ఇంత భయపడుతున్నారేంట్రా ? కంగారూలకు జైశ్వాల్ టెన్షన్
భారత్ తో టెస్ట్ సిరీస్ అంటే చాలు కంగారూలకు కంగారు పుడుతోంది. గత రెండేళ్ళుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఈ సారి ఎలాగైనా భారత్ ను నిలువరించాలని పట్టుదలగా ఉంది.
భారత్ తో టెస్ట్ సిరీస్ అంటే చాలు కంగారూలకు కంగారు పుడుతోంది. గత రెండేళ్ళుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పరాజయం పాలైన ఆస్ట్రేలియా ఈ సారి ఎలాగైనా భారత్ ను నిలువరించాలని పట్టుదలగా ఉంది. ఫామ్ లో ఉన్న టీమిండియాను ఓడించడం అంత సులభం కాదనేది కంగారూలకు తెలుసు. అందుకే ఎప్పటిలానే మైండ్ గేమ్ ను నమ్ముకుంది. సిరీస్ కు ముందే మాటల యుద్ధం మొదలుపెట్టింది. ముఖ్యంగా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ను చూస్తే ఆసీస్ కు వణుకు పుడుతోంది. టెస్టుల్లో జైశ్వాల్ సూపర్ ఫామ్ తో అదరగొడుతున్నాడు. ఈ సీజన్ లో ఇప్పటికే 1028 పరుగులతో రెండో టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న యశస్వి జైశ్వాల్ తొమ్మిది టెస్ట్ మ్యాచ్‌ల్లో 68.53 సగటుతో రెండు డబుల్ సెంచరీలు కూడా సాధించాడు.
జైశ్వాల్ తో తమకు తిప్పలు తప్పవని ముందుగానే అర్థం చేసుకున్న ఆసీస్ క్రికెటర్లు మాటలతో అతన్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాథ్యూ హేడెన్, నాథన్ లియాన్ ఇప్పటికే జైశ్వాల్ ను ప్రశంసిస్తూనే అక్కడి పిచ్‌లపై ఆడడం అంత ఈజీ కాదంటూ హెచ్చరిస్తున్నారు. ఒకవిధంగా అతని కాన్ఫిడెన్స్ తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియా మాజీ హెడ్ కోచ్ జాన్ బుకానన్ కూడా ఈ జాబితాలో చేరాడు. జైశ్వాల్ బౌన్సీ పిచ్ లపై ఆడలేడంటూ వ్యాఖ్యానించాడు. అయితే అక్కడి పరిస్థితులకు త్వరగా అలవాటు పడితే జైశ్వాల్ ను ఆసీస్ బౌలర్లు ఆపలేరని భారత్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు.