The Kerala Story: అక్కడ ‘ది కేరళ స్టోరీ’ బ్యాన్‌! ఈ బుజ్జగింపు రాజకీయాలు ఇంకెన్నాళ్లు మేడమ్‌!

'ది కేరళ స్టోరీ' సినిమాపై వివాదం అంతకంతకూ ముదురుతోంది..! ఈ సినిమా విషయంలో సమాజం, రాజకీయ పార్టీలు రెండుగా చీలిపోయాయి. ఈ సినిమాను నిషేధించాలని ఓ వర్గం మద్దతుదారులు వాదిస్తుండగా.. పశ్చిమబెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఓ అడుగు ముందుకేశారు. 'ది కేరళ స్టోరీ' సినిమాను తమ రాష్ట్రంలో నిషేధించినట్లు ప్రకటించారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 8, 2023 | 07:27 PMLast Updated on: May 08, 2023 | 7:27 PM

Appeasement Politics By West Bengal Cm Mamata As She Banned The Kerala Story Movie Which Leads To Criticism On Her

2014లో వచ్చిన ‘పీకే(PK)’ మూవీ గుర్తుంది కదా. అమీర్ ఖాన్, అనుష్క శ‌ర్మ‌, రామ్ కుమార్ హిరాణి కాంబినేష‌న్‌లో వచ్చిన పీకే చిత్రం బాక్సాఫిస్‌ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఏకంగా 600కు పైగా కోట్లను కలెక్ట్ చేసింది. ఆఖరికి చైనాలో కూడా వందకు పైగా కోట్లను కొల్లగొట్టిన మూవీ అది. అయితే ‘పీకే’ మూవీ ఓ వర్గం మనోభావాలను దెబ్బతీసిందని.. హిందూ సంఘాలు ఈ సినిమాను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించాయి. నిషేధించాలంటూ డిమాండ్‌ కూడా చేశాయి. అయితే దీనికి సామాన్య ప్రజల నుంచి ఎలాంటి మద్దతూ లభించలేదు. ఓవైపు వివాదాలు కొనసాగుతుండగానే..మరోవైపు సినిమా ఘన విజయాన్ని అందుకుంది. ఇక బాలీవుడ్‌లో హిట్టయిన ‘ఓ మై గాడ్‌’కి రిమేక్‌గా మన తెలుగులో రిలీజైన్ పవర్‌ స్టార్‌ సినిమా ‘గోపాల గోపాల’ని కూడా వీహెచ్‌పీ లాంటి సంస్థలు వ్యతిరేకించాయి. అయినా సినిమాను ఆపలేకపోయాయి. నిషేధించాలని ర్యాలీలు చేసినా ఏం లాభం లేకపోయింది.

ఇలా మతం మనోభావాల పేరిట సినిమాని నిషేధించాలని సంబంధిత సంస్థల డిమాండ్‌ చేయడం పాత విషయమే. నిజానికి ఈ తరహా సినిమలు ఏమైనా వస్తున్నాయంటే చాలు.. టైటిల్‌ దగ్గర్నుంచే వివాదాలు మొదలవుతుంటాయి. అయితే ఒక సినిమాను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(CBFC) ఆమోదించిన తర్వాత ఆ సినిమా రిలీజ్‌ అవ్వడం పక్కా. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఫిర్యాదు చేయాలి కానీ.. బ్యాన్‌ చేయడమన్నది కరెక్ట్ కాదన్నది విశ్లేషకులు మాట. ఇక తాజాగా రిలీజైన ‘ది కేరళ స్టోరీ’ సినిమా పలు వివాదాలను సృష్టించింది. ఈ సినిమా ముస్లింలకు వ్యతిరేకంగా తప్పుడు సమాచారంతో తీశారని.. సినిమా స్టోరీ పచ్చి అబద్ధమంటూ పలు వర్గాలు వాదిస్తున్నాయి. ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకంటే CBFC అనుమతి పొందిన సినిమాను రిలీజ్‌ చేయడం నిర్మాతల హక్కు.. అలానే తమ వర్గాన్ని తప్పుగా చూపించారని బయటకు చెప్పడం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా హక్కు. కానీ ఇంతలోనే ఓట్ల కక్కుర్తి కలిగిన రాజకీయ నాయకులు ఈ వివాదంలో దూరారు. ఓవైపు బీజేపీ సినిమాను ప్రమోట్ చేస్తుండగా.. యాంటీ-బీజేపీ పార్టీలు సినిమాను ఏకంగా నిషేధించే పనిలో పడ్డాయి.

బుజ్జగింపు బుద్ధి బయటపెట్టుకున్న దీదీ:
‘ది కేరళ స్టోరీ’ సినిమాను ప‌శ్చిమ బెంగాల్ ప్ర‌భుత్వం నిషేధించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌తల ప‌ర్య‌వేక్ష‌ణ‌, హింస ప్ర‌జ్వ‌రిల్ల‌కుండా ఉండేందుకు ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ప్ర‌క‌టించారు. అటు త‌మిళ‌నాడులోనూ ఈ మూవీ స్క్రీనింగ్‌ను స్టాలిన్ సర్కార్‌ నిలిపివేసింది. ఇక ఈ సినిమాకు మెయిన్ ప్లాట్‌ అయిన కేరళలోనూ ఈ చిత్రం ఆడడంలేదు. అయితే అధికారికంగా సినిమాపై నిషేధం విధించింది దీదీ మాత్రమే. ముస్లింలు ఎక్కువగా ఉండే కేరళలోనూ ఈ సినిమాను అధికారికంగా నిషేధించలేదు.. అలాంటిది మమత ఈ నిర్ణయం తీసుకోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి. కేవలం ముస్లిం ఓట్ల కోసమే.. మైనరిటీ బుజ్జగింపు రాజకీయాలకు దీదీ మరోసారి తెరలేపారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

దీదీకి కొత్తేమీ కాదు:
సెన్సర్‌ బోర్డు అనుమతి పొందిన సినిమాను శాంతిభ‌ద్ర‌తల సాకుతో మమత నిషేధించారు. అన్నిటికంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. ఈ సినిమాను బ్యాన్‌ చేయాలని పిటిషినర్లు సుప్రీంకోర్టు తలుపు తడితే.. దేశ అత్యున్నత న్యాయస్థానం దాన్ని తిరస్కరించింది. కానీ మమతది మాత్రం సపరేటూ రాజ్యాంగం కదా.. అందుకే సినిమాలు విడుదల చేసుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకుందంటూ ప్రత్యర్థి పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను దీదీ తుంగలో తొక్కారని మండిపడుతున్నారు విపక్ష నేతలు. అసలు కేరళ ప్రభుత్వానికే లేని బ్యాన్‌ బుద్ధి..దీదీకి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇంకెంత కాలం ఈ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడతారని ఫైర్ అవుతున్నారు. ‘ది కేరళ స్టోరీ’ సినిమాను బ్యాన్ చేసినట్లే ఆర్‌ఎస్‌ఎస్‌, వీహెచ్‌పీ లాంటి సంస్థలు ఏదైనా మూవీని బ్యాన్‌ చేయమంటే అప్పుడు కూడా చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా మతం పేరిట రాజకీయాలు చేయడం మానాలని కోరుతున్నారు.