AP Politicians: సహనం కోల్పోతున్న నాయకుల వల్లే.. ఏపీలో బూతు రాజకీయం నడుస్తుందా..?

బూతులు తిట్టుకోవడం, హద్దులు మీరి మాట్లాడటం, ఒకరినొకరు గేలి చేసుకోవడం ఇదే రాజకీయమా.? అడ్డగోలుగా మాట్లాడేవారికి అవతల పార్టీ నేతలను నీచాతినీచంగా తిట్టేవారికి అన్ని పార్టీల్లోనూ డిమాండ్ పెరిగిపోతోంది. నోరేసుకుని ఎగబడిపోవడమే క్వాలిఫికేషన్. బాగా తిట్టడం వస్తే చాలు రాజకీయం తెలిసినట్లే. ఈ ఫార్ములా మీదే ఇప్పుడు చాలా మంది నేతలు బతికేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: August 14, 2023 | 08:00 AMLast Updated on: Aug 14, 2023 | 8:00 AM

Are The Leaders Of All The Parties Losing Patience In Ap And Are Running Bogus Politics

బూతులు తిట్టుకోవడం, హద్దులు మీరి మాట్లాడటం, ఒకరినొకరు గేలి చేసుకోవడం ఇదే రాజకీయమా.? అడ్డగోలుగా మాట్లాడేవారికి అవతల పార్టీ నేతలను నీచాతినీచంగా తిట్టేవారికి అన్ని పార్టీల్లోనూ డిమాండ్ పెరిగిపోతోంది. నోరేసుకుని ఎగబడిపోవడమే క్వాలిఫికేషన్. బాగా తిట్టడం వస్తే చాలు రాజకీయం తెలిసినట్లే. ఈ ఫార్ములా మీదే ఇప్పుడు చాలా మంది నేతలు బతికేస్తున్నారు. ఉచితానుచితాలు, కనీస విలువలు ఇవేమీ అవసరం లేదు. వాళ్లు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేం వారిని తిట్టాలి. వాళ్లు రెండు బూతులు తిడితే మేం ఇంకాస్త మసాలా వేసి నాలుగు తిట్లు తిట్టాలి. ఇదీ ఇప్పుడు చాలామంది లీడర్ల రెగ్యులర్ ఫార్ములా. దీనివల్లే రాజకీయాలంటే జనంలో అసహ్యం, రోత ఓ రకంగా లోకువ కూడా అయిపోయింది.

లీడర్లంటే సమాజంలో గౌరవం లేకుండా పోయింది. అందరిదీ అదే దారి. ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. మనం ఒకమాట అన్న తర్వాత దాని పర్యవసానాలు ఆలోచించాలనేదే లేదు. మనం అనే మాట సంఘంలో మన స్థాయిని ఎలా నిర్ణయిస్తుంది అనేది ఆలోచించకుండానే నేతలు తిట్ల వర్షం కురిపిస్తున్నారు. దీనికి ఒకపార్టీ అనే లిమిట్ ఏమీ లేదు. అన్ని పార్టీలదీ ఇదే దారి. పవన్ కళ్యాణ్ లాంటి మృదుస్వభావి, బ్యాలెన్స్‌డ్‌గా ఉండే వ్యక్తి కూడా నోరుజారిపోతున్నారు. ఒక్కోసారి ఆయన ఆవేశానికి హద్దు ఉండదు. రోజా, అంబటి, కొడాలి వంటి వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. వాళ్లు ప్రెస్‌మీట్‌ పెట్టారంటే ఖచ్చితంగా పరుష పదజాలం ఉండాల్సిందే. ఇలా ఎందుకు అంటే వారు మమ్మల్ని తిట్టారు కాబట్టి మేం వాళ్లని తిట్టాలి అంటారు.

చివరకు చంద్రబాబు కూడా సహనం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇది రోజురోజుకు శృతిమించిపోతోంది. ఇదే కొనసాగితే నెక్స్ట్ జనరేషన్ బూతులు మాట్లాడుకోవడమే రాజకీయం అనుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ రోజు ఒక నేత అన్నదాన్ని, విమర్శను తిప్పికొట్టడానికి సహనం కోల్పోయి ఎలాగైనా మాట్లాడొచ్చు.. కానీ అవి తమ పార్టీ విలువలను దిగజారుస్తున్నాయని, వ్యక్తిగతంగానూ తమ స్థాయిని దిగజారుస్తున్నాయని ఈ నేతలు ఎందుకు అనుకోవడం లేదు.?

ఒక లీడర్ ప్రెస్‌మీట్‌ పెడతారని తెలిసి ఇప్పుడు కొత్త కొత్త బూతులు వినిపిస్తాయని భావిస్తున్నారంటే జనానికి నాయకులపై ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తుంది.. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు ఎన్నికల నాటికి ఇంకా దారుణంగా ఉంటుంది. వ్యక్తిగత విషయాలు, కుటుంబ వ్యవహారాలు, బయట చర్చించలేని అంశాలు ఇవేమీ నేతలకు అడ్డురావడం లేదు. ఎవరు ఏమైనా అనేయవచ్చు. కనీస సంస్కారం కూడా ఉండటం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే రేపు ఎన్నికల్లో ఇంకెంత దారుణంగా మారుతుందో ఆలోచించండి. ఇప్పటికైనా సహనం, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడితే అది వ్యక్తులుగాను, ఆ పార్టీకి కూడా గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఒకటికి నాలుగు తిడితే మరొకరు నాలుగుకు పదహారు తిడతారు.. దీనికి అడ్డుకట్ట అంటూ ఉండదు. అందుకే ఎవరికి వారు ఆలోచించుకుని సంభాళించుకోవాల్సిన అవసరం ఉంది