విష్ణుమూర్తి పాదాలకు పట్టీలు, మెట్టెలు – వింత ఆచారం ఎక్కడ.. ఎందుకు..?
మహావిష్ణువు కొలువుదీరిన ఆ క్షేత్రంలో వింత ఆచారం కొనసాగుతోంది. స్వామివారి పాదాలకు పట్టీలు, కడియాలు తొడగమే కాదు... మెట్టెలు కూడా పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు..? దీని వెనుక ఏదైనా కథ ఉందా..?
మహావిష్ణువు కొలువుదీరిన ఆ క్షేత్రంలో వింత ఆచారం కొనసాగుతోంది. స్వామివారి పాదాలకు పట్టీలు, కడియాలు తొడగమే కాదు… మెట్టెలు కూడా పెడుతున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు..? దీని వెనుక ఏదైనా కథ ఉందా..? అంటే… ఆలయాల్లో కొనసాగే ప్రతి ఆచారం వెనుక.. పురాణ గాధలు ఎన్నో ఉంటాయి. మరి ఈ ఆలయ విశిష్టత ఏంటి..? స్వామివారు మెట్టెలు ధరించడం వెనుకున్న కథేంటి..? తెలుసుకుందాం.
మహావిష్ణువుకు మెట్టెలు తొడిగే ఆచారం ఉన్న ఆలయం… యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది. చౌటుప్పల్ మండలం దేవలమ్మనాగారంలో కొండపై నారాయణుడు.. మహావిష్ణువుగా కొలువుదీరి ఉన్నాడు. శ్రీదేవి, భూదేవి సమేతంగా దర్శనం ఇస్తున్న ఇక్కడి స్వామివారిని జగన్మోహినిగా కొలుస్తారు. అందుకే స్వామివారి కాళ్లకు పట్టీలు, కడియాలను అలంకరిస్తారు. మెట్టెలు కూడా తొడుగుతారు. మహావిష్ణువు ఎత్తిన దశావతారాలన్నీ.. ఈ విగ్రహంలో కనిపిస్తాయట.
ఆ ఆలయాన్ని భక్తులు నిర్మించుకున్నా… జగన్మోహినిగా దర్శనమిస్తున్న స్వామివారి విగ్రహానికి కొన్ని వందల సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ విగ్రహం ఏ కాలం నాటిది అన్నది మాత్రం ఎవరికీ తెలియదని ఆలయ పూజారులు చెప్తున్నారు. కొన్నేళ్ల క్రితం కొండ ప్రాంతాన్ని తవ్వి.. రోడ్డు వేసే సమయంలో ఈ విగ్రహం, శాసనం బయటపడ్డాయని చెప్తున్నారు. విగ్రహం చెక్కుచెదరకుండా కనిపించిందట. అంతేకాదు… అరుదైన విగ్రహం కావడం విశేషం. దశావతార రూపాలు ఉండటంతో… ఆ విగ్రహాన్ని ప్రతిష్టించాలని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. కొండపై శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పునర్‌నిర్మిచుకుని… ఈ విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు.
ఈ ఆలయంలో ఏకాదశి రోజు విశిష్టమైన పూజలు చేస్తారు. అభిషేకం, సుదర్శన నారసింహ యాగం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశికి మూడు రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుపుతారు. బ్రహ్మోత్సవాలు సమయంలో జరిగే స్వామివారి కళ్యాణం కన్నులపండువగా ఉంటుందట. జనవరి 10న వైకుంఠ ఏకాదశి కావడంతో… బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.