అశ్విన్ నయా హిస్టరీ WTCలో అరుదైన రికార్డ్

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. పుణే వేదికగా కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో అతను ఈ మైలురాయి అందుకున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: October 24, 2024 | 05:50 PMLast Updated on: Oct 24, 2024 | 5:50 PM

Ashwins New History Is A Rare Record In Wtc

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచాడు. పుణే వేదికగా కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో అతను ఈ మైలురాయి అందుకున్నాడు. అశ్విన్ తన తొలి ఓవర్‌లోనే వికెట్ పడగొట్టాడు. లాథమ్‌ను ఎల్బీగా పెవిలియన్ గా పంపాడు. కివీస్ కెప్టెన్ ను అశ్విన్ 9 సార్లు ఔట్ చేయగా… ఈ సారి కూడా లాథమ్ అతని స్పిన్ కు చిక్కాడు. దీంతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక వికెట్లు సాధించిన ప్లేయర్‌గా యాష్ రికార్డు నెలకొల్పాడు. ఐసీసీ 2019లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభించింది. అప్పటి నుంచి డబ్ల్యూటీసీ సైకిల్‌లో 39 టెస్టులు ఆడిన అశ్విన్ 188 వికెట్లు పడగొట్టాడు. 11 సార్లు అయిదు వికెట్లు సాధించాడు. కాగా అంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లైయన్ పేరిట ఉండేది.

నాథన్ లైయన్ 43 టెస్టుల్లో 187 వికెట్లు పడగొట్టాడు. లైయన్ కంటే తక్కువ టెస్టులే ఆడిన అశ్విన్ డబ్ల్యూటీసీలో లీడింగ్ వికెట్ టేకర్‌గా చరిత్రకెక్కాడు. అశ్విన్, లైయన్ తర్వాతి స్థానాల్లో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, స్టువర్ట్ బ్రాడ్, కగిసో రబాడ , జస్‌ప్రీత్ బుమ్రా ఉన్నారు. ఈ సిరీస్ తర్వాత ఆసీస్ గడ్డపై భారత్ ఐదు టెస్టులు ఆడనుండడంతో అత్యధిక వికెట్ జాబితాలో మార్పులు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొదటి స్థానం కోసం అశ్విన్, నాథన్ లయన్ మధ్యే గట్టిపోటీ నెలకొంటుందని చెప్పొచ్చు. కివీస్ తో సిరీస్ అనంతరం ఆసీస్ పిచ్ లపై కూడా అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్ చూపిస్తే నాథన్ లయన్ ను వెనక్కి నెట్టి టాప్ ప్లేస్ నిలబెట్టుకోవచ్చు.

ఇదిలా ఉంటే పుణే టెస్టులో న్యూజిలాండ్ 259 పరుగులకు ఆలౌటైంది. ఆరంభంలో అశ్విన్ 3 వికెట్లతో కివీస్ కు షాకిస్తే… వాషింగ్టన్ సుందర్ సంచలన ప్రదర్శనతో అదరగొట్టాడు. ఏకంగా 7 వికెట్లతో న్యూజిలాండ్ ను దెబ్బకొట్టాడు. బెంగళూరు టెస్ట్ ఓటమి తర్వాత సుందర్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ జట్టులోకి ఎంపిక చేసింది. వచ్చీ రావడంతోనే కుల్దీప్ యాదవ్ ప్లేస్ లో చోటు దక్కించుకున్న వాషింగ్టన్ సుందర్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకున్నాడు. ఈ క్రమంలో టెస్ట్ కెరీర్ లోనే అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. 59 పరుగులిచ్చి 7 వికెట్లు పడగొట్టాడు. కాగా తొలిరోజు ఆటముగిసే సమయానికి భారత్ 1 వికెట్ కోల్పోయి 16 రన్స్ చేసింది. రోహిత్ శర్మ డకౌటవడం ఒక్కటే నిరాశపరిచింది. ఈ మ్యాచ్ లో భారత్ కనీసం 100 పరుగుల పైన ఆధిక్యం సాధిస్తే గెలిచే అవకాశముంటుంది. ఎందుకంటే పుణే పిచ్ పై చివరి రెండురోజులు బ్యాటింగ్ చేయడం సవాల్ గా ఉంటుంది.