BJP: అక్బర్ ను ఆకాశానికెత్తిన బీజేపీ.. ‘జీ20 బుక్ లెట్’లో సంచలన విషయాలు
టిప్పు సుల్తాన్, ఔరంగ జేబ్ వంటి వారిని నిత్యం విమర్శించే కమల దళం.. చక్రవర్తి అక్బర్ ను మాత్రం ఆకాశానికి ఎందుకు ఎత్తింది ? అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది.

At the G20 Summit, Akbar was widely published in the book India Mother of Democracy
బీజేపీ స్ట్రాటజీ క్లియర్ కట్.. దేశంలో మెజారిటీ జనాభాకు చెందిన ఓటర్లనే లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ ముందుకు పోతుంటుంది. అలాంటి పార్టీ ఇటీవల జీ20 సదస్సు సందర్భంగా విడుదల చేసిన బుక్ లెట్ లో ఒక ముస్లిం పాలకుడిని ఆకాశానికి ఎత్తింది. ఆయన పాలన అమోఘం అని ప్రశంసల వర్షం కురిపించింది. ఎందుకలా ? టిప్పు సుల్తాన్, ఔరంగ జేబ్ వంటి వారిని నిత్యం విమర్శించే కమల దళం.. చక్రవర్తి అక్బర్ ను మాత్రం ఆకాశానికి ఎందుకు ఎత్తింది ? అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తోంది. జీ20 సందర్భంగా ‘ఇండియా: మదర్ ఆఫ్ డెమోక్రసీ’ పేరిట ముద్రించిన బుక్ లెట్ ను.. సదస్సుకు వచ్చిన ప్రపంచ దేశాల నేతలకు కూడా పంపిణీ చేశారు. ఇందులో భారతదేశ ప్రాచీన నాగరికత, ప్రజాస్వామ్య సంప్రదాయాలు, మతాలు, సాధువులు, విశ్వాసాలు, గొప్ప వ్యక్తులు, పాలకుల గురించి ప్రస్తావించారు.
రామాయణం, రాముడు, మగధ సామ్రాజ్యాధినేత అజాతశత్రువు, మొఘల్ చక్రవర్తులు, స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ భారతదేశ ప్రధాన మంత్రులందరి ప్రస్తావన ఈ బుక్ లో ఉంది.
బుక్ లెట్ లో ఏం రాశారు ?
మూడో మొఘల్ చక్రవర్తి అక్బర్ గురించి జీ20 బుక్ లెట్ లో ప్రస్తావిస్తూ.. ‘‘ఆయన ప్రజాస్వామ్య ఆలోచనలు ఇతరులకు భిన్నంగా ఉండేవి. ఆధునిక యుగానికి దగ్గరగా ఆయన ఆలోచనలు ఉండేవి. పరిపాలనకు మతంతో సంబంధం ఉండకూడదని అక్బర్ భావించేవారు. అందరి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునేవారు’’ అని పేర్కొన్నారు. ‘‘మతవివక్షకు వ్యతిరేకంగా సుల్హ్-ఇ-కుల్ సూత్రాన్ని అక్బర్ ప్రతిపాదించారు. ప్రపంచ శాంతి కోసం ఈ సూత్రం రూపొందించారు’’ అని బుక్ లెట్ లో ఉంది. ‘‘అక్బర్ దాతృత్వం, మత సహనం, పాలనలో ప్రజాస్వామిక స్వభావం అమోఘం’’ అని కొనియాడారు.
ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ముస్లిం ఓటు బ్యాంకును ఆకట్టుకునేందుకు జీ20 బుక్ లెట్ లో అక్బర్ ను మెచ్చుకొని ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఇస్లాం ప్రధాన మతంగా ఉన్న టర్కీ, ఆఫ్రికా దేశాలు, అరబ్ దేశాలు జీ20 సదస్సుకు వచ్చినందున.. వారి నుంచి మన్ననలు పొందేందుకు ఇలా చేసి ఉండొచ్చని అంటున్నారు. ఎన్నికల విషయానికొస్తే.. ఉత్తరప్రదేశ్ , బెంగాల్, బీహార్ లలో ముస్లిం జనాభా చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే యూపీలో బీజేపీ పాగా వేసింది. రానున్న రోజుల్లో బెంగాల్, బీహార్ లనూ గెలుచుకోవాలని కమలదళం ప్లాన్ చేస్తోంది. ఈనేపథ్యంలోనే అక్బర్ గురించి పాజిటివ్ విషయాలను బుక్ లెట్ లో చేర్చారని ఇంకొందరు పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం బీజేపీ నుంచి రాజ్యసభలో కానీ, లోక్‌సభలో కానీ ఒక్క ముస్లిం ప్రజాప్రతినిధి కూడా లేరు. వచ్చే ఎన్నికల్లోనూ ఆ పార్టీ ముస్లింలకు లోక్ సభ టికెట్లు ఇచ్చే అవకాశాలు పెద్దగా లేవని తెలుస్తోంది. ముస్లింలకు ప్రాతినిధ్యం కల్పించకుండా.. కేవలం ఓట్ల కోసం గురిపెట్టడం బీజేపీకి పెద్దగా రిజల్ట్ ఇవ్వదని పొలిటికల్ అనలిస్టులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే సీబీఎస్ఈ పుస్తకాల్లో నుంచి మొఘల్ పాలకులకు సంబంధించిన చాలా పాఠాలను మోడీ సర్కారు తొలగించింది. దీన్ని ముస్లిం సమాజం విద్వేష చర్యగానే పరిగణిస్తోందని సామాజికవేత్తలు అంటున్నారు.