అవమానించి క్షమాపణలా ? ఆసీస్ బోర్డుపై ఫాన్స్ ఫైర్

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వివాదంతో ముగిసింది. మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలతో సిరీస్ హీటెక్కితే, ట్రోఫీ ఇచ్చే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేసింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 8, 2025 | 07:48 PMLast Updated on: Jan 08, 2025 | 7:48 PM

Apologize For Insulting Fans Fire At Aussie Board

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వివాదంతో ముగిసింది. మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలతో సిరీస్ హీటెక్కితే, ట్రోఫీ ఇచ్చే విషయంలో క్రికెట్ ఆస్ట్రేలియా భారీ తప్పిదం చేసింది. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సునీల్ గవాస్కర్ కూడా చాలా బాధపడ్డాడు. తప్పు తెలుసుకున్న క్రికెట్ ఆస్ట్రేలియా చివరికి క్షమాపణలతో వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది.అయితే ట్రోఫీని బహుకరించే విషయంలో సునీల్ గవాస్కర్ ని పక్కనపెట్టి అలెన్ బోర్డర్ చేతుల మీదుగా ట్రోఫీని విజేతలకు అందించారు. భారత్‌, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ లను 1996-97 నుంచి బోర్డర్‌-గవాస్కర్‌ ట్రోఫీగా పిలుస్తున్నారు.

సంప్రదాయం ప్రకారం ఎవరు విజేత అయినా.. సిరీస్ ముగిసిన తర్వాత భారత లెజెండరీ ప్లేయర్ సునీల్ గవాస్కర్, ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు అలెన్ బోర్డర్ చేతుల మీదుగా విజేతలకు ట్రోఫీని అందజేస్తారు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా ఈసారి తప్పు చేసింది. అక్కడ గవాస్కర్ ఉన్నప్పటికీ, అతన్ని ట్రోఫీ ప్రజెంటేషన్ కి ఆహ్వానించలేదు. దీనిపై గవాస్కర్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రోఫీ ప్రెజెంటేషన్‌కు పిలవకపోవడం పట్ల తన నిరాశను వ్యక్తం చేస్తూ ఇది బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ, కప్ అందించే సమయంలో ఇద్దరం ఉండాలని, అయితే తాను భారతీయుడిని కాబట్టి ఆహ్వానించలేదంటూ తన బాధను వ్యక్తం చేశాడు. తనకు ఆహ్వానం లేకపోవడం నిరుత్సాహానికి గురి చేసిందని వ్యాఖ్యానించాడు. కాగా ఆసీస్ కెప్టెన్ కు ట్రోఫీని ఇస్తున్న సమయంలో మైదానంలోనే గవాస్కర్ వ్యాఖ్యానం చేస్తూ ఉన్నప్పటకీ నిర్వాహకులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారితీసింది.

అయితే తాజాగా ఈ వివాదంపై క్రికెట్ ఆస్ట్రేలియా స్పందించింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్ ప్రజెంటేషన్ విషయంలో సునీల్ గవాస్కర్‌ను పిలవకపోవడంపై క్షమాపణలు చెప్పి, సమస్యను శాంతింపజేసే ప్రయత్నం చేసింది. క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధి మాట్లాడుతూ.. వేదికపై అలెన్ బోర్డర్ మరియు సునీల్ గవాస్కర్ ఇద్దరూ కలిసి ఉంటే బాగుండేదని సన్నాయి నొక్కులు నొక్కింది. అయితే ఇది క్షమాపణలు చెప్పినట్టుగా లేదని, తమ తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మాత్రమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.