ఇరగదీసిన సచిన్ కొడుకు, 5 వికెట్లతో సూపర్ స్పెల్

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో అదరగొట్టేశాడు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో గోవా టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్ తాజాగా రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 14, 2024 | 12:48 PMLast Updated on: Nov 14, 2024 | 12:48 PM

Arjun Tendulkar Good Bowling Spell

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ బౌలింగ్‌లో అదరగొట్టేశాడు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్‌లో గోవా టీమ్ తరఫున నిలకడగా రాణిస్తున్న అర్జున్ టెండూల్కర్ తాజాగా రంజీ ట్రోఫీలో సత్తా చాటాడు. 5 వికెట్లతో సూపర్ స్పెల్ నమోదు చేశాడు. ముంబై జట్టులో అవకాశం రాకపోవడంతో గోవా తరఫున ఆడుతున్న 24 ఏళ్ల అర్జున్ టెండూల్కర్.. అరుణాచల్ ప్రదేశ్‌తో ప్రారంభమైన రంజీ ట్రోఫీ ప్లేట్ డివిజన్ మ్యాచ్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్‌లో అర్జున్‌కు ఇదే మొద‌టి ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న. అర్జున్ కెరీర్‌లో ఇది 17వ ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచ్‌. 9 ఓవ‌ర్లు వేసిన అర్జున్ 25 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఇందులో మూడు మెయిడిన్ ఓవ‌ర్లు ఉన్నాయి. అర్జున్ దెబ్బకు అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ త‌న తొలి ఇన్నింగ్స్‌లో 30.3 ఓవ‌ర్ల‌లో 84 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది.

ఈ మ్యాచ్‌కు ముందు అర్జున్ 16 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లలో 32 వికెట్లు తీశాడు. ఇక బ్యాటింగ్‌లో 23.13 స‌గ‌టుతో 532 ప‌రుగులు చేశాడు. ఇందులో ఓ సెంచ‌రీ, ఓ అర్థసెంచ‌రీ ఉంది. వాస్తవానికి అర్జున్ టెండూల్కర్ అండర్-19 క్రికెట్‌లో ఎక్కువ భాగం ముంబయి టీమ్‌లో ఉన్నప్పటికీ.. తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. 42 సార్లు రంజీ ట్రోఫీ మ్యాచ్‌ల్లో అతడ్ని రిజర్వ్ బెంచ్‌కే పరిమితం చేశారు. దాంతో 2022-23 సీజన్‌లో గోవా టీమ్‌లోకి వెళ్ళిపోయాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ కొడుకు కావడంతో అతనిపై భారీ అంచనాలే ఉన్నా వాటిని అందుకోవడంలో వెనుకబడ్డాడనే చెప్పాలి. బౌలింగ్ లో సత్తా చాటుతున్నా బ్యాటింగ్ లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించడం లేదు.

ఇదిలా ఉంటే ఐపీఎల్ మెగావేలానికి ముందు అర్జున్ ఫామ్ అందుకోవడం సచిన్ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తోంది. అర్జున్ టెండూల్క‌ర్ ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున 5 మ్యాచులలో మూడు వికెట్లు మాత్ర‌మే తీశాడు. మరి మెగావేలంలో ముంబై అతన్ని తీసుకుంటుందో లేదో చూడాలి. కాగా ఐపీఎల్ మెగావేలం ఈ సారి విదేశాల్లో జరగనుంది. నవంబర్ 24,25 తేదీల్లో సౌదీ అరేబియా సిటీ జెడ్డా వేదికగా ఆక్షన్ ను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వేలం కోసం దేశ,విదేశాలకు చెందిన మొత్తం 1574 మంది ప్లేయ‌ర్లు వేలం కోసం త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. వీరిలో 1165 మంది భార‌త క్రికెట‌ర్లు కాగా, 409 మంది విదేశీ ఆట‌గాళ్లు ఉన్నారు.విదేశీ ఆట‌గాళ్ల‌లో ద‌క్షిణాఫ్రికా నుంచి అత్య‌ధికంగా 91 మంది క్రికెట‌ర్లు పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు.