More Super Market: ఎమ్మార్పీ కంటే ‘మోర్’ వసూలు.. బాధితునికి నష్టపరిహారంగా రూ. 17వేలు
వస్తువు పై ఉన్న ధర కంటే ఎక్కువ వసూలు చేస్తున్న మోర్ సూపర్ మార్కెట్. వినియోగదారీ కమిషన్ ను ఆశ్రయించిన బాధితుడు. చట్టపరంగా చర్యలు తీసుకుని బాధితునికి న్యాయం చేస్తూ తీర్పును వెలువరించిన బెంచ్.
మనకు అర్జెంటుగా ఏదైనా ఇంటి సామాన్లు అవసరం అయితే చిన్న చిన్న కిరాణా కొట్టు వద్దకు వెళ్తూ ఉంటాం. అక్కడ మనకు కావల్సిన బ్రాండ్ అందుబాటులో లేకుంటే మరో నాలుగు అడుగులు వేసి సూపర్ మార్కెట్ల వంక తొంగి చూస్తాం. అక్కడైతే ఒకటికి నాలుగు రకాలా కంపెనీల ప్రొడక్ట్స్ ఎంఆర్పీ ధరలకు లభిస్తాయని ఆశతో వెళ్తాం. వస్తువు తీసుకున్నాక దానిపై ఉన్న ధరకంటే అధిక ధరను వసూలు చేస్తే మరో గద్యంతరం లేకుండా అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తాం. సరిగ్గా ఇలాంటి ఘటనే మోర్ సూపర్ మార్కెట్లో చోటు చేసుకుంది.
అధిక వసూళ్లు.. నిర్లక్ష్యంగా సమాధానం
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సూపర్ మార్కెట్లో బండ బసవరాజు అనే వ్యక్తి నూనె పాకెట్ కొనుగోలు చేశారు. దీనిపై ధర రూ. 160 ఉండగా వినియోగదారుని నుంచి రూ. 175 వసూలు చేశారు. అదేంటి ఎమ్మార్పీ కన్నా అధికంగా వసూలు చేస్తున్నారని ప్రశ్నించాడు బసవరాజు. మేము అందరి దగ్గర ఇలాగే వసూలు చేస్తున్నామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు మోర్ ఉద్యోగి. అంతేకాకుండా ఇప్పటి వరకూ లక్షన్నర ప్యాకెట్లకు పైగా అమ్మినప్పటికీ ఎవరూ ప్రశ్నించలేదని సదరు వినియోగదారునితో ఎదురిస్తూ మాట్లాడారు.
ఫోరంలో న్యాయం.. రూ. 17 వేలు నష్టం పరిహారం
మోర్ దోపిడీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ను ఆశ్రయించారు బసవరాజు. దీనికి సంబంధించి 2022 నవంబర్17న వంటనూనె కొనుగోలు చేసిన బిల్లులను పొందుపరిచారు. దాదాపు 9 నెలల పాటూ ఈ కేసు విచారణ కొనసాగింది. న్యాయం కోసం విశ్రమించకుండా పోరాడిన ఇతనికి వినియోగదారీ కోర్ట్ కస్టమర్ కి అనుకూలంగా తీర్పును వెలువరించింది. దీంతో పాటూ పలు ఆదేశాలు జారీచేసింది. ఎంఆర్పీ కంటే అధికంగా వసూలు చేయడం చట్టరిత్యా నేరం అని పిటిషనర్ కు అధికంగా తీసుకున్న రూ. 15 తో పాటూ కోర్టు ఖర్చుల నిమిత్తం పరిహారంగా రూ. 17 వేలు తక్షణం చెల్లించాలని కోరింది.
రూ. 5 లక్షలు డిపాజిట్ చేయాలని ఆదేశం
మోర్ చేసిన అన్ ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ నిర్వాకంపై స్పందించి మరిన్ని రూల్స్ అమలుజరిపింది. చాలా కాలంగా ఇలా చట్ట విరుద్ద కార్యకలాపాలు జరిపినందుకు వినియోగదారుల సంక్షేమ నిధి క్రింద (సీడబ్ల్యూఎఫ్) రూ. 5 లక్షలు జమ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. భవిష‌్యత్తులో వస్తువు పై ఉన్న ధరకంటే అధికంగా డబ్బులు వసూలు చేయకూడదని సూచిస్తూ కమిషన్ అధ్యక్షులు కె. కిషోర్ కుమార్, సభ్యులు ఎన్. నారాయణ రెడ్డి, నజీమా కౌసర్ లతో కూడిన త్రిసభ్య బెంచ్ ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
T.V.SRIKAR