Apple Lays Off: ఉద్యోగులకు షాకిచ్చిన యాపిల్.. భారీగా ఎంప్లాయిస్ తొలగింపు
కోవిడ్ పాండెమిక్ తర్వాత యాపిల్ ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటిసారి. అనేక కంపెనీలు గతంలో వేల సంఖ్యలో ఎంప్లాయిస్‌ను తీసేసినా.. యాపిల్ మాత్రం ఇప్పటివరకు పెద్దగా తొలగించలేదు.
Apple Lays Off: టాప్ టెక్ కంపెనీ యాపిల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఒకేసారి ఏకంగా 614 మంది ఉద్యోగుల్ని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై గత నెల 28న ఉద్యోగులకు సమాచారం అందించింది. అయితే, ఉద్యోగుల తొలగింపు వెంటనే అమల్లోకి రావడం లేదు. ఈ లే ఆఫ్స్ మే 27 నుంచి అమల్లోకి వస్తాయని యాపిల్ తెలిపింది. అప్పటివరకు ఉద్యోగులు కంపెనీలో పని చేయొచ్చు. ఇతర కంపెనీల్లోకి మారేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగుల తొలగింపు కాలిఫోర్నియాలోని 8 కార్యాలయాల్లో జరిగింది.
IPL 2024 : ఉప్పల్ స్టేడియంలో SRH vs CSK క్రికెట్ అభిమానుల సందడి… చూద్దాం రండి..
దీనికి సంబంధించి ఎంప్లాయిమెంట్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌కు సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని తెలిపింది. ఏ విభాగాల్లో ఉద్యోగుల్ని తొలగించారో మాత్రం వెల్లడించలేదు. కానీ, కార్ల తయారీ, స్మార్ట్‌వాచ్ తయారీ విభాగాల్లోంచే ఉద్యోగుల్ని తొలగించినట్లు సమాచారం. అయితే, కోవిడ్ పాండెమిక్ తర్వాత యాపిల్ ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటిసారి. అనేక కంపెనీలు గతంలో వేల సంఖ్యలో ఎంప్లాయిస్‌ను తీసేసినా.. యాపిల్ మాత్రం ఇప్పటివరకు పెద్దగా తొలగించలేదు. గత రెండేళ్లుగా ఐటీ, టెక్ కంపెనీల్లో లక్షల సంఖ్యలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఖర్చులు తగ్గించుకోవడానికి కంపెనీలు భారీ స్థాయిలో లే ఆఫ్స్ కొనసాగిస్తున్నాయి. కరోనా సమయంలో కంపెనీలు భారీగా ఎంప్లాయిస్‌ను రిక్రూట్ చేసుకున్నాయి. అయితే, అనంతరం అనేక ఆర్థిక సంక్షోభాలు, వ్యాపారాలు మందగించడం, లాభాలు తగ్గడం వంటి కారణాల వల్ల పలు సంస్థలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి టాప్ కంపెనీలు కూడా ఉద్యోగుల్ని తొలగించాయి.
ఇటీవల వీడియో గేమ్స్ మేకింగ్ కంపెనీ ‘ఎలక్ట్రానిక్స్ ఆర్ట్స్’ సుమారు 5 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. సోషల్ మీడియా కంపెనీ స్నాప్ కూడా 10 శాతం మంది ఉద్యోగులను తొలగించబోతుంది. తాజాగా అమెజాన్ కంపెనీ తన క్లౌడ్ కంప్యూటింగ్ బిజినెస్ ‘ఏడబ్ల్యూఎస్’ నుంచి చాలా మంది ఉద్యోగులను తొలగించింది. సోనీ కంపెనీ తమ ప్లేస్టేషన్ డివిజన్లోని 900 మంది ఉద్యోగులను, సిస్కో సిస్టమ్స్ సంస్థ 4000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నాయి. ఇండియాలోనూ కంపెనీలు భారీగా ఉద్యోగుల్ని తొలగించాయి. ఇండియాలో దాదాపు 55 వేల మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు సమాచారం. విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్ లాంటి దిగ్గజ ఐటీ కంపెనీలు కొత్త వాళ్లను రిక్రూట్ చేసుకోవడం తగ్గించాయి.