CM Jagan: వై 175… నిజంగా అంత సీనుందా..?

వైనాట్ 175... ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ ఎమ్మెల్యేలు తరచూ వాడే పదం ఇది. నిజంగా అంత సీనుందా....? గంపగుత్తగా అన్ని సీట్లూ వైసీపీ ఖాతాలో పడిపోతాయా..? వైసీపీ సీనియర్ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు...?

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 31, 2023 | 10:29 AMLast Updated on: Aug 31, 2023 | 10:29 AM

Ap Cm Ys Jagan Confidence About 175 Seats What Is The Ipact Report

2019 ఎన్నికల్లో జగన్ సునామీలో వైసీపీ 151 సీట్లు గెలిచింది. తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈసారి అంతకుమించి అంటున్నారు వైసీపీ నేతలు. 175కి 175 కొట్టేస్తాం అంటున్నారు. ఆ దీమా వారి పెదాలపై కనిపిస్తోంది కానీ మాటల్లో కాదు. పైకి కాన్ఫిడెన్స్ ఉన్నా లోపలంతా ఆందోళనే. ప్రస్తుతం తమకు అంత సీన్ లేదని వైసీపీ పెద్దలే అంగీకరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఓ వంద వస్తే గ్రేట్ అంటున్నారు. మరికొందరైతే బొటాబోటీగా బయటపడతామేమో అంటున్నారు. సీఎం జగన్‌కు కూడా ఈసారి కాస్త కష్టమేనని అర్థమైంది. ఎలాగోలా గెలుస్తామని మాత్రమే ఆయన భావిస్తున్నారు. ఐప్యాక్ కూడా గ్రౌండ్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు సీఎం ముందు ఉంచుతోంది. ఆయన అంచనా ప్రకారం వందకు ఓ రెండు అటూ ఇటుగా ఉండొచ్చు.

గత రెండేళ్లుగా ఏపీలో ప్రజావ్యతిరేకత పెరిగిపోతోంది. అభివృద్ధి మాటలకే పరిమితమైంది. ఏపీ ప్రభుత్వం కేవలం బటన్ నొక్కడానికే పరిమితమవుతోంది. ఆ బటన్ నొక్కుడే ఎన్నికల్లో తమకు ఓట్లు కురిపిస్తుందన్నది ప్రభుత్వ ఆలోచన. నిజానికి డబ్బు పంచడం వైసీపీకి ప్లస్సే. సామాజిక పెన్షన్లు ప్రభుత్వానికి మంచిపేరు తెచ్చాయి. ప్రతినెలా మొదటిరోజు తెల్లవారక ముందే వాలంటీర్లు ఇంటింటికీ తిరిగి పెన్షన్లు పంచుతున్నారు. ఈ పథకం ప్రభుత్వానికి ఓట్లు కురిపించేదే. కానీ మిగిలినవి మాత్రం కాస్త డౌట్‌గానే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రోడ్లను గాలికి వదిలేశారు. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. ఉన్నవి పోతున్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు డబ్బు పంచుడు ప్రభావం వ్యవసాయంపై తీవ్రంగానే పడింది. రైతుకు కూలీలు దొరకడం లేదు. దొరికినా భారీగీ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఖర్చు తడిసి మోపెడవడంతో రైతు వ్యవసాయాన్ని వదిలేయాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు ఉద్యోగులు కూడా ప్రభుత్వ తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. టీచర్లు అయితే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి అమ్ముడుపోయి తమ ప్రయోజనాలకు గండి కొట్టారన్న ఆవేదన వారిలో ఉంది. మరి ఇవన్నీ ప్రభుత్వానికి ఇబ్బందికర అంశాలే. ఎమ్మెల్యేల్లో అవినీతి పెరిగిపోయింది. దానికి తోడు గ్రామస్థాయిలో వైసీపీ నేతల ఆగడాలు పెరిగిపోయాయి. ప్రజలు భయపడొచ్చు కానీ సమయం వచ్చినప్పుడు తమ వ్యతిరేకతను ఓటు రూపంలో చాటతారు.

ప్రభుత్వానికి అనుకూల అంశాలు ఎన్నున్నాయో వ్యతిరేక అంశాలు అంతకంటే ఎక్కువ కనిపిస్తున్నాయి. గతంలో ప్రతిపక్షంలో ఉండటంతో హామీలు ఇచ్చుకుంటూ పోయారు. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు. టీడీపీపై విమర్శలు గుప్పించుకుంటూ పోతే ఉపయోగం ఉండదు. తానూ కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఇన్నీ మైనస్‌‌లు పెట్టుకుని అన్ని సీట్లు గెలిచేస్తామంటే ఎవరు నమ్ముతారన్నదే ప్రశ్న. గతంలో కంటే టీడీపీ ఎంతో కొంత పుంజుకుంది. గతంలో చంద్రబాబు ఉనికిని కూడా సహించని బీజేపీ పెద్దలు ఇప్పుడు బాబువైపు చూస్తున్నారంటే కారణం అదే. పైగా జనసేన కూడా కలిస్తే టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా చేయవచ్చు. ఇలాంటి సమయంలో వైనాట్ 175కేవలం నినాదమే కానీ వాస్తవం కాదని స్పష్టంగా అర్థమవుతోంది. కొంతమంది కనీసం వంద సీట్లు వస్తాయంటుంటే మరికొంతమంది అయితే ఏకంగా అదికూడా డౌటే అంటున్నారు. చివరి నిమిషంలో పంచే డబ్బు, దొంగఓట్లు కొంతమేర కాపాడొచ్చని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తంగా చూస్తే వందతో బయటపడతామన్నది ప్రస్తుతానికి వైసీపీ పెద్దల భావన. రానున్న రోజుల్లో అది ఎలా మారుతుందో చూడాలి మరి