Revanth Reddy: “సెంటిమెంట్”తో కొట్టడానికి రెడీ అవుతున్న కాంగ్రెస్..!!
రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినా.. 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్ లో కేసీఆర్ పార్టీకి ఓట్లు పడటానికి "తెలంగాణ సెంటిమెంట్" బాగా హెల్ప్ చేసిందనేది క్లియర్ కట్ అంశం. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అది వర్క్ అవుట్ కాదని.. తమకు మాత్రమే పనికొస్తుందనే ఒపీనియన్ తో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట.
తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల కోసం వ్యూహాలను రెడీ చేస్తోంది. ఓటర్ల మనసులు ఇట్టే గెలుచుకోగల ఒక పవర్ ఫుల్ ప్రచార అస్త్రాన్ని సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే.. “తెలంగాణ సెంటిమెంట్” !! గత రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ అస్త్రం కేసీఆర్‌కు బాగా కలిసొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినా.. 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్ లో కేసీఆర్ పార్టీకి ఓట్లు పడటానికి “తెలంగాణ సెంటిమెంట్” బాగా హెల్ప్ చేసిందనేది క్లియర్ కట్ అంశం. ఈసారి బీఆర్ఎస్ పార్టీకి అది వర్క్ అవుట్ కాదని.. తమకు మాత్రమే పనికొస్తుందనే ఒపీనియన్ తో కాంగ్రెస్ పెద్దలు ఉన్నారట. వచ్చే నెల (సెప్టెంబర్) 17న తెలంగాణలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఆ కార్యక్రమం వేదికగా.. “ప్లీజ్.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి” అని సోనియాగాంధీతో చెప్పించడం ద్వారా సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగించాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజలను ఆకట్టుకునే ఉచిత హామీల మేళవింపుగా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను కూడా ఆ సభలోనే సోనియాగాంధీ రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలను ప్రారంభిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
వ్యూహ రచన కోసం పిలుపు..
ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఊహించని రీతిలో సీట్లు వచ్చాయి. అక్కడ బీజేపీపై భారీ విజయాన్ని కాంగ్రెస్ మూటకట్టుకుంది. ఆ ప్రభావంతో తెలంగాణ కాంగ్రెస్ కు మునుపెన్నడూ లేనంత జోష్ వచ్చింది. ఈ అనుకూల పరిస్థితుల మధ్య కూడా గెలువకుంటే కాంగ్రెస్ సంగతి ఇక అంతే సంగతులని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వచ్చే ఎన్నికల కోసం కాంగ్రెస్ సర్వ శక్తులు ఒడ్డుతోంది. అందుకే అటు బీఆర్ఎస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి నాయకుల చేరికలకు ప్రాముఖ్యత ఇస్తోంది. వివిధ సంస్థల సర్వే రిపోర్ట్స్ కూడా కాంగ్రెస్ కు అనుకూల వాతావరణం ఉందని చెబుతుండటంతో ఇకపై దూకుడుగా, జోష్ తో జనాల్లోకి వెళ్లాలని హస్తం పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకత్వం డిసైడ్ అయిందట. ఈక్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ కీలక నేతలను ఢిల్లీకి పిలిపించుకుని కాంగ్రెస్ పెద్దలు వ్యూహ రచన చేశారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఖర్గే.. సిద్ధరామయ్య.. ప్రియాంక
రాష్ట్రంలోని బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మహిళలపై కాంగ్రెస్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వారిని ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా బహిరంగ సభలను నిర్వహించేందుకు ప్రణాళిక రచించింది. ఈనెల 18న తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భారీ సభను నిర్వహించి.. కేసీఆర్ ప్రభుత్వంపై ఛార్జ్ షీట్, ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అదే రోజు హైదరాబాద్‌లో నిర్వహించే ర్యాలీలోనూ ఖర్గే పాల్గొంటారని అంటున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్యతో సూర్యాపేటలో బీసీ గర్జన సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. సిద్ధరామయ్య ద్వారా బీసీ డిక్లరేషన్ పై ప్రకటన చేయించేందుకు కార్యాచరణను రూపొందించారు. సెప్టెంబర్‌లోనే తెలంగాణలో ప్రియాంక గాంధీ కూడా పర్యటించన్నారు. ప్రియాంకగాంధీ ద్వారా మహిళా డిక్లరేషన్ పై ప్రకటన చేయించాలని కాంగ్రెస్ హైకమాండ్ ప్లాన్ చేస్తోంది. ఈవిధంగా ఓ వైపు తెలంగాణ సెంటిమెంట్.. మరోవైపు ఉచిత హామీలు, సామాజిక వర్గాల వారీగా డిక్లరేషన్లతో జనంలోకి చొచ్చుకువెళ్లేలా పదునైన వ్యూహాన్ని కాంగ్రెస్ ప్రిపేర్ చేసుకుంటోంది.