అశ్విన్ ను ఊరిస్తున్న రికార్డు, తుది జట్టులో చోటు దక్కేనా ?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఊహించినట్టుగానే రసవత్తరంగా సాగుతోంది. పెర్త్ లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా అడిలైడ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి రివేంజ్ తీర్చుకుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి మూడో టెస్ట్ ఆరంభం కానుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 12, 2024 | 07:51 PMLast Updated on: Dec 12, 2024 | 7:51 PM

Ashwins Impressive Record Will He Make It To The Final Team

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఊహించినట్టుగానే రసవత్తరంగా సాగుతోంది. పెర్త్ లో చిత్తుగా ఓడిన ఆస్ట్రేలియా అడిలైడ్ లో బౌన్స్ బ్యాక్ అయ్యి రివేంజ్ తీర్చుకుంది. ఐదు టెస్టుల సిరీస్ లో ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. ఇప్పుడు డిసెంబర్ 14 నుంచి మూడో టెస్ట్ ఆరంభం కానుండగా.. ఇరు జట్లు ప్రాక్టీస్ లో బిజీగా గడుపుతున్నాయి. అయితే ఈ మ్యాచ్ కు సంబంధించి భారత తుది జట్టులో మార్పులు జరిగే అవకాశముంది. ఇదిలా ఉంటే టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 120 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా నిలిచేందుకు అశ్విన్ 5 వికెట్ల దూరంలో నిలిచాడు. బ్రిస్బేన్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్ట్‌లో అశ్విన్ ఐదు వికెట్లు తీస్తే ఈ ఫీట్ అందుకోనున్నాడు.

ప్రస్తుతం ఈ ఘనతకు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లయన్ చేరువలో ఉన్నాడు. అతను 28 మ్యాచ్‌ల్లో 118 వికెట్లతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 120 వికెట్ల మైలు రాయి అందుకునేందుకు నాథన్ లయన్‌కు 2 వికెట్లు మాత్రమే అవసరం. బ్రిస్బేన్ టెస్ట్‌లో అశ్విన్ కంటే ముందే నాథన్ లయన్ ఈ ఫీట్ సాధించే అవకాశం ఉంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రవిచంద్రన్ అశ్విన్ ఇప్పటి వరకు 23 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు తీసాడు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 20 మ్యాచ్‌ల్లో 111 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్ 18 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా 16 మ్యాచ్‌ల్లో 85 వికెట్లు తీసాడు. అయితే బ్రిస్బేన్ టెస్ట్‌ కోసం తుది జట్టులో అశ్విన్ కు చోటు దక్కడం అనుమానంగానే ఉంది.

తొలి టెస్ట్‌ తుది జట్టులో చోటు దక్కించుకోని అశ్విన్.. రెండో టెస్ట్ ఆడాడు. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో 18 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి ఒక్క వికెట్ మాత్రమే తీసాడు. ఈ క్రమంలోనే బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్‌ను బ్రిస్బేన్ టెస్ట్ ఆడించే అవకాశం ఉంది. కానీ బ్రిస్బేన్‌లోని గబ్బా మైదానంలో పేసర్లతో పాటు స్పిన్నర్లు కూడా కీలకం కానున్నారు. ఒకవేళ టీమిండియా మేనేజ్‌మెంట్ ఈ ఆలోచన చేస్తే స్పెషలిస్ట్ స్పిన్నర్ గా అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.