AYODHYA RAM MANDIR: శూన్యమాసంలో రాముడి ప్రాణప్రతిష్ట సరైందేనా..? శాస్త్రం ఏం చెబుతోంది..?

"సర్వేషాం పౌషమాఘౌ ద్వౌ విబుధస్థాపనే శుభౌ" అని సంస్కృతంలో ఉంది. అంటే దేవతలకు పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థం. అలాగే.. ఏ నెలలో ప్రతిష్ట చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వివరిస్తూ పౌషే రాజ్యవివృద్ధిస్యాత్.. అన్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 20, 2024 | 05:09 PMLast Updated on: Jan 20, 2024 | 5:09 PM

Ayodhya Ram Mandir Pran Pratishta Muhurth Is Good

AYODHYA RAM MANDIR: మరో రెండు రోజుల్లో అయోధ్యలో శ్రీ రాముడు కొలువుదీరబోతున్నాడు. ఈ నెల 22న శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. అయితే, ఇది పుష్య మాసం. దీన్ని శూన్య మాసం అని కూడా అంటారు. సాధారణంగా ఈ మాసంలో ముహూర్తాలు ఉండవంటారు. మరి.. అలాంటిది ఈ మాసంలో శ్రీ రాముడి ప్రాణ ప్రతిష్టకు పండితులు ముహూర్తం ఎలా నిర్ణయించారు..?
పుష్య మాసం లేదా శూన్య మాసం దేవతా ప్రతిష్ఠలకు అత్యంత శ్రేష్ఠం అని జ్యోతిష్య శాస్త్ర గ్రంథాల్లో ఉంది.

AYODHYA RAM MANDIR: రాముడి పేరుతో సైబర్ మోసం.. జాగ్రత్త.. అవి క్లిక్ చేయొద్దు!

“సర్వేషాం పౌషమాఘౌ ద్వౌ విబుధస్థాపనే శుభౌ” అని సంస్కృతంలో ఉంది. అంటే దేవతలకు పుష్యమాసం, మాఘమాసం శుభకరం అని అర్థం. అలాగే.. ఏ నెలలో ప్రతిష్ట చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుందో వివరిస్తూ పౌషే రాజ్యవివృద్ధిస్యాత్.. అన్నారు. పుష్యమాసంలో దేవతా ప్రతిష్ఠ జరిగితే, రాజ్యం విశేషంగా అభివృద్ధి పొందుతుంది అని దీనర్థం. అందువల్ల ఈ మాసంలో ప్రాణప్రతిష్ట చేయడంలో దోషం లేదు. ద్వాదశినే ఎంచుకోవడానికి కారణం ఉంది. శ్రీ మహావిష్ణువికి ఇష్టమైన తిథి ద్వాదశి. ఈ తిథికి విష్ణుమూర్తి అధిపతి. ద్వాదశి తిథిలో ఉపవాసం ఉండరు. ఏకాదశి నుంచి ఉన్న ఉపవాసాన్ని విరమించే తిథి. అంటే భోజనం పెట్టే తిథి, అన్నదానం చేసే తిథి. ఈ తిథిరోజు రామచంద్రుడు అయోధ్యలో కొలువైతే దేశంలో కరువు కాటకాలు ఉండవన్నది పండితుల ఉద్దేశం. అందుకే ఏరికోరి ద్వాదశి తిథిని ముహూర్తంగా నిర్ణయించారు. ఇక.. అభిజిత్ ముహూర్తానికి కూడా ప్రత్యేకత ఉంది.

ఈ ముమూర్తంలో ఏం చేసినా అక్షయఫలితాన్ని ఇస్తుందని మత్స్యపురాణంలో ఉంది. పైగా ఈ సమయాన్ని శత్రునిర్మూలన సమయం అంటారు. అందుకే దేశాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలన్నీ వదిలిపోయి, దేశం సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతోనే అభిజిత్ ముహూర్తాన్ని నిర్ణయించారు. చరలగ్నంలో ప్రతిష్ఠ చేయడానికి కూడా విశిష్టత ఉంది. జాతకంలో అయినా, ముహూర్తంలో అయినా లగ్నంలో గురుడుంటే ఇక తిరుగేముంది. ఎన్ని విఘ్నాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా వాటంతట అవే సమసిపోతాయి. అందుకే లగ్నంలో గురుబలం ఉన్న ముహూర్తం ఇది.
లగ్నే స్థిరే చోభయరాశియుక్తే
నవాంశకే చోభయగే స్థిరే వా..
చరలగ్నమైనా కానీ నవాంశలో ద్విస్వభావ లగ్నం అవడం, శుక్రుడు లగ్నాన్ని వీక్షిస్తూ ఉండటం వల్ల ఇది దోషరహితమైనది అని అర్థం. పైగా లగ్నంనుంచి ద్వితీయంలో చంద్రుడు ఉండడం చల్లదనం, శుభప్రదం.