Annamalai : ఓడినా కేంద్ర మంత్రి పదవి.. అసలు అన్నామలై గురించి తెలుసా
అన్నామలై... తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు... ఆ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా కమలం పార్టీకి తమిళనాట ఓట్ల శాతాన్ని పెంచింది మాత్రం అన్నామలైనే. అందుకే ఆయన పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది బీజేపీ అధిష్టానం.
అన్నామలై… తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు… ఆ రాష్ట్రంలో ఒక్క సీటు గెలవకపోయినా కమలం పార్టీకి తమిళనాట ఓట్ల శాతాన్ని పెంచింది మాత్రం అన్నామలైనే. అందుకే ఆయన పోరాటానికి తగిన గుర్తింపు ఇచ్చింది బీజేపీ అధిష్టానం. అన్నామలైను కేంద్రమంత్రి వర్గంలో చేర్చుకుంటున్నారు ప్రధాని నరేంద్రమోడీ. తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి పోటీ చేసిన అన్నామలై ఓడిపోయారు. కానీ ఆ రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అన్నామలైకి కేంద్ర మంత్రి పదవి ఇస్తున్నారు.
2019 లోక్ సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీకి వచ్చిన ఓట్ల శాతం 3.66 మాత్రమే. 2024 ఎన్నికల నాటికి ఇది ఏకంగా 11.24శాతానికి పెరిగింది. బీజేపీ రెండంకెల స్థాయికి చేరడానికి అన్నామలైనే కారణం. మొన్నటి ఎన్డీఏ సమావేశంలో కూడా మోడీ ప్రత్యేకంగా తమిళనాడు గురించి మాట్లాడారు. ఇప్పుడు కాకపోయినా రాబోయే రోజుల్లో అయినా ఆ రాష్ట్రంలో పట్టు సాధించాలని బీజేపీ భావిస్తోంది.
అన్నామలై మొదట కర్ణాటకలో ఐపీఎస్ అధికారిగా పనిచేశారు. ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన… రియల్ సింగం అని పేరు తెచ్చుకున్నారు.
2018లో మానస సరోవర్ యాత్రకు వెళ్ళారు. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి తనకేం కావాలో తెలిసిందంటూ ఖాకీ పోస్ట్ కి గుడ్ బై కొట్టారు. 2019లో పోలీస్ శాఖకు రాజీనామా చేసి… తమిళనాడులోని కరూర్ జిల్లాలో సేంద్రీయ వ్యవసాయం మొదలుపెట్టారు. కొన్నాళ్ళకి పూర్తి స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టారు. రజనీ కాంత్ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. కానీ సూపర్ స్టార్ పార్టీ పెట్టకపోవడంతో అన్నామలై బీజేపీలో చేరారు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం, ద్రవిడ రాజకీయాలను తట్టుకొని నిలబడటం, పార్టీ క్యాడర్ ని కాపాడుకోవడం లాంటి లక్షణాలు బీజేపీ అధిష్టానాన్ని ఆకర్షించాయి. దాంతో పార్టీలో చేరిన 10 నెలలకే అధ్యక్ష స్థాయికి ఎదిగారు అన్నామలై. రాబోయే రోజుల్లో తమిళనాడులో ఆయన అవసరాన్ని గుర్తించిన బీజేపీ … ఇప్పుడు పిలిచి కేంద్ర మంత్రి పదవి ఇస్తోంది. ఏదైనా రాష్ట్రం నుంచి ఆయన్ని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది.