Tirumala: తిరుమలలో మళ్లీ అదే అపచారం.. కొండపై చక్కర్లు కొట్టిన విమానం
తిరుమలలో మరోసారి విమానం కలకలం రేపింది. తిరుమల కొండపై విమానం చక్కర్లు కొట్టింది. మాఢ వీధులపై గగనతలంలో ఓ విమానం తిరుగుతూ కనిపించింది.

Another time in Tirumala, planes flew over the Srivari temple
ఇలా జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా విమానాలు, హెలికాప్టర్లు తిరుమల శ్రీవారి ఆలయం, గొల్ల మండపం, అన్న ప్రసాద వితరణ కేంద్రం మీదుగా వెళ్లాయ్. ఈ మధ్య కాలంలో తరచుగా విమానాలు ఇలా ఆలయం మీదుగా వెళ్లడం కలకలం రేపుతోంది. తిరుమలను నో ఫ్లై జోన్‌గా ప్రకటించాలని టీటీడీ గతంలోనే కేంద్రాన్ని కోరింది. ఇప్పుడే కాదు.. ఇదే తప్పు పదే పదే జరుగుతోంది. ఆ మధ్య ఒకరోజు ఏకంగా 6విమానాలు ఆలయం మీదుగా వెళ్లాయ్. తిరుమల ఆలయం మీదుగా తరచూ విమానాలు వెళ్తుండటంపై శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ విమానాలు ఎక్కడి నుంచి.. ఎక్కడికి వెళుతున్నాయో అన్నది క్లారిటీ ఉండటం లేదు. అంతేకాదు ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై నుంచి విమానాలు, హెలికాప్టర్లు వంటివి ఎగరకూడదు.
టీటీడీ గతంలోనే పలుసార్లు పౌర విమానయాన శాఖ అధికారులతో సంప్రదింపులు జరిపింది. ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కావటంతో ఎన్నో సందర్భాల్లో ఈ విషయాన్ని వివరించింది.. ఐతే వారి నుంచి ఎలాంటి స్పందన మాత్రం రాలేదు. తిరుమల శ్రీవారి ఆలయానికి ఉన్న ప్రత్యేకత, విశిష్ఠత కారణంగా నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించాలని టీటీడీ కోరుతోంది. గతంలోనే ఈ విషయాన్ని కేంద్రం దగ్గర ప్రస్తావించారు. కేంద్రం నుంచి సానుకూల స్పందన రావడం లేదు. ఇలా తరుచూ తిరుమల మీదుగా విమానాలు, హెలికాప్టర్లు వెళ్లిన సమయంలో టీటీడీ అధికారులు విమానయాన శాఖను సంప్రదిస్తున్నారు. రెండు నెలల కింద విమానాలు చక్కర్లు కొట్టినప్పుడే రకరకాల చర్చ జరిగింది. అది కంటిన్యూ అవుతుండగానే ఇప్పుడు తిరుమల కొండ గగనతలంలో విమానం తిరగడం వివాదానికి కారణం అవుతోంది.