ఐపీఎల్ వేలంలోకి ఆండర్సన్ ఫ్రాంచైజీలు పట్టించుకుంటాయా ?

ఐపీఎల్ మెగా వేలం ఈ సారి రసవత్తరంగా ఉండబోతోంది. చాలా ఏళ్ళ తర్వాత పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి కారణం. తమ తమ జట్టు కూర్పుపై తర్జన భర్జన పడిన కొన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్ళను వదలుకోక తప్పలేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 6, 2024 | 04:19 PMLast Updated on: Nov 06, 2024 | 4:19 PM

Anderson Into Ipl Auction Do Franchisees Care

ఐపీఎల్ మెగా వేలం ఈ సారి రసవత్తరంగా ఉండబోతోంది. చాలా ఏళ్ళ తర్వాత పలువురు స్టార్ ప్లేయర్స్ వేలంలోకి రావడమే దీనికి కారణం. తమ తమ జట్టు కూర్పుపై తర్జన భర్జన పడిన కొన్ని ఫ్రాంచైజీలు కీలక ఆటగాళ్ళను వదలుకోక తప్పలేదు. అందుకే స్వదేశీ, విదేశీ స్టార్ ప్లేయర్స్ ను సైతం మళ్ళీ వేలంలోనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా బీసీసీఐ వేలం బరిలో నిలిచిన ఆటగాళ్ళ జాబితాను కూడా ప్రకటించింది. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోగా..ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు , 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు. విదేశీ ఆటగాళ్లలో అత్యధికంగా సౌతాఫ్రికా నుంచి 91 మంది ప్లేయర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు ఐపీఎల్‌లో అరంగేట్రం చేయని 42 ఏళ్ల ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ మెగా వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు.

ఈ ఇంగ్లాండ్ దిగ్గజ పేసర్ ఇటీవలే అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో 700 వికెట్లు తీసిన ఏకైక పేసర్ చరిత్ర సృష్టించి ఘనంగా వీడ్కోలు పలికాడు. ఆటకు వీడ్కోలు పలికిన వెంటనే టెస్ట్ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ మెంటార్‌ గా బాధ్యతలు చేపట్టాడు. తనకు టీ20 క్రికెట్ ఆడాలని ఉందనే కోరికను ఇటీవలే ఆండర్సన్ బయటపెట్టాడు. ఆ కోరికను నెరవేర్చుకునేందుకు ఐపీఎల్ వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఇంగ్లాండ్ లో జరుగుతున్న హండ్రెడ్ లీగ్ తో పాటు ప్రపంచంలోని అన్ని టీ20 లీగ్ లు ఆడాలనుకున్నట్లు ఈ ఇంగ్లీష్ బౌలర్ చెప్పాడు. అయితే 42 ఏళ్ళ వయసులో ఈ పేసర్ ను ఫ్రాంచైజీలు పట్టించుకుంటాయో లేదో చూడాలి. అతను చివరిసారిగా 2014 టీ20 బ్లాస్ట్ ఫైనల్ లో ఆడాడు. మొత్తం 44 టీ20 మ్యాచ్‌ల్లో 8.47 ఎకానమీతో 41 వికెట్లు పడగొట్టాడు.

అదే సమయంలో ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మెగా వేలం నుంచి తప్పుకున్నాడు. బెన్ స్టోక్స్ జాతీయ జట్టును దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. అతను చివరిసారిగా 2023 ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడాడు. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన కొందరు ఆటగాళ్ళ టెస్ట్ ఫార్మాట్ కోసం ఐపీఎల్ కు దూరంగా ఉంటున్నారు. గతంలో మిఛెల్ స్టార్క్ , బెన్ స్టోక్స్, కమ్మిన్స్ వంటి ప్లేయర్స్ కూడా ఇదే కారణంతో వేలంలోకి రాలేదు. తమ జాతీయ జట్టు షెడ్యూల్ దృష్ట్యా వీరు నిర్ణయం తీసుకుంటున్నారు. కాగా వేలంలో రిజిష్టర్ చేసుకుని ఫ్రాంచైజీలు కొన్న తర్వాత ఐపీఎల్ నుంచి తప్పుకుంటే మాత్రం విదేశీ ఆటగాళ్ళ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అలాంటి విదేశీ ప్లేయర్స్ ను రెండేళ్ళ పాటు బీసీసీఐ వేలంలో పాల్గొనకుండా నిషేధం విధించనుంది.