Congress Party: టీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో ఎప్పుడు.. ఎలా ఉండబోతుంది..?
ఎన్నికల మ్యానిఫెస్టోపై తీవ్రంగా కసరత్తు చేస్తోంది కాంగ్రెస్. యువతకు ఉపాధితోపాటూ మరి కొన్ని వర్గాలకు లబ్ధి చేకూరే అంశాలపై తీవ్రంగా చర్చలు జరుపుతోంది. ఈ నెలాఖరులోగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా బీఆర్ఎస్ ఇప్పటికే మ్యానిఫెస్టో విడుదల చేసి ఎన్నికల ప్రాచారన్ని ప్రారంభించింది. కాంగ్రెస్ గత వారంలో అభ్యర్థుల తొలిజాబితా విడుదల చేసింది. రెండవ జాబితా కోసం కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల మ్యానిఫెస్టోపై దృష్టి సారించింది. ఈనెలాఖరులోగా లేకుంటే నోటిఫికేషన్ వెలువడిన తరువాత మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగానే టీపీసీసీ మ్యానిఫెస్టో కమిటి వరుసగా భేటీలు నిర్వహిస్తోంది. ఎన్నికల ప్రణాళికలో చేర్చాల్సిన అంశాలపై ముఖ్యంగా చర్చిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేయాలనే యోచనలో ఉంది. అందుకు సంబంధించి శనివారం గాంధీభవన్ లో కమిటి ఛైర్మన్, మాజీమంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన ఇతర కమిటీ సభ్యులతో సమావేశం అయ్యారు. కాంగ్రెస్ గెలిచిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహించి యువతకు పెద్ద ఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో మ్యానిఫెస్టోను పొందుపరచాలని నిర్ణయించారు.
వీటన్నింటితో పాటూ గల్ఫ్ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో విధులు నిర్వహిస్తున్న వివిధ స్థాయి గెస్ట్ లెక్చరర్లుకు అవసరమైన పథకాలను అందించే అంశంపై కృషి చేస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా లబ్ధి చేకూరేలా కొన్ని సంక్షేమ పథకాల రూపొందించేలా పావులు కదుపుతున్నారు. వీటన్నింటితో పాటూ ఆరు గ్యారెంటీల స్కీములను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకెళ్లేందుకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. వీటన్నింటినీ క్రమబద్దంగా అమలు జరిపేందుకు అవసరమైన నిర్ణయాలను కమిటీ చర్చిస్తోంది. ప్రస్తుతం తుదిదశకు చేరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
T.V.SRIKAR