ఆస్ట్రేలియా అహంకారం, గవాస్కర్ కు అవమానం

ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్డింగ్ చేయడం , వారిని రెచ్చగొట్టడం,చులకనగా చూడడం ఆస్ట్రేలియన్లకు బాగా అలవాడు... అందుకే కంగారూలపై విజయాన్ని ప్రతీ జట్టూ ఆస్వాదిస్తుంది. ముఖ్యంగా వారి ఆధిపత్యానికి వారి సొంతగడ్డపైనే చెక్ పెట్టిన ఘనత టీమిండియాకే దక్కుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 6, 2025 | 01:36 PMLast Updated on: Jan 06, 2025 | 1:36 PM

Australias Pride Gavaskars Shame

ప్రత్యర్థి ఆటగాళ్లను స్లెడ్డింగ్ చేయడం , వారిని రెచ్చగొట్టడం,చులకనగా చూడడం ఆస్ట్రేలియన్లకు బాగా అలవాడు… అందుకే కంగారూలపై విజయాన్ని ప్రతీ జట్టూ ఆస్వాదిస్తుంది. ముఖ్యంగా వారి ఆధిపత్యానికి వారి సొంతగడ్డపైనే చెక్ పెట్టిన ఘనత టీమిండియాకే దక్కుతుంది. అయితే మన ఆటగాళ్లను విమర్శించేందుకు, అవకాశం దొరికినప్పుడల్లా అవమానించి శునకానందం పొందుతారు. తాజాగా సిడ్నీ టెస్ట్ ముగిసిన తర్వాత నిర్వాహకులు భారత దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ను అవమానించారు. ట్రోఫీ అందించే సమయంలో గవాస్కర్ ను పిలవలేదు. కేవలం బోర్డర్ చేతుల మీదుగా కార్యక్రమం కానిచ్చేశారు. ఈ సిరీస్ పేరే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ… అలెన్ బోర్డర్, సునీల్ గవాస్కర్ ఇద్దరూ కూడా ప్రపంచ క్రికెట్ లో ఎన్నో రికార్డులు అందుకున్నారు. తమ తమ దేశాలకు ఎంతో పేరు తీసుకొచ్చిన వీరిద్దరి పేరు మీద సిరీస్ ను నిర్వహిస్తూ వస్తున్నారు.

ప్రతీసారి ట్రోఫీని ఇద్దరూ విజేతకు అందజేస్తుంటారు. అయితే ఈ సారి నిర్వాహకులు దీనికి భిన్నంగా వ్యవహరించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ట్రోఫీని ఇస్తున్న సమయంలో గావస్కర్ మైదానంలో వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఆస్ట్రేలియా సునీల్ గావస్కర్ ను పట్టించుకోలేదు. కేవలం బోర్డర్ చేతుల మీదుగానే ఈ ట్రోఫీని ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ కు అందించడం విమర్శలకు తావిస్తోంది. తాను లేకుండా తన తోటి ఆటగాడు అలన్ బోర్డర్ తో ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీని అందజేయడం పట్ల సునీల్ గావస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బోర్డర్ తో కలిసి ట్రోఫీని అందజేసేందుకు తనకు ఆహ్వానం లేకపోవటం నిరుత్సాహానికి గురిచేసిందని, తనతో కలిసి ఆస్ట్రేలియా జట్టుకు ట్రోఫీని అందించి ఉంటే సంతోషించేవాడినని చెప్పాడు.

తాను కేవలం భారతీయుడిని కాబట్టి పిలవలేదేమోనని ఆయన వ్యాఖ్యానించాడు. ఆస్ట్రేలియా జట్టు సిరీస్ గెలవడంపై తాను సంతోషించానని, ఎందుకంటే వారు బాగా ఆడారన్నాడు. సిరీస్ గెలుచుకోవటానికి వారు అర్హులేనని చెప్పాడు. ఇదిలా ఉంటే సిడ్నీ లో టెస్టు ప్రారంభానికి ముందు టోర్నీ నిర్వాహకులు తనకు వద్దకు వచ్చారని గుర్తు చేసుకున్నాడు. ఒకవేళ సిడ్నీ టెస్టు డ్రా అయినా, ఆస్ట్రేలియా గెలిచినా ట్రోఫీని అందజేయడానికి మీ అవసరం ఉండదని చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ఇద్దరి పేరు మీద సిరీస్ నిర్వహిస్తూ మరొకరిని పిలవకపోవడం ఏంటో తనకు అర్థం కాలేదన్నాడు. కాగా ఆస్ట్రేలియా అహంకారానికి ఇదే నిదర్శనమంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.