AP Arogya Sri Bundh:  ఏపీలో 29 నుంచి ఆరోగ్యశ్రీ బంద్…. నెట్‌వర్క్ హాస్పిటల్స్  ప్రకటన

ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామంటున్నాయి ఆంధ్రప్రదేశ్‌ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌. తమకు రావాల్సిన వెయ్యి కోట్ల బకాయిలను ఇప్పించడంతో పాటు ప్యాకేజీల ధరలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 27, 2023 | 05:53 PMLast Updated on: Dec 27, 2023 | 5:53 PM

Ap Arogya Sri Bundh From December 29th

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 29 నుంచి ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తామని నెట్ వర్క్ హాస్పిటల్స్ ప్రకటించాయి. ఇప్పటిదాకా రోగులకు అందించిన చికిత్సలకు ఫీజుల బకాయిలు చెల్లించాలనీ, ట్రీట్మెంట్ ప్యాకేజీల  ధరలను పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.  ప్రభుత్వ హామీలు ఇచ్చి నెరవేర్చడం లేదనీ… దాంతో ఈనెల 29నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులు చూడబోమని అసోసియేషన్ తెలిపింది. తమ డిమాండ్లను ఆమోదించే ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వంకి లేకపోవడం వల్లే ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని అంటున్నారు హాస్పిటల్స్ నిర్వాహకులు. ఉద్యోగుల EHS కింద కూడా వైద్యసేవలు అందించలేమని చెప్పారు.

గత జూన్‌, నవంబరు నెలల్లో తమ డిమాండ్ల పరిష్కారం కోసం సేవలు నిలిపివేస్తామని అసోసియేషన్ హెచ్చరించింది. అప్పట్లో చర్చలు జరిపిన ప్రభుత్వం పెండింగ్ బిల్స్ చెల్లిస్తామనీ, మిగతా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. దాంతో రోగులకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తూ వచ్చాయి. కానీ హామీ ఇచ్చి నెల రోజులైనా ప్రభుత్వం తమ బకాయిలు చెల్లించకపోవడంతో .. ఈ నెల 29 నుంచి వైద్య సేవలు బంద్ చేస్తున్నామని అసోసియేషన్ ప్రకటించింది. దీనికి సంబంధించిన లెటర్ కూడా ఈనెల 22నే  ప్రభుత్వానికి ఇచ్చామంటోంది.

AP elections : ఏపీ ఎన్నికలకు కాంగ్రెస్ సూపర్‌ప్లాన్‌..

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్ కి వెయ్యి కోట్లు దాకా జగన్ సర్కార్ చెల్లించాలి. నవంబరులో చర్చలు జరిగినప్పుడు డిసెంబరు నెలాఖరులోగా మొత్తం డబ్బులు ఇచ్చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినా… అవేమీ అమలు కాలేదు. అలాగే 2013 నుంచి ట్రీట్మెంట్ ప్యాకేజీ రేట్లు కూడా పెంచలేదని అంటున్నారు హాస్పిటల్స్ నిర్వాహకులు. పెంపు కోసం అసోసియేషన్‌ తరఫున ప్రభుత్వానికి ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఒక్కో కుటుంబం గతంలో ఏడాదికి 5 లక్షల వరకూ ఆరోగ్యశ్రీ కింద ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. కానీ ఆ పరిమితిని జగన్ ప్రభుత్వం 25 లక్షల రూపాయలకు పెంచింది. ఈ పెంపు నిర్ణయంతో ప్రైవేట్ హాస్పిటట్స్ మరింత ఆర్థిక భారం పడింది. పైగా ఆయుష్మాన్‌ భారత్‌ కింద నిర్ణయించిన ధరలను లెక్కలోకి తీసుకుని ఈమధ్య ప్యాకేజీ ధరలను 10శాతం తగ్గించింది ప్రభుత్వం.  70శాతం ప్యాకేజీ ధరల్లో మార్పు చేయలేదంటున్నారు. మిగిలిన ప్యాకేజీల ధరల పెంపు 2.5 శాతం మేర పెరిగింది. దాని వల్ల తమకు ఆర్థికంగా ఏమీ ప్రయోజనం లేదంటున్నారు నిర్వాహకులు. ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవల నిలిపివేయాలన్న నిర్ణయం ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికో… లేదంటే ఎన్నికల కోసం కాదంటున్నారు.  తమకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడం వల్లే ఈ నెల 29 నుంచి ఆరోగ్యశ్రీ కేసులను చూడకూడదు అని నిర్ణయించామని తెలిపారు. తమ సమస్యలు పరిష్కరించే దాకా నిరసన కొనసాగిస్తామంటున్నాయి ఏపీ ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పిటల్స్.