవుతుంది. డెబిట్, క్రెడిట్ కార్డులు, ఫోన్ డేటా, సోషల్ మీడియా పోస్టులు, సోషల్ మీడియా చాటింగ్, అనారోగ్య సమస్యలు, అమెరికాలో ఉండబోయే అడ్రస్, స్థానికంగా ఉన్న బంధువులు, స్నేహితుల వివరాలు, ఆన్లైన్ క్లాసుల రిజిస్ట్రేషన్ వంటి ప్రశ్నలను ఇమిగ్రేషన్ అధికారులు అడుగుతుంటారు. ఈ ప్రశ్నలకు తప్పుడు సమాచారమిస్తే భారీ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ సమాధానాలతో ఇమిగ్రేషన్ అధికారులు సంతృప్తి చెందకపోతే స్టూడెంట్స్ ను ‘డిపోర్ట్’ చేస్తున్నారు. అలాంటి విద్యార్థులను వెంటనే మరో విమానంలో స్వదేశానికి పంపిస్తున్నారు.
“డిపోర్ట్” చేస్తే మళ్లీ అమెరికాకు వెళ్లలేరా?
తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే స్టూడెంట్స్ ను ఇమ్మిగ్రేషన్ అధికారులు “డిపోర్ట్” చేస్తారు. దీంతో ఆ విద్యార్థులు మరో ఐదేళ్ల వరకు చదువుకునేందుకు అమెరికా వెళ్లే వీలుండదు. వీసా రాకుండా బ్లాక్ లిస్టులో పెడతారు. అయితే ఈ నిషేధం అమెరికాకే పరిమితం అవుతుంది. వేరే దేశాలకు వర్తించదు. కానీ అమెరికా బ్యాన్ చేసిందని తెలిస్తే ఆ దేశాల నుంచి కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.