తిరుమలలో మరో విశిష్ట ఆలయం – వాక్ దోషాన్ని హరించే ‘జాపాలి తీర్థం’
జాపాలి తీర్థం... తిరుమలలో ఉన్న మరో విశిష్ట ఆలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ప్రధాన ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాపవినాశనం వెళ్లే దారిలో ఉంది... ఈ జపాలి తీర్థం. ఇది పురాతన దేవాలయాల్లో ఒకటి.
జాపాలి తీర్థం… తిరుమలలో ఉన్న మరో విశిష్ట ఆలయం. తిరుమల శ్రీవేంకటేశ్వరుడి ప్రధాన ఆలయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో పాపవినాశనం వెళ్లే దారిలో ఉంది… ఈ జపాలి తీర్థం. ఇది పురాతన దేవాలయాల్లో ఒకటి. హనుమంతుడి జన్మస్థలంగా పేరుగాంచింది. వ్యాస మహర్షి రాసిన స్కందపురాణంలోని వేంకటాచల మహత్యంలో జాపాలి తీర్థం ప్రస్తావన ఉంది. ఏడుకొండల్లో ఒకటి అంజనాద్రి. ఆ పుణ్యమూర్తికి హనుమంతుడు జన్మించిన ప్రాంతమే జాపాలి తీర్థం. జాపాలి తీర్థాన్ని ఒక్కసారి దర్శించుకుంటే.. ఎంతటి క్లిష్ట సమస్యలు అయినా తొలగిపోతాయని ప్రతీతి.
జాబాలి మహర్షి కోరిక మేరకు హనుమంతుడు స్వయంభువుగా వెలిసిన దివ్య క్షేత్రం.. జాబాలి క్షేత్రం.. దీన్నే జాపాలి తీర్థం అని కూడా పిలుస్తారు. ఆ ఆలయ పరిసరాలు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. చుట్టూ అడవి… ఎత్తైన చెట్లు.. చూసేందుకు రెండు కళ్లు చాలవు అన్నట్టు ఉంటుంది ప్రకృతి రమణీయత. చెట్ల మధ్యలో ఆలయానికి వెళ్లే మార్గం.. మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఆలయానికి వెళ్లే మార్గంలో కొంత దూరం మెట్లు ఉంటాయి. ప్రకృతిని ఆశ్వాదిస్తూ… ఆలయానికి చేరుకుంటారు భక్తులు. ఆలయం ముందు కొలను కూడా ఉంటుంది. జాపాలి ఆలయంలో కొలువైన ఆంజనేయుడు.. సింధూర అలంకరణలో ఒక చేత గధను ధరించి.. కవచాలంకృతుడై భక్తులను అభయమిస్తున్నట్టు దర్శనమిస్తాడు.
జాపాలి క్షేత్రం.. సాక్షాత్తు దేవతలు నడిచిన ప్రదేశమని పురాణాలు చెప్తున్నాయి. ఎందరో మహాత్ములు, యోగులు తపస్సు చేసిన పవిత్రమైన ప్రదేశం. పురాణాల ప్రకారం.. మహావిష్ణువు శ్రీరాముడి అవతారం ఎత్తగా… మహాశివుడు అయిన రుద్రుడు శ్రీరాముడికి దూతగా వానరరూపాన్ని దాల్చాలని నిర్ణయించుకున్నాడట. అది తెలిసి జాబాలి అనే మహర్షి… మహాశివుడు ఎత్తబోయే హనుమంతుని రూపాన్ని ముందుగానే ప్రసన్నం చేసుకోవాలని… ఈ కొండపై జపం చేశాడు. అతని తపస్సుకు ప్రసన్నుడైన రుద్రుడు.. తాను ఎత్తబోయే హనుమంతుడి అవతారాన్ని ముందుగానే చూపిస్తాడు. జాబాలి మహర్షి చేసిన జపం వల్ల.. హనుంతుడు వెలిశాడు కనుక.. ఈ క్షేత్రం జాపాలి క్షేత్రంగా పేరుపొందింది.
రావణుడి సంహారం తర్వాత.. సీతా సమేతంగా ఆయోధ్యకు బయల్దేరిన రాముడు… జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేశారట. ఆ సమయంలో శ్రీరాముడు స్నానం చేసిన తీర్థాన్ని శ్రీరామ తీర్థమని, సీతమ్మ స్నానం చేసిన తీర్థాన్ని సీతాతీర్థమని అంటారు. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమరన ఒకటి ఉంటాయి.
జాపాలి క్షేత్రం.. వాక్ దోషాలను పోగొట్టే దివ్యక్షేత్రంగానూ పేరుగాంచింది. అయోధ్య కాండలో జాబాలి మహర్షి అనకూడని మాటలు అనడం వల్ల వాక్ దోష పాపాన్ని మూట కట్టుకుంటాడు. ఆ వాక్ దోషాన్ని తొలగించుకోవడం కోసం జాపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానమాచరిస్తాడు. దాంతో ఆయనకున్న దోషం తొలగిపోయిందని పురాణాలు చెప్తున్నాయి. అందుకే.. జాపాలి క్షేత్రంలోని రామగుండంలో స్నానం చేస్తే… వాక్ దోషాలు పోతాయని భక్తులు నమ్ముతారు.