Sonia Gandhi: సోనియా, అమిత్ షా పర్యటన వేళ.. కాంగ్రెస్, బీజేపీకి భారీ షాక్
హైదరాబాద్ వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు సోనియా, అమిత్ షా విచ్చేయుచున్నారు.
దేశం అంతా ఇప్పుడు హైదరాబాద్ వైపే చూస్తోంది. రెండు అతిపెద్ద జాతీయ పార్టీల పెద్దలు.. భాగ్యనగరానికి రావడమే దానికి కారణం. అటు అమిత్ షా, ఇటు సోనియా.. హైదరాబాద్ వేదికగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో తెలంగాణ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందా అని ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొన్ని నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగబోతున్నాయ్. మూడు సభలు, ఆరు స్పీచ్‌లు అనేలా అన్ని పార్టీలు అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాయ్. ఇప్పటికే 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. పకడ్బందీగా ప్రచారంలో మునిగిపోయింది. కాంగ్రెస్, బీజేపీ కూడా తమదైన శైలిలో బీఆర్ఎస్‌ను పడగొట్టాలని ముందుకు వెళ్తున్నాయ్.
ఇదే సమయంలో సభల మీద సభలు నిర్వహిస్తూ.. జనాలను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయ్. ఐతే సెప్టెంబర్ 17 రాష్ట్ర ప్రజలందరికీ ఆసక్తికరంగా మారింది. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేయబోతోంది. ఈ సభకు కేంద్రమంత్రులు అమిత్ షా సహా ఇతర బడా నాయకులు వస్తున్నారు. అలాగే తుక్కుగూడలో కాంగ్రెస్ కూడా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ సభకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీతో పాటు ఇతర సీనియర్ లీడర్లు అంతా హాజరవుతున్నారు. ఈ సభలో కాంగ్రెస్ కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో హైదరాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయ్. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా దర్శనమిస్తున్న ఆ ఫ్లెక్సీలు.. రెండు పార్టీలసకు షాక్ ఇస్తున్నాయ్. బీజేపీ, కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తూ.. ఈ పోస్టర్లను నగరంలో పలు ప్రాంతాల్లో అతికించారు. గోవా లిబరేషన్ డేకు 3వందల కోట్లు ఇచ్చిన మోదీ సర్కార్.. తెలంగాణ నేషనల్ ఇంటిగ్రేటెడ్ డేకు ఒక్క రూపాయి కూడా అందించలేదు. మరి 17న తెలంగాణకు వస్తున్న అమిత్ షా ఏమైనా ప్రకటిస్తారా అంటూ బీజేపీని ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.
తెలంగాణలో వృద్ధాప్య పింఛన్లు 2వేల 16 రూపాయలు ఇస్తున్నారు. మరి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో వృద్ధులకు ఎంత పింఛన్ ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీ వేశారు. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా కల్పిస్తానన్న రాహుల్, సోనియా.. అసలు ఆ విషయం ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరంగల్ నుంచి ఐటీ మంత్రిగా ఉండి కూడా వరంగల్‌కి ఒక్క ఐటి కంపెనీ ఎందుకు తీసుకురాలేదంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి… రైతుల వ్యవసాయానికి మూడు గంటలు కరెంటు చాలంటున్నారు. దానిపై మీ సమాధానమేంటంటూ సోనియా, రాహుల్‌ను ఫ్లెక్సీల్లో ప్రశ్నించారు.
2004 నుంచి 2014 వరకు అధికారం చేపట్టిన కాంగ్రెస్.. ఎస్సీ వర్గీకరణ చేయలేదు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ డిక్లరేషన్‌లో చెప్పినవన్నీ పాటిస్తామని అంటున్నారు, ఎలా నమ్మాలి అంటూ ప్రశ్నించారు. ఈ పోస్టర్ల వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ్. రెండు పార్టీల బడా నేతలు హైదరాబాద్‌లో ఉన్న వేళ.. ఇలాంటి ఫ్లెక్సీలు కనిపించడం.. కాంగ్రెస్, బీజేపీకి భారీ షాక్‌గా మారడం ఖాయం.