BRS KHALI : ఏపీ, ఒడిశాలో నేతలు జంప్.. మహారాష్ట్ర లీడర్లలో అయోమయం

తెలంగాణకు (Telangana) పరిమితమైన టీఆర్ఎస్(TRS)... దేశానికి విస్తరించాలనుకొని బీఆర్ఎస్ (BRS) గా మార్చారు కేసీఆర్. కానీ తెలంగాణ సెంటిమెంట్ తోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది TRS. తమ సత్తా ఏంటో తెలుసుకోకుండా... ఓ ప్లానింగ్... ఓ విజన్... ఏదీ లేకుండా... మోడీయే లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టేశారు గులాబీ బాస్ కేసీఆర్. కానీ తమ కుటుంబ పెత్తనం, అహంకారంతో తెలంగాణలో BRS పునాదులు కదులుతున్నాయని గ్రహించలేకపోయారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2024 | 09:42 AMLast Updated on: Feb 03, 2024 | 9:42 AM

Ap And Odisha Leaders Jump Maharashtra Leaders Are Confused

 

 

 

తెలంగాణకు (Telangana) పరిమితమైన టీఆర్ఎస్(TRS)… దేశానికి విస్తరించాలనుకొని బీఆర్ఎస్ (BRS) గా మార్చారు కేసీఆర్. కానీ తెలంగాణ సెంటిమెంట్ తోనే ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది TRS. తమ సత్తా ఏంటో తెలుసుకోకుండా… ఓ ప్లానింగ్… ఓ విజన్… ఏదీ లేకుండా… మోడీయే లక్ష్యంగా జాతీయ పార్టీ పెట్టేశారు గులాబీ బాస్ కేసీఆర్. కానీ తమ కుటుంబ పెత్తనం, అహంకారంతో తెలంగాణలో BRS పునాదులు కదులుతున్నాయని గ్రహించలేకపోయారు. సరే… తెలంగాణలో పార్టీ ఓడిపోయింది. మరి BRS జాతీయ పార్టీ కదా… మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏంటి ? మళ్ళీ విస్తరణ జోలికి వెళతారా… గమ్మున ఇక్కడే ఉంటారా ?

ప్రధాని నరేంద్రమోడీ(Prime Minister Narendra Modi) ని… బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించి… జాతీయ స్థాయిలో చక్రం తిప్పుదామని BRS అధినేత కేసీఆర్ కన్నకలలు కల్లలుగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పేరు మార్చాక… ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర(Maharashtra), ఒడిశా(Odisha), కర్ణాటక రాష్ట్రాల్లో ముందుగా పార్టీని విస్తరించాలని ప్లాన్ చేశారు. కర్ణాటకలో జేడీఎస్ కుమారస్వామితో కలసి పోవాలని అనుకున్నా… ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందే ఆయన బీజేపీ గూటికి చేరడంతో కర్ణాటకలో… బీఆర్ఎస్ కి ఎంట్రీ లభించలేదు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలను అనరాని మాటలు అన్నారు కేసీఆర్. అందుకే అక్కడ పార్టీని విస్తరిస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఏపీలో ముందుగా చేరిన తోట చంద్రశేఖర్ ను పార్టీ అధ్యక్షుడిని చేశారు. ఆ తర్వాత మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు కూడా బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు తెలంగాణలో కారు షెడ్డుకు పోవడంతో… ఏపీ బీఆర్ఎస్ నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. త్వరలోనే ఏపీలో బీఆర్ఎస్ మొత్తం ఖాళీ అవబోతోంది. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు వైసీపీలో చేరిపోయారు. ఏపీ బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ కూడా త్వరలో జనసేనలోకి జంప్ అయ్యే అవకాశాలున్నాయి. ఆయన చిరంజీవితో భేటీ అవడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కూడా కావడంతో తోట జనసేనలోకి వెళ్ళడం ఖాయంగా కనిపిస్తోంది.

తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయాక… కేసీఆర్ టచ్ లోకి రాకపోవడం… అపాయింట్ మెంట్స్ ఇవ్వకపోవడం… కనీసం ఫోన్లు చేసినా రెస్పాండ్ కాకపోవడంతో ఏపీ బీఆర్ఎస్ నేతలు విసుగుచెందారు. అందుకే ఏడాది లోపే ఏపీలో చాప చుట్టేసింది బీఆర్ఎస్. అంతకుముందే ఒడిశా బీఆర్ఎస్ నేతలు కూడా కాంగ్రెస్ లో చేరారు. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ కాంగ్రెస్ లో చేరారు. ఒడిశాలో పార్టీ విస్తరణపై మాట్లాడేందుకు కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేశారు గమాంగ్. ఆయన టైమ్ ఇవ్వలేదని తెలిసింది. దాంతో గమాంగ్ తన కొడుకుతో కలసి హస్తం గూటికి చేరారు. ఈ పరిస్థితుల్లో ఏపీ, ఒడిశాలో బీఆర్ఎస్ విస్తరణ ఇక లేనట్టేని తేలిపోయింది. ఇక మిగిలింది మహారాష్ట్ర. ఇక్కడ లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీపై అనుమానాలు కలుగుతున్నాయి. మహారాష్ట్ర నేతలను కూడా కలుసుకోడానికి కేసీఆర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదు. కేసీఆర్ ను నమ్మి 15 మంది మాజీ ఎమ్మెల్యే, ఎంపీలు… BRSలో చేరారు. లోక్ సభ ఎన్నికల టైమ్ దగ్గర పడుతున్నా… బీఆర్ఎస్ ను విస్తరణకు ఎలాంటి కార్యక్రమాలు జరగడం లేదు. తెలంగాణను ఆనుకొని.. మహారాష్ట్రలోని 15 జిల్లాల్లో BRS ప్రభావం చూపిస్తుందని ఆశపడ్డారు అక్కడి నేతలు. కానీ ఇప్పుడు కేసీఆర్ మాట్లాడకపోవడంతో… మహారాష్ట్రలో బీఆర్ఎస్ నేతల భవిష్యత్తు అయోమయంగా మారింది.

తెలంగాణలో BRS ఓడిపోవడంతో మిగతా రాష్ట్రాలపైనా ప్రభావం చూపిస్తోంది. పార్టీని విస్తరిస్తారన్న ఆశలు కూడా వాళ్ళకి ఉండటం లేదు. అందుకే ఒక్కో రాష్ట్రం నుంచి బీఆర్ఎస్ లీడర్లు వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. తెలంగాణలో ఓటమితో BRSను TRSగా మార్చాలని ఇక్కడ నేతలు, కేడర్ డిమాండ్ చేస్తున్నారు. మనకు ఇతర రాష్ట్రాల జోలి వద్దు… తెలంగాణాయే బెటర్ అని ఇటీవల జరిగిన సమీక్షా సమావేశాల్లో మాజీ మంత్రులు, నేతలు, కార్యకర్తలు స్పష్టంగా చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. మొన్నటిదాకా అనారోగ్యంతో రెస్ట్ తీసుకున్న కేసీఆర్ ఇంక రంగంలోకి దిగుతున్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారన్నది తెలుస్తుంది.