Chandrababu: రేపటితో ముగియనున్న చంద్రబాబు జ్యూడీషియల్ రిమాండ్.. నేడు కోర్టులో ఏం జరుగనుంది..?
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో సెప్టెంబర్ 9వ తేదీన సీఐడీ అధికారులు చంద్రబాబును అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ముందుగా 14 రోజులు రిమాండ్ అనగా సెప్టెంబర్ 24 వరకూ ఆదేశించింది. ఆతరువాత మరో రెండు రోజులు కస్టడీ నేపథ్యంలో రిమాండ్ పొడిగించింది. ఈ లోపు మరిన్ని కేసులు వెంటాడడంతో అక్టోబర్ 5 వరకూ జ్యూడీషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. అయితే రేపటితో కోర్టు ఇచ్చిన రిమాండ్ గడువు ముగియనుంది. ఇలాంటి పరిస్థితుల ఏం జరుగుతుందా అని ఉత్కంఠ అందరిలో నెలకొంది.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయి నేటికి 25 రోజులు అవుతోంది. బెయిల్ తో పాటూ అన్ని రకాల పిటిషన్లు వేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ప్రతి కోర్టులోనూ నిరాశే ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో నేడు ఏసీబీ కోర్టుతో పాటూ ఏపీ హై కోర్టులో కొన్ని పిటిషన్లుపై వాదనలు వినిపించే అవకాశం ఉంది. వీటిపై ఆధారపడి జుడీషియల్ రిమాండ్ పెంచుతారా లేదా అన్నది తెలుస్తుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
ఏసీబీ కోర్టు..
నేడు ఏసీబీ కోర్టులో చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లు విచారణకు రానున్నాయి. ఇదే తరుణంలో ఇన్నర్ రింగు రోడ్డు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో బాబు పై సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. దీనిపై విచారణ కోరే అవకాశం ఉంది. గత నాలుగు వారాలుగా చంద్రబాబు కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. విచారణ చేపట్టిన ప్రతి సారి వాయిదాల పర్వం కొనసాగుతోంది. అయితే ఈరోజు ఏసీబీ కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేస్తుందా.. లేక సీఐడీకి మరి కొన్ని రోజులు విచారణకు ఆదేశిస్తుందా చూడాలి. మరి కొన్ని రోజులు విచారణకు ఆదేశిస్తే రిమాండ్ పొడిగించాల్సి ఉంటుంది. కేసు తీవ్రత దృష్ట్యా రిమాండ్ మరోసారి పొడిగించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పైగా సుప్రీం కోర్టులో ఈనెల 9న క్వాష్ తోపాటూ బెయిల్ పిటీషన్లు వాయిదా వేసిన తరుణంలో రిమాండ్ పొడిగించే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి.
హైకోర్టులో కేసుల విచారణ..
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. ఆ తరువాత సీఐడీ అధికారులు ఒక్కో కేసును వెలుగులోకి తీసుకొస్తున్నారు. ఈ తరుణంలో ఏపీ ఫైబర్ గ్రిడ్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి హై కోర్టులో విచారణ కోరుతూ పిటిషన్ వేశారు. ఇదే తరుణంలో చంద్రబాబు ఫైబర్ గ్రిడ్, ఇన్నర్ రింగు రోడ్డు లో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు. గతంలో దీనిని స్వీకరించి వాయిదా వేసిన కోర్టు నేడు తాజాగా విచారించనుంది. వీటిలో అయినా ముందస్తు బెయిల్ వస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఈరోజు వాయిదా పడితే చంద్రబాబు జూడిషియల్ రిమాండ్ పొడిగించే అవకాశం ఉంది. ఎందుకంటే అక్టోబర్ 5 తో 11 రోజుల రిమాండ్ ముగుస్తుంది. ఈసారి మరో 14 రోజులు పొడిగిస్తే నెలన్నర పైగా రాజమండ్రి జైల్లో ఉండాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నడుమ నేటి విచారణ కీలకం కానుంది.
T.V.SRIKAR