School Boy: స్కూల్లో సూపర్ మ్యాన్ ఫీట్.. బాలీవుడ్ హీరోని అనుసరిస్తూ పాఠశాలపై నుంచి కిందకు దూకిన 8 ఏళ్ల బాలుడు..
ఈమధ్య కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు కొత్త ట్రెండ్ గా మారాయి. పరీక్షలు సరిగా రాయలేదనో, మార్కులు సరిగా రావన్న అపనమ్మకంతోనో, ఎగ్జామ్స్ లో ఫెయిల్ అవుతామన్న ముందస్తు భయంతోనో బలవన్మరణాలకు పాల్పడటం చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ అలా జరగలేదు సినిమా హీరోను తాను కూడా అనుకరించే క్రమంలో క్లాస్ రూం ఆవరణలో నుంచి క్రిందకు దూకేశాడు. దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. వీరేన్ స్వరూప్ అనే ఎనిమిదేళ్ల విద్యార్థి క్లాస్ జరుగుతుండగా మధ్యలో నీళ్ళు తాగేందుకు అని లేచాడు. టీచర్ పాఠం చెబుతున్న క్రమంలో పర్మిషన్ అడిగి క్లాస్ రూం వరండాలోకి వచ్చాడు. ఈ తరగతి గది మూడవ అంతస్తులో ఉంది. అంతపై నుంచి అమాంతం క్రిందకు దూకేశాడు. ఉన్న పళంగా ఎందుకు దూకాడో ఎవరికీ అర్థం కాలేదు. ఈ దృశ్యం పాఠశాల సీసీ టీవిలో రికార్డ్ అయ్యింది. ఈ క్రమంలో అతని ముక్కు, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే గుర్తించిన పాఠశాల సిబ్బంది అతనిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఆ పిల్లవాడు కాస్త కోలుకున్న తరువాత యాజమాన్యంతో పాటూ తల్లిదండ్రులు అబ్బాయితో మాట్లాడారు. ఎందుకు పైనుంచి కిందకు దూకావని విచారించారు. దీనికి ఆ బాలుడు చెప్పిన సమాధానం చూసి పేరెంట్స్ తో సహా అందరూ షాక్ అయ్యారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ క్రిష్ సినిమాలో ఇలా పై నుంచి క్రిందకు సునాయాసంగా దూకుతాడు. ఈ సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకొని అతనిని అనుసరిస్తూ నేను కూడా క్షేమంగా కిందకు చేరుతాను అనుకొని దూకేశాను. ఇలా అమాయకంగా చెప్పిన సమాధానానికి అందరూ నివ్వెరపోయారు. దీనిని బట్టి చిన్న పిల్లలకు బాల్యంలోనే సినిమా ప్రభావం ఏస్థాయిలో ఉందో అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
T.V.SRIKAR