No Flying Zone: తిరుమల శ్రీవారి ఆలయం పై నుంచి మరో విమాన ప్రయాణం.. టీటీడీ విజ్ఞప్తి పట్టించుకోని ఏటీసీ అధికారులు
తిరుమలకు ఏమైంది. ఒకవైపు చిరుతల భయం, మరోవైపు ఆలయం పై విమానాల ప్రయాణం. నియమాలు, నిబంధనలు, జాగ్రత్తలు ఎవరికీ పట్టవా అని ప్రశ్నిస్తే పట్టించుకోవడం లేదనే సమాధానమే వినిపిస్తుంది.
పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం అయిన తిరుమల శ్రీవారి ఆలయం మీద నేటికీ విమానాల ప్రయాణం కొనసాగుతూనే ఉంది. టిటిడి పాలకమండలి ఎన్నిసార్లు ఎయిర్ ఇండియా అధారిటీ అధకారులకు విజ్ఞప్తి చేసినప్పటికీ పట్టించుకోవడం లేదు. ఇవాళ ఏకంగా ఆనంద నిలయానికి అతి తక్కువ ఎత్తులో ఒక విమానం ప్రయాణించింది. ఆగమశాస్త్రం ప్రకారం పుణ్యక్షేత్రాల మీద ఎలాంటి విమాన ప్రయాణాలు జరుగకూడదు అనే నిబంధన అనాదిగా వస్తుంది. కేరళలోని శబరిమలై అయ్యప్ప స్వామి దేవస్థానం పై విమాన ప్రయాణాలు రద్డు చేశారు. మన తిరుమల విషయంలో అడుగడుగునా అలక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు అధికారులు.
ఆగమశాస్ర్తాని తరుచు ఉల్లంఘిస్తూన్న పైలెట్లపై ఎవరూ ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో రెచ్చిపోయి ఆగమశాస్త్రానికి విరుద్దంగా ప్రవర్తిస్తున్నారు. కేవలం నెల వ్యవధిలో రెండు మూడు సార్లు తిరుగుతున్నాయి. తిరుమలను నో ఫ్లైయింగ్ జోన్ గా ప్రకటించాలని మాజీ విమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు ఉన్నప్పుడు దరఖాస్తులు పెట్టుకున్నప్పటికీ ఫలితం లేకుండాపోయింది. తిరుమల నో ప్లై జోన్ కాదంటున్న ఏయిర్ ట్రాఫిక్ అధికార్లు ఏయిర్ ట్రాఫిక్ పెరిగితే తిరుమల మీదుగా విమాన ప్రయాణం తప్పదు అన్నట్లుగా ప్రవర్తిస్తూన్నారు. ఏటిసి అధికారులకు ఎప్పటికైనా తెలివి వస్తుందో వేచి చూడాలి.
T.V.SRIKAR