Lord Vishnu: నడి సముద్రంలో దొరికిన విష్ణుమూర్తి విగ్రహం దేనికి సంకేతం ?
దశావతారం సినిమా చూశారా.. నారాయణ మంత్రం జపించాడని.. విగ్రహంతో పాటు వైష్ణవుడిని సముద్రంలోకి విసిరేస్తాడు శైవరాజు. వందల ఏళ్ల తర్వాత అదే విగ్రహం.. సునామీ వచ్చి బయటపడుతుంది.
సినిమాల్లో మాత్రమే ఇలాంటి జరుగుతాయ్.. నిజ జీవితంలో చాన్స్ లేదు అనుకుంటారు చాలామంది. కానీ కాదు. అలాంటి విగ్రహమే తమిళనాడులో బయటపడింది. నడి సంద్రంలో నారాయణుడు దర్శనం ఇచ్చాడు. శంకు చక్రాలు ధరించిన విగ్రహం.. మత్స్యకారుల వలలో వచ్చిపడింది. ఆనందం, ఆశ్చర్యంతో పాటు అద్భుతం అనిపంచిందీ సీన్. పుదుచ్చేరిలో చేపల కోసం వల వేసిన మత్స్యకారులకు.. శంఖు, చక్రాలు ధరించిన ఆదినారాయణుడి ప్రతిమ లభించింది.
ఆ విగ్రహాన్ని చూసి తన్మయత్వం చెందిన మత్స్యకారులు.. భక్తితో రెండు చేతులు జోడించి దండం పెట్టారు. నారాయణుడి విగ్రహం దొరకటం తమ అదృష్టం అని మురిసిపోయారు. మాములుగా మత్స్యకారులకు అరుదైన చేపలు పడుతుంటాయ్. అలాంటిది ఆ నారాయణుడే విగ్రహం రూపంలో లభించే సరికి వారి ఆనందానికి హద్దుల్లేవ్. ఇది గంగమ్మ తల్లి దీవెన అని మురిసిపోతున్నారు.
ఇక శంఖుచక్రాలు ధరించిన నారాయణుడి విగ్రహాన్ని ఒక్కసారి చూసేందుకు.. స్థానికులు క్యూ కట్టారు. ఆ తర్వాత విగ్రహానికి సంబంధించి.. పురావస్తు శాఖ అధికారులకు సమాచారం అందించారు. సముద్ర తీరానికి చేరుకున్న అధికారులు.. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ విగ్రహానికి సంబంధించి అధికారులు మరింత లోతుగా ఆరా తీస్తున్నారు. ఇది ఎనిమిదో శతాబ్దానికి చెందిన విగ్రహంగా అధికారులు భావిస్తున్నారు.
ప్రయోగశాలకు తరలించి.. ఆ విగ్రహం గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మత్స్యకారులకు.. సముద్రమే అమ్మైనా.. నాన్నైనా ! సముద్రం మీదే వాళ్ల జీవితాలు ఆధారపడి ఉంటాయ్. అలాంటి సముద్రంలో ఆ దేవుడి విగ్రహం దొరికిందంటే.. మంచి రోజులు రాబోతున్నాయనడానికి ఇదే సంకేతం అని.. తెగ మురిసిపోతున్నారు వాళ్లంతా !