AP Assembly Meetings : నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నల్ల కండువాతో అసెంబ్లీకి జగన్
నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.
నేడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ సమావేశం జరగనుంది. సమావేశాల నిర్వహణ, చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో స్పష్టత రానుంది. అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, సమావేశాలు ఎన్ని రోజులు కొనసాగించాలనే విషయంపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు. తాజా సమాచార మేరకు ఈనెల 26 వరకు సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు మంగళవారం గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ జరగనుంది.
కాగా అసెంబ్లీ సమావేశాల్లో మూడు శ్వేత పత్రాలను సభ ముందు ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించడంతో సమావేశాలపై ఆసక్తి నెలకొంది. శాంతిభద్రతలు, పరిశ్రమలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను సభ ముందు ఉంచనుంది. మరో వైపు వైసీపీ చీఫ్ జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల కండువాలు ధరించి అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. రాష్ట్రంలో హింస పెరిగిపోయి ప్రజాస్వామ్యం లేకుండా పోయిందని నిరసన తెలిపారు. హత్యా రాజకీయాలపై సభలో చర్చకు పట్టుబడతామని అన్నారు. శాంతి భద్రతల అంశంలో అవసరమైతే గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకుంటామని తెలిపారు.