#Ayodhya Ram Mandir : ఇవాళ్టి నుంచి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాలు….మైసూర్ రామ్ లల్లా విగ్రహమే ఫైనల్ !
అయోధ్య శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి మంగళవారం నుంచి కౌంట్ డౌన్ మొదలైంది. ప్రాణ ప్రతిష్ట క్రతువులను ప్రారంభించారు పండితులు. రామమందిరంలో ఏ విగ్రహం పెడతారు అన్నదాని పైనా టెంపుల్ ట్రస్ట్ వివరణ ఇచ్చింది. మైసూర్ కు చెందిన శిల్పి చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్నే అయోధ్యలో ప్రతిష్టించబోతున్నట్టు ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ప్రకటించారు. గత 70 యేళ్ళుగా పూజలు అందుకుంటున్న విగ్రహం ఏం చేస్తారన్న దానిపైనా క్లారిటీ ఇచ్చారు పండితులు.
జనవరి 22న అయోధ్యలో శ్రీరామ మందిరంలో రాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది. ప్రధాని నరేంద్రమోడీ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా 7 వేల మందిని టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానించింది.
జనవరి 16
ప్రాణప్రతిష్ఠ క్రతువులు ప్రారంభం. ఆలయ ట్రస్ట్ నియమించిన హోస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ప్రాయశ్చిత్త కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సరయూ నది ఒడ్డున ‘దశవిధ’ స్నానం, విష్ణుపూజ, గోపూజ జరుగుతాయి.
జనవరి 17
రామ్ లల్లా విగ్రహం ఊరేగింపు అయోధ్యకు చేరుకుంటుంది. మంగళకలశంలో సరయూ జలాన్ని తీసుకొని భక్తులు అయోధ్య ఆలయానికి చేరతారు.
జనవరి 18
గణేష్ అంబికా పూజ, వరుణ పూజ, మాతృక పూజ, వాస్తు పూజలు జరుగుతాయి.
జనవరి 19
యజ్ఞం ప్రారంభం అవుతుంది. తర్వాత ‘నవగ్రహ’ ‘హవన్’ స్థాపన నిర్వహిస్తారు.
జనవరి 20
రామజన్మభూమి ఆలయ గర్భగుడిని సరయూ నీళ్ళు తీసుకొచ్చి శుభ్రం చేస్తారు. తర్వాత వాస్తు శాంతి ‘అన్నాధివాస్’ ఆచారాలను పండితులు నిర్వహిస్తారు.
జనవరి 21
రామ్ లల్లా విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించి, చివరకు శంకుస్థాపన చేస్తారు.
జనవరి 22
ప్రధాన ప్రాణ ప్రతిష్ఠ వేడుక మధ్యాహ్నం 12:30 గంటలకు మొదలవుతుంది. రామ్ లల్లా విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిష్ఠాపన చేస్తారు. చివరి రోజు జరిగే మహోత్సవానికి 150 దేశాల నుంచి భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 7 వేల మందికి టెంపుల్ ట్రస్ట్ ఆహ్వానాలు పంపింది. జనవరి 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదు. జనవరి 23 నుంచి తిరిగి అయోధ్య రామ మందిరంలో భక్తులందరికీ రామ్ లల్లా దర్శన భాగ్యం కల్పిస్తారని టెంపుల్ ట్రస్ట్ తెలిపింది.
మైసూర్ విగ్రహమే ఫైనల్
రామ మందిరంలో మైసూర్ కు చెందిన శిల్పి చెక్కిన రామ్ లల్లా విగ్రహాన్నే అయోధ్యలో ప్రతిష్టిస్తున్నారు. అరుణ్ యోగి రాజు చెక్కిన ఈ విగ్రహాన్ని గుర్భగుడిలో ప్రతిష్టిస్తారు. మొత్తం ఎంపికైన 3 విగ్రహాల్లో యోగిరాజు చెక్కిందే అత్యద్భుతంగా ఉందని ట్రస్ట్ సెక్రటరీ తెలిపారు. కొత్త విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల దాకా ఉంటుంది. ఐదేళ్ళ బాలుడిగా ఉన్నట్టు రామ్ లల్లా విగ్రహంను తీర్చిదిద్దారు శిల్పి. అలాగే అయోధ్యలో 70 యేళ్ళుగా పూజలు అందుకుంటున్న రామ్ లల్లా విగ్రహం కూడా దేవాలయంలోనే ఉంటుందని ట్రస్ట్ అధికారులు తెలిపారు.