CM kcr: కమలం పార్టీపై కేసీఆర్ మౌనం.. బీజేపీ, బీఆర్ఎస్ ఒప్పందం నిజమేనా ?
కారణం ఏదైనా వరుస పెట్టి జిల్లాల్లో పర్యటిస్తున్నారు కేసీఆర్. అబ్జర్వ్ చేశారో లేదో కానీ.. ఆయన మాటలు కాంగ్రెస్ టార్గెట్‌గానే పేలుతున్నాయ్ ఈ మధ్య. బీజేపీని బంగాళాఖాతంలో కలిపేద్దామని అప్పట్లో నిప్పులు రాజేసిన కేసీఆర్.. ఆ తర్వాత కూడా కమలం పార్టీని టార్గెట్ చేశారు. ఘాటు కామెంట్లు చేశారు.
కట్ చేస్తే ఇప్పుడు కాంగ్రెస్‌ను టార్గెట్ చేసుకుంటున్నారు. ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. ఇప్పటివరకు బీజేపీని తిట్టి.. ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముందు కాంగ్రెస్‌ను కేసీఆర్ ఎందుకు టార్గెట్ చేస్తున్నారా అనే విషయం రాజకీయవర్గాలను కన్ఫ్యూజ్‌లో పడేస్తోంది. జిల్లాల్లో బహిరంగసభల్లో పాల్గొంటున్న కేసీఆర్.. కాంగ్రెస్ ఏకిపారేస్తున్నారే తప్ప.. కమలం పార్టీని ఒక్క మాట కూడా అనడం లేదు. ఇదే ఇప్పుడు కొత్త చర్చకు కారణం అవుతోంది. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఒప్పందం ఉందని.. రాష్ట్రంలో ఆ రెండు పార్టీలన్నీ డ్రామాలే అని కాంగ్రెస్ ఎప్పటినుంచో ఆరోపణలు గుప్పిస్తోంది.
ఐతే ఇప్పుడు కేసీఆర్ తీరుతో ఈ చర్చ జనాల్లోనూ మొదలైంది. ఐతే బీజేపీని పట్టించుకోకుండా.. కేవలం కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం వెనక కేసీఆర్ వ్యూహం వేరే ఉందని మరో వర్గం అంటోంది. దీనికి కారణం కర్ణాటక ఫలితాలే అని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు పెద్దగా సీట్లు లేకపోయినా.. తెలంగాణలో హస్తం పార్టీ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. క్షేత్రస్థాయిలో సూపర్ కేడర్ ఉంది. అలర్ట్ చేసే నాయకుడు లేకపోవడం వల్ల ఇన్నాళ్లు కాంగ్రెస్ వైఫల్యాల్లో ఉంది. ఒక్కసారి అంతా యాక్టివ్ అయితే.. హస్తం పార్టీని తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ విషయం కేసీఆర్‌కు కూడా తెలుసు. అందుకే ఎన్నికలకు ముందు.. కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.
కర్ణాటక విజయం తర్వాత.. హస్తం పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇదే దూకుడుతో తెలంగాణలోనూ అధికారం దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది. కర్ణాటక ఫలితం ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుంది. అందుకే కన్నడనాట గెలిచి ఇక్కడ ఉత్సాహం మీద కనిపిస్తున్న కాంగ్రెస్‌ను.. కేసీఆర్ టార్గెట్ చేశారు. దానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. కర్ణాటక ఫలితం బీజేపీ దూకుడుకు బ్రేకులు వేసింది. పైగా ఆ పార్టీలో నేతలు దిక్కులు చూస్తున్నారు. ఒకరకమైన నైరాశ్యంలో మునిగిపోయింది ఆ పార్టీ. ఇలాంటి సమయంలో బీజేపీ కంటే.. ముందు కాంగ్రెస్ మీద వ్యూహాలు అమలు చేయడం ఉత్తమం అని కేసీఆర్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. అందుకే కమలాన్ని పక్కనపెట్టి కాంగ్రెస్ మీద మాటల యుద్ధం మొదలుపెట్టారా అనిపిస్తోంది సీన్ చూస్తుంటే..