AP BJP Tickets Tension : అనపర్తి అసెంబ్లీ అంటే పురంధేశ్వరికి భయమెందుకు ? అక్కడ బీజేపీ నిలబడతుందా ?
పొత్తులో భాగంగా రాజమండ్రి (Rajahmundry) పార్లమెంటు, అనపర్తి (Anaparthi) అసెంబ్లీ సీట్లు బీజేపీకి వెళ్ళాయి. రాజమండ్రి ఎంపీ (Rajahmundry MP) అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖరారయ్యారు. అదే సమయంలో అనపర్తి అసెంబ్లీ టికెట్‌పై సస్పెన్షన్ పెరుగుతోంది.
పొత్తులో భాగంగా రాజమండ్రి (Rajahmundry) పార్లమెంటు, అనపర్తి (Anaparthi) అసెంబ్లీ సీట్లు బీజేపీకి వెళ్ళాయి. రాజమండ్రి ఎంపీ (Rajahmundry MP) అభ్యర్థిగా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఖరారయ్యారు. అదే సమయంలో అనపర్తి అసెంబ్లీ టికెట్‌పై సస్పెన్షన్ పెరుగుతోంది. ఓ వైపు బీజేపీ అధిష్టానం అనపర్తి అసెంబ్లీ స్థానం కోసం అభ్యర్థుల్ని వెదుకుతుంటే… ఎంపీ అభ్యర్థి పురందేశ్వరి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సీటు మాకు ఇవ్వొద్దంటూ టీడీపీ అధిష్టానం దగ్గరికి రాయబారం పంపుతున్నారట. అదేంటయ్యా… సాక్షాత్తు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలే… మాకు టిక్కెట్ ఇవ్వొద్దని అనడమేంటంటే… ఎక్కడి లెక్కలు అక్కడ ఉంటాయి బాబూ… అన్నది సమాధానం.
అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్ రాజమండ్రి పార్లమెంటు సీటు పరిధిలో ఉంది. 2009లో ఇక్కడ్నుంచి టీడీపీ (TDP) అభ్యర్థిగా పోటీ చేశారు మురళీమోహన్. పార్లమెంటు పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టిడిపికి ఆధిక్యత వచ్చింది. కానీ… ఒక్క అనపర్తిలోనే కాంగ్రెస్‌కు ఏకంగా 60వేల మెజార్టీ లభించింది. నాటి కాంగ్రెస్ అభ్యర్థి ఉండవల్లి అరుణ్ కుమార్‌కి అది ప్లస్ అయింది. అప్పటివరకు 50వేల మెజార్టీతో ఉన్న TDP అభ్యర్ధి మురళీమోహన్ అనపర్తి అసెంబ్లీ దెబ్బకి పదివేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనపర్తి ఓటర్లు ఏ పార్టీకి ఓటేసినా ఏకపక్షంగా నిలబడతారు. ఎవరివైపు మొగ్గుచూపినా కనీసం నలభై.., యాభైవేల మెజార్టీ ఇచ్చేస్తారు. అదే ఇప్పుడు పురందేశ్వరిని భయపెడుతోందని అంటున్నారు. వాస్తవానికి అనపర్తిలో బిజెపికి తగిన అభ్యర్థి లేరు. దీంతో రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఈ టిక్కెట్ ఇవ్వాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచనగా తెలిసింది. ఒకవేళ సోము వీర్రాజు సరిపోడన్న అభిప్రాయం వ్యక్తమైతే పార్టీలోని రెడ్డి సామాజికవర్గానికి చెందిన నాయకుడిని బరిలో దింపాలని సీనియర్స్ అనుకుంటున్నట్టు తెలిసింది. అదే జరిగితే ఇక్కడ భారీ తేడాతో అసెంబ్లీ సీటు కోల్పోవాల్సి వస్తుందని, ఆ ప్రభావం తన మీద కూడా పడుతుందన్న భయంతోనే పురందేశ్వరి ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. కర్ణాటకలో పౌల్ట్రీ వ్యాపారంలో ఉన్న సత్తి త్రినాధ్ రెడ్డిని అనపర్తి బిజెపి అభ్యర్థిగా పోటీకి దింపాలని ప్రయత్నిస్తున్నారట. అందుకు ఆయన సుముఖంగా లేకున్నా… ఏదోలా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది.
లోకల్‌గా బీజేపీ రగడ అలా ఉంటే… అటు టిడిపి క్యాడర్ లో చిచ్చు రేగుతోంది. సీటును బిజెపికి ఇచ్చారన్న వార్తలతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీకి చెందిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు మొదటి జాబితాలో ఖరారైంది. తర్వాత పొత్తులో భాగంగా అనపర్తి టికెట్ బిజెపికి కేటాయిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై టిడిపి క్యాడర్‌లో ఆందోళన పెరుగుతోంది. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్న కేడర్… సీటు విషయంలో అధిష్టానం క్లారిటీ ఇచ్చేదాకా ప్రచారం పేరుతో తిరగడానికి కుదరదంటూ ఆపేశారు. రామకృష్ణారెడ్డి, ఆయన కొడుకు సర్ది చెప్పడానికి చూసినా వినడం లేదట కార్యకర్తలు. సీటుపై క్లారిటీ వచ్చాకనే ప్రచారాన్ని కొనసాగించాలని పట్టుబట్టడంతో చేసేది లేక వెనుదిరిగారట. మరోవైపు టీడీపీ కేడర్ మూకుమ్మడి రాజీనామాలకు కూడా సిద్ధపడ్డారు. ఈ మేరకు రాజీనామా పత్రాలను అనపర్తి పార్టీ పరిశీలకుడి పంపేశారు. ఐదేళ్ల నుంచి ప్రతిపక్షంలో ఉండి పార్టీ కోసం నానా కష్టాలు పడి నిలబెట్టుకుంటే…ఇప్పుడు ఎవరికో సీటు ఇస్తామంటే ఊరుకోబోమని అంటున్నారట అనపర్తి ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు. దీన్ని అధిష్టానం గుర్తించాలని, కష్టం ఒకరిది ఫలితం ఒకరికా అంటూ మండిపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ అంతకంతకూ పెరుగుతోంది.