AP Assembly: ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సభాపర్వం.. తెలుగుదేశం నాయకుల పాదయాత్ర
ఆంధ్రప్రదేశ్ లో శాసనసభా సమావేశాలు ప్రారంభమైయ్యాయి. ఏఏ అంశాలపై చర్చిస్తారన్నది తెలియాల్సి ఉంది. టీడీపీ అధినేత అరెస్ట్ అయినందున సభను సజావుగా నడిపిస్తారా లేదా అన్నది ఆసక్తిగా మారింది.

Andhra Pradesh Assembly sessions have started and some bills will be introduced on this occasion
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం 9 గంటలకు ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభంకాగా మండలి సమావేశాలు మాత్రం 10 గంటలకు ప్రారంభించారు. మరి కాసేపట్లో శాసనసభా వ్యవహారాల కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయనున్నారు. సభ ఎన్నిరోజులు నిర్వహించాలి, ఏఏ అంశాలపై చర్చించాలన్న దానిపై అజెండా రూపొందిస్తారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వం కొన్ని కీలక బిల్లులను ప్రవేశపెట్టి వాటిని తీర్మానించే అవకాశం కనిపిస్తోంది. సెప్టెంబర్ 21 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని శాసన మండలి చైర్మన్ తోపాటూ అసెంబ్లీ స్పీకర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ నాయకుల పాదయాత్ర
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ సమయంలోనే అసెంబ్లీ సమావేశాలు జరిపేందుకు సిద్దమైన నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. టీడీఎల్పీ సభ్యులు అందరూ కలిసి ఏపీ సెక్రటరేట్ ఫైర్ స్టేషన్ నుంచి పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకున్నారు. వీరిలో వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన రెబల్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలు ఉన్నారు.