చెప్పి మరీ కొడుతున్నాడుగా, విన్నింగ్ కెప్టెన్ గా కమ్మిన్స్

వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఎప్పుడూ అత్యుత్తమ జట్టుగానే ఉంటుంది.. అప్పుడప్పుడు భారత్ లాంటి పెద్ద జట్ల చేతిలో ఓటమి చవిచూసినా మళ్ళీ కొన్ని రోజుల్లోనే బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇలాంటి జట్టును నడిపించడమంటే మాటలు కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 7, 2025 | 05:07 PMLast Updated on: Jan 07, 2025 | 5:07 PM

Australia Captain Pat Cummins Impressive Leadership

వరల్డ్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఎప్పుడూ అత్యుత్తమ జట్టుగానే ఉంటుంది.. అప్పుడప్పుడు భారత్ లాంటి పెద్ద జట్ల చేతిలో ఓటమి చవిచూసినా మళ్ళీ కొన్ని రోజుల్లోనే బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఇలాంటి జట్టును నడిపించడమంటే మాటలు కాదు..ప్రస్తుతం ఆస్ట్రేలియాను నడిపిస్తున్న ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్విన్నింగ్ కెప్టెన్ గా మారిపోయాడు. తనదైన కెప్టెన్సీతో అదరగొడుతున్నాడు. పెద్ద సిరీస్ లు, ఐసీసీ టోర్నీల్లో కంగారూలను విజేతగా నిలబెడుతున్నాడు. గత రెండు మూడేళ్ళుగా ఆ జట్టు సాధిస్తున్న విజయాలే అతని కెప్టెన్సీ ఎలా ఉందో చెప్పేస్తున్నాయి. కమ్మిన్స్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ , వన్డే వరల్డ్ కప్ , యాషెస్ సిరీస్ తో పాటు ఇప్పుడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సైతం కైవసం చేసుకుంది. నిజానికి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గత నాలుగు సార్లు భారత జట్టే గెలిచింది. ఈ సారి ఆసీస్ సొంతగడ్డపై ఓడించి హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా అక్కడకు వెళ్ళింది. ఈ సిరీస్ ఆరంభానికి ముందు కమ్మిన్స్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపించాడు. అతని కాన్ఫిడెన్స్ చూసి ఆసీస్ ప్లేయర్స్ యాటిట్యూడ్ ఇంతే కదా అనుకున్నారు.

ఈ సారి ఎలాగైనా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సాధిస్తామని ముందే చెప్పాడు. అయితే పెర్త్ టెస్టులో ఘోరపరాజయంతో ఆసీస్ పై విమర్శలు వచ్చాయి. కంగారూల పని ఈ సారి కూడా ఖతమేనని అంతా అనుకున్నారు. అయితే కమ్మిన్స్ మాత్రం ఈ ఓటమితో బెదర్లేదు. ఒక మ్యాచ్ తో తమను తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరించాడు. తాము ఏంటో చూపిస్తామని, ట్రోఫీని గెలుచుకుంటామని ఫ్యాన్స్‌కు వాగ్దానం చేశాడు. ఆస్ట్రేలియా నంబర్ వన్ టీమ్ అన్న విషయాన్ని మరిచిపోవద్దంటూ గట్టిగానే చెప్పాడు. కమ్మిన్స్ ఈ మాట చెప్పిన నెల రోజులు తర్వాత ఆసీస్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 3-1తో కైవసం చేసుకుంది. పెర్త్ టెస్ట్ ఓటమితో సిరీస్ లో వెనుకబడిన జట్టు అద్భుతంగా పుంజుకుని ట్రోఫీ గెలిచింది. ట్రోఫీ గెలుస్తామంటూ అభిమానులకు ఇచ్చిన మాటను కమిన్స్ నిలబెట్టుకున్నాడు . దీంతో అతడ్ని ఆసీస్ అభిమానులు, అక్కడి మీడియా, మాజీ ఆటగాళ్ళు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు ఆకాశానికెత్తేస్తున్నారు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ ముగిసిన తర్వాత కెప్టెన్ గా కమ్మిన్స్ అరుదైన రికార్డు సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ చరిత్రలో అత్యధిక విజయాలు సాధించిన సారథిగా రికార్డులకెక్కాడు. ఇప్పటి వరకూ 33 టెస్టుల్లో 20 విజయాలను అందుకున్నాడు. అతని తర్వాతి స్థానంలో బెన్ స్టోక్స్ ఉండగా.. విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ, జో రూట్ వరుసగా మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.