చెన్నై జట్టులో వారు అవసరమా ? కోచ్ ను ఏకేపారేస్తున్న ఫ్యాన్స్
ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. రుతరాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ధోనీ కోల్ కత్తా నైట్ రైడర్స్ పై తన మ్యాజిక్ చూపించలేకపోయాడు.

ఐపీఎల్ 2025 సీజన్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ షో కంటిన్యూ అవుతోంది. రుతరాజ్ గైక్వాడ్ గాయంతో తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న ధోనీ కోల్ కత్తా నైట్ రైడర్స్ పై తన మ్యాజిక్ చూపించలేకపోయాడు. మరీ దారణంగా 103 పరుగులకే చెన్నై పరిమితమై ఘోరపరాభవాన్ని మూటగట్టుకుంది. అది కూడా తమకు తిరుగులేని రికార్డున్న చెపాక్ స్టేడియంలో చెన్నై ఇటువంటి స్కోర్ చేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. నిజానికి ఈ సీజన్ లో చెపాక్ స్టేడియంలోనే చెన్నై వరుసగా మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. కాగా సీఎస్కే వైఫల్యాలకు కోచ్ ఫ్లెమింగే కారణమంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జట్టులో పేలవంగా ఆడుతున్న పలువురు ఆటగాళ్ళ కొనసాగిస్తున్నాడంటూ అతన్ని ఏకిపారేస్తున్నారు. రిజర్వ్ బెంచ్ లో పలువురు యువ ఆటగాళ్ళున్నా కూడా అవకాశాలివ్వడం లేదంటూ ఫైర్ అవుతున్నారు.
తన సొంత జట్టు ఆటగాళ్లనే ఓ కోచ్ కొనుగోలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్ లోనూ రవిచంద్రన్ అశ్విన్ గతంలో ఫ్లెమింగ్ పై పరోక్షంగా విమర్శలు చేశాడు. ఇప్పుడా విషయాన్ని ఫ్యాన్స్ మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. వాళ్లు సరైన ప్రదర్శన చేయనప్పటికీ.. జట్టులోకి తీసుకోవడం వల్ల సీఎస్కే జట్టు ఓటమి చెందుతోందని ఇప్పుడు క్రికెట్ అభిమానుల వాదన. ముఖ్యంగా అప్పటివరకు ఫామ్ లో కనిపించిన రచిన్ రవీంద్ర.. ఐపీఎల్ మ్యాచుల్లో తేలిపోయాడు. అతడు కేవలం రెండు మ్యాచుల్లోనే మంచి ప్రదర్శన చేశాడు. అతడు ఆల్ రౌండర్ అయినప్పటికీ సింగిల్ బాల్ కూడా వేయలేదు. ఇలాంటి సమయంలో సీఎస్కే.. అతడిని పక్కన పెట్టకుండా కొనసాగించింది. దీనికి కారణం కోచ్ ఫ్లెమింగే నని ఫ్యాన్స్ అంటున్నారు.
రాహుల్ త్రిపాఠిని కూడా జట్టు నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవాళీ క్రికెట్ లో అతడు పెద్దగా పరుగులు చేయలేకున్నా..అతన్ని సీఎస్కే వేలంలో కొనుగోలు చేసింది.. ఈ సీజన్ లో అతడి బ్యాటింగ్ అత్యంత దారుణంగా ఉంది. అయినా కూడా త్రిపాఠీని ఎందుకు ఆడిస్తారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇక దీపక్ హుడా మంచి ఆల్ రౌండర్ అయినప్పటికీ.. పేలవ ప్రదర్శన చేస్తున్నాడు. రాబిన్ ఉతప్ప, రహానె తరహాలో ఆడుతాడనుకుంటే చేతులెత్తేస్తున్నాడు. అయినప్పటికీ సీఎస్కే అతడిని కొనసాగిస్తోంది. తాజాగా కేకేఆర్ తో జరిగిన మ్యాచులోనూ ఇంపాక్ ప్లేయర్ గా బరిలోకి దింపింది. కానీ అతడు నాలుగు బంతులాడి డకౌట్ అయ్యాడు. వీరందరి విషయంలోనూ సీఎస్కే మేనేజ్ మెంట్ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.
ఇక ఎన్నో ఏళ్లుగా కోచ్ గా వ్యవహరిస్తున్న కోచ్ ఫ్లెమింగ్ కూడా తన వ్యూహాల్లో మార్పులు చేయాల్సిన టైమ్ వచ్చిందంటున్నారు. ఇప్పుడు అతడి నిర్ణయాలు పాతబడిపోయాయని, జట్టుకు మార్పులు అవసరమని ఫ్యాన్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ సీజన్ లో చెన్నై గెలుపు బాట పట్టాలంటే భారీ మార్పులు చేయాల్సిందేనని చెబుతున్నారు. షేక్ రషీద్ సహా ఇతర యువ ఆటగాళ్లకు ప్లేయింగ్ 11లో చోటు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఈ తరహా నిర్ణయాలు తీసుకోకుంటే మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ కథ ముగిసినట్టేనని అభిప్రాయపడుతున్నారు.