AP BJP: కన్నా తర్వాత నెక్ట్స్ ఎవరు..? ఏపీ బీజేపీని వెంటాడుతోన్న జంపింగ్ టెన్షన్?
ఏపీ బీజేపీలో జంపింగుల కలకలం కొనసాగుతోంది. కన్నా లక్ష్మినారాయణ పార్టీకి కటీఫ్ చెప్పడంతో ఇంకెంతమంది నేతలు వెళ్లిపోతారోననే భయం ఆ పార్టీకి పట్టుకుంది.
కమలానికి కటీఫ్ చెప్పిన కన్నా లక్ష్మీనారాయణ.. తన దారి తాను చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోము వీర్రాజు కారణంగానే రాజీనామా చేసినట్లు చెప్పిన కన్నా.. కమలానికి పెద్ద కన్నమే వేశారన్న చర్చ నడుస్తోంది. ఐతే ఆయన తర్వాత పార్టీని ఎవరు వీడతారన్న చర్చ… ప్రస్తుతం ఏపీ బీజేపీలో జోరుగా సాగుతుంది. ఏపీ బీజేపీలో ప్రస్తుతం ఉన్న పరిణామాలతో చాలా మంది నేతలు అందులో సర్దుకోలేకపోతున్నారని.. మరికొందరు కూడా కన్నా దారిలోనే నడిచే అవకాశాలు ఉన్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.
ఇన్నాళ్లూ తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉంటుందని భావించి అందులోనే ఇమడలేక, అవస్థలు పడుతూ ఇబ్బందులు పడుతూ కొనసాగుతున్న వారు.. ఇక పార్టీకి గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నారని టాక్. వారి ఆరోపణలన్నీ ప్రధానంగా.. సోము వీర్రాజు, జీవీఎల్, సునీల్ దేవధర్ మీదే వినిపిస్తున్నాయ్. వచ్చే ఎన్నికల్లో పార్టీని విజయం దిశగా తీసుకెళ్లాల్సిన నేతలు… తమ సొంత అజెండాను అమలు చేస్తున్నారని కొందరు నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారని తెలుస్తోంది. ఆ ముగ్గురికే అధినాయకత్వం కూడా పెద్దపీట వేస్తుందని గమనించిన మిగిలి నేతలు.. తట్టాబుట్టా సర్దుకునే ప్రయత్నం చేస్తున్నారు.
2019ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగానే… టీడీపీ అప్పటి రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, సీఎం రమేష్ బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ రాజ్యసభ పదవీ కాలం పూర్తయింది. వారికి బీజేపీ మరోసారి రాజ్యసభ ఇచ్చే అవకాశం కన్పించడం లేదు. పైగా వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కాకుండా విడిగా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో బీజేపీ హైకమాండ్ కూడా ఉంది. ఢిల్లీ స్థాయిలో ఎంత లాబీయింగ్ చేసినా ఫలితం కనిపించడం లేదు. అధినాయకత్వం నుంచి సానుకూలత కూడా లేదు. దీంతో టీజీ వెంకటేష్, సుజనా చౌదరి తిరిగి టీడీపీ గూటిలోకి చేరతారన్న ప్రచారం జరుగుతోంది. సీఎం రమేష్ కు మరికొంత కాలం రాజ్యసభ పదవి ఉండటంతో ఆయన ఇప్పుడిప్పుడే బీజేపీకి రాజీనామా చేరరని అంటున్నారు. ఇవన్నీ ప్రస్తుతం ప్రచారమే అయినా.. రాబోయే రోజుల్లో మాత్రం ఏపీ బీజేపీలో కీలక పరిణామాలు ఖాయంగా కనిపిస్తోంది.